ఫ్యూచర్ సిటీలోని అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో తీర్చి దిద్దాలి : సీఎం రేవంత్ రెడ్డి
ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో పర్యాటకశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష - ఫ్యూచర్ సిటీలోని అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని, ట్రాఫిక్ మళ్లించి బ్రిడ్జిలపై పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు

Published : July 6, 2026 at 3:05 PM IST
|Updated : July 6, 2026 at 7:52 PM IST
CM Revanth Reddy Reviews Tourism Sector : హైదరాబాద్ కోర్ అర్బన్‌లో టూరిజం విస్తృతంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తారామతి, బారామతిని మరింత అభివృద్ధి చేయాలని, దుర్గం చెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం తెలిపారు. మంజీరా, దిల్ కుషా గెస్ట్ హౌజ్‌లను ఆధునికీకరించాలని చెప్పారు.
అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలి : క్యూర్ పరిధిలోని అటవీ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ఫ్యూచర్ సిటీలో అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి తెలిపారు. అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని, దీని కోసం స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని చెప్పారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలో మరిన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ట్రాఫిక్ మళ్లించి పర్యాటకులకు అవకాశం కల్పించాలి : హైదారాబాద్ నగరంలో పురానాపూల్ వంటి వారసత్వ సంపదగా నిలిచిన బ్రిడ్జిలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని, అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. అభివృద్ధి చేసిన తర్వాత అవసరమైతే ట్రాఫిక్‌ను మరో మార్గం నుంచి మళ్లించి పర్యాటకులకు అవకాశం కల్పించాలని సూచించారు.
రాష్ట్రంలో తలపెట్టిన పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి నిర్దేశించుకున్న పనులను వేగవంతం చేయడానికి పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో… pic.twitter.com/fnfn5cBUrM
— Telangana CMO (@TelanganaCMO) July 6, 2026
ఆలయ కమిటీ ఏర్పాటు చేయాలి : డిసెంబరులో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌కు ఏర్పాట్లు ప్రారంభించాలన్న సీఎం వివిధ శాఖ మధ్య సమన్వయం కోసం కమిటీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్‌ను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. వికారాబాద్‌లో వీరభద్రస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలన్న సీఎం యాదాద్రి తరహాలో ఆలయ కమిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో సీఎం సలహాదారు కె.రామకృష్ణా రావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ టూరిజానికి గోల్డెన్ ఛాన్స్ - ప్రతి కేంద్రానికి రూ.500 కోట్ల నిధులు

