ETV Bharat / state

మా ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులివ్వండి : కేంద్రమంత్రులకు సీఎం రేవంత్ రిక్వెస్ట్

కేంద్రమంత్రులను కలిసి విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి - కేంద్రమంత్రులు సీఆర్‌ పాటిల్, భూపేందర్‌ యాదవ్‌లతో భేటీ - 4 సాగు నీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి

TUMMIDIHETTI PROJECT IN TG
CM Revanth Reddy On Tummidihetti Project (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 6, 2026 at 7:32 AM IST

3 Min Read
Choose ETV Bharat

CM Revanth Reddy On Tummidihetti Project : ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పాలమూరు-రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మ సాగర్, డిండి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపైనా వినతిపత్రం అందజేశారు. దిల్లీలో బుధవారం కేంద్రమంత్రులను కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి కీలకమైన ఈ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు సహకరించాలని కోరారు.

తెలంగాణకు సంబంధించిన ఐదు ముఖ్యమైన ప్రాజెక్టుల అనుమతుల విషయమై సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీలో ఇద్దరు కేంద్రమంత్రులను కలిసి చర్చించారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో కలిసి కేంద్రమంత్రులతో భేటీ అయిన సీఎం, వినతిపత్రాలు అందించారు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పించాలని జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌కు, పాలమూరు-రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మ సాగర్, డిండి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌కు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమైన ప్రాజెక్టులకు వాటి నిర్మాణ పనులు ప్రారంభమైన తర్వాత కూడా పర్యావరణ అనుమతులివ్వడానికి వెసులుబాటు కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రాజెక్టుల అంశాన్ని కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.

గతంలోనే ఒప్పందం కుదిరింది : తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపు తెలంగాణకు అత్యవసరమని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ ప్రాజెక్టుకు మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించాలని సీఆర్‌పాటిల్‌ను సీఎం కోరారు. దీనిపై తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖ, ప్రధానమంత్రి కార్యాలయం స్పందించి జలశక్తి శాఖ పరిశీలనకు పంపిన విషయాన్ని పాటిల్‌ వద్ద ముఖ్యమంత్రి ప్రస్తావించగా, ఆ లేఖ అందిందని ఆయన అంగీకరించారు. తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మాణానికి గతంలోనే రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

బ్యారేజీ నిర్మాణాన్ని 152 మీటర్ల ఎత్తు వరకు పెంచితే ఎదురయ్యే అంశాలపై పుణెలోని సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అధ్యయనం చేసిందని 148, 152 మీటర్ల ఎత్తున నిర్మించినా ముంపులో పెద్దగా ఏ సమస్య లేదని స్పష్టంగా రిపోర్టు ఇచ్చినట్లు తెలిపారు. ముంపునకు గురయ్యే భూభాగంలో 50 శాతం నదీ గర్భంలోనే ఉంటుందని 148 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మాణం చేపడితే గ్రావిటీ ద్వారా కావాల్సినంత నీటిని ప్రాజెక్టులకు సరఫరా చేయలేమని తెలిపారు. అందువల్ల 150 నుంచి 152 మీటర్ల ఎత్తున నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని, దీనిపై సాధ్యమైనంత త్వరగా తెలంగాణ-మహారాష్ట్రల మధ్య సమావేశం ఏర్పాటు చేయించాలని కోరారు.

సాగునీటి వసతి ఏర్పడుతుంది : ఈ ప్రాజెక్టు పూర్తయితే పూర్తిగా వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు సాగునీటి వసతి సౌకర్యం వస్తుందని సీఎం వివరించారు. ఇందుకు సీఆర్‌ పాటిల్‌ స్పందిస్తూ దీనిపై మొదట కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ, మహారాష్ట్ర స్థాయి అధికారులతో చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. తర్వాత ఇరురాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

పాలమూరు-రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మ సాగర్, డిండి ప్రాజెక్టులకు సత్వరమే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుపై రూ.36,437 కోట్లు, డిండిపై రూ.3,187 కోట్లు, సీతమ్మ సాగర్‌పై రూ.1,835 కోట్లు, గౌరవెల్లి ప్రాజెక్టుపై రూ.1,350 కోట్లు ఖర్చు చేసిందని కేంద్ర మంత్రికి తెలిపారు. కేంద్రం అనుమతులు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయి అంచనా వ్యయం పెరుగుతోందని సీఎం గుర్తు చేశారు.

'తెలంగాణలో పోలీస్ నియామక ప్రక్రియ - అడ్డుకోవాలని చూస్తున్న కొన్ని శక్తులు'

మీ పెట్టుబడికి - మాదీ లాభాల గ్యారెంటీ : పారిశ్రామికవేత్తలకు సీఎం భరోసా