ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ పడొద్దు : సీఎం రేవంత్‌రెడ్డి
విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష - కోర్ అర్బన్ రీజియన్‌లో ప్రభుత్వ స్కూల్స్‌లో మౌలిక సదుపాయాల కల్పన పైన దృష్టి సారించాలని ఆదేశం - సమగ్ర నివేదిక అందించిన రాష్ట్ర విద్యా కమిషన్

Published : February 26, 2026 at 7:28 PM IST
|Updated : February 26, 2026 at 8:00 PM IST
CM Revanth Reddy Review on Education Department : భారతీయ విద్యా భవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఉన్న మౌలిక సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విద్యాశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. కోర్ అర్బన్ రీజియన్‌లో ప్రభుత్వ స్కూల్స్‌లో మౌలిక సదుపాయాల కల్పన పైన దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడొద్దని అన్నారు.
అన్ని సౌకర్యాలు కల్పించాలి : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు సీఎం సూచనలు చేశారు. బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌లో తప్పని సరిగా పాలు ఉండేలా చూడాలని, ఆ పాలు విజయ డైరీ నుంచి సేకరించాలని అన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత కోసం ఏఐ టెక్నాలజీ వినియోగించాలన్న సీఎం కోర్ అర్బన్ రీజియన్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కో మండలంలో ఆరుట్ల స్కూల్ తరహాలో రవాణాతో సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ట్రాన్స్పోర్ట్ కోసం ఎలక్ట్రికల్ బస్‌ల ఏర్పాటుపైన అధ్యయనం చేయాలని సూచించారు. ప్రైవేట్ స్కూల్స్‌లో నిబంధనలకు మించి ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దుతో పాటు రికవరీ చేసేలా నిబంధన విధించాలని ఆదేశించారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు సంబంధించి రికమండేషన్లని ప్రజాభిప్రాయం కోసం వెబ్సైట్లో ఉంచాలని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర విద్యావిధానం పై ఈ రోజు విద్యా కమిషన్ ఛైర్మన్ శ్రీ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు… నాకు నివేదిక సమర్పించారు.#YoungIndia #TelanganaEducation #EducationCommission #TelanganaRising pic.twitter.com/MQiMkLymGo
— Revanth Reddy (@revanth_anumula) February 26, 2026
విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని నివేదిక : తెలంగాణ రాష్ట్ర విద్యావిధానం రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించారు. అనంతరం ఆకునూరి మురళి మీడియాతో మాట్లాడుతూ 305 స్కూళ్లను సందర్శించామని తెలిపారు. కేవలం పాఠశాల విద్యాలోనే 52 అంశాలతో కూడిన నివేదికను రేవంత్ రెడ్డికి సమర్పించినట్లు చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లతో 46 సమావేశాలు జరిపామని అన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెట్టాలని సిఫార్సు చేశామని, విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని నివేదికను రూపొందించామని తెలిపారు.
ప్రభుత్వం పాఠశాలల్లో బస్సు సౌకర్యం ఏర్పాటు : ప్రైవేటు స్కూళ్లలో ఫీజులపై కొన్ని సిఫార్సులు చేశామని, స్కూల్ డిస్ట్రిక్ ఉండాలని కొన్ని సిఫార్సులు చేశామని, ఒకటో తరగతి నుంచి మూడు భాషల విధానం ఉండాలని సిఫార్సు చేశామని ఆకునూరి మురళి అన్నారు. గతంలో ఆరుట్ల స్కూల్‌లో 600 మంది ఉండేవారని, ప్రస్తుతం ఆరుట్ల స్కూల్‌లో 1,600 మంది విద్యార్థులకు పెరిగారని గుర్తు చేశారు. ప్రతి మండలంలో రెండు ప్రభుత్వం పాఠశాలల్లో బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారని తెలిపారు.
నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు ఇంగ్లిష్‌లో భోధన : రాష్ట్రంలో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు 434 సిఫార్సులు చేసినట్లు ఆకునూరి మురళి వెల్లడించారు. ప్రతి మండలంలో సగటున 3 పాఠశాలలు ఉండేలా చర్యలు చేపట్టాలని నివేదించినట్లు తెలిపారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు ప్రత్యేకమైన వ్యవస్థ ఉండాలని సిఫార్సు చేసినట్లు మురళి వివరించారు. నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు ఇంగ్లిష్‌లో భోధన ఉండాలని నివేదికలో పేర్కొన్నట్లు చెప్పారు.
"కేవలం పాఠశాల విద్యాలోనే 52 అంశాలతో కూడిన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించాం. 305 స్కూళ్లను సందర్శించాం. స్కూల్ డిస్ట్రిక్ ఉండాలని కొన్ని సిఫార్సులు చేశాం. ఒకటో తరగతి నుంచి మూడు భాషల విధానం ఉండాలని సిఫార్సు చేశాం. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు ప్రత్యేకమైన వ్యవస్థ ఉండాలని సిఫార్సు చేశాం." - ఆకునూరి మురళి, తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్
పాలకుడిగా నేను ఎప్పుడూ ప్రవర్తించలేదు - సేవకుడిగా మాత్రమే వ్యవహరిస్తున్నా : సీఎం రేవంత్ రెడ్డి

