జీఎస్టీ కౌన్సిల్ తరహాలో ఏఐ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ - 2026లో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి - ఏఐ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్య - హైదరాబాద్‌లో ఏఐ రంగంలో పెట్టుబడి పెట్టాలని పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి

Published : February 20, 2026 at 3:33 PM IST
|Updated : February 20, 2026 at 4:20 PM IST
CM Revanth On AI Impact Summit : కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఆర్టిఫిషియల్(కృత్రిమ మేధ) ఇంటెలిజెన్స్ మంత్రిత్వ శాఖ అవసరమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ పరిణామాలు పర్యవేక్షించేందుకు జాతీయ ఏఐ వార్ రూమ్ ఉండాలని ప్రతిపాదించిన సీఎం కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్‌లోనే నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. ప్రపంచ స్థాయి పరిశోధనలకు ఊతమిచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని దేశంలో స్థాపించాలని సీఎం అన్నారు. దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచే ఏఐ స్టార్టప్ విలేజ్ ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.
ప్రపంచమంతటినీ ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ఏఐ వినియోగం, నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు, జాతీయ భద్రత తదితర అంశాలను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరమన్నారు. దిల్లీలో నిర్వహించిన ఏఐ సమ్మిట్‌లో ప్రసంగించిన సీఎం మానవ చరిత్రలో అగ్ని, చక్రం, వ్యవసాయం, విద్యుత్, ఇంటర్నెట్ వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఎలా మార్చాయో గుర్తుచేశారు. ఏఐ కూడా అలాంటి విప్లవాత్మక సాంకేతికతేనని ఇది మానవ పరిణామ క్రమంలో అత్యంత శక్తివంతమైన మలుపని సీఎం అభివర్ణించారు.
ఏఐ రోడ్‌మ్యాప్ అవసరం : మునుపటి యంత్రాల మాదిరిగా కాకుండా ఏఐ స్వయంగా నేర్చుకోగలదని, విశ్లేషించగలదని, నిర్ణయాలు తీసుకోగలదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రోబోటిక్స్‌తో కలిసినప్పుడు యంత్రాలు మేధస్సుతో పాటు శారీరక సామర్థ్యాన్ని కూడా పొందుతున్నాయని అన్నారు. ప్రపంచ ఏఐ పోటీ ఇప్పటికే ప్రారంభమైందని కొన్ని దేశాలు, కంపెనీలు ముందంజలో ఉన్నాయని సీఎం చెప్పారు. పారిశ్రామిక విప్లవాల సమయంలో జరిగిన నష్టాలను గుర్తు చేస్తూ, ఈసారి భారత్ అలాంటి తప్పిదం చేయకూడదని హెచ్చరించారు. సేవలు, సాఫ్ట్‌వేర్ రంగాల్లో విజయం సాధించిన భారత్ ప్రపంచ స్థాయి కోర్ టెక్నాలజీ ఉత్పత్తుల్లో కూడా నాయకత్వం వహించాలన్నారు. దేశానికి తక్షణ జాతీయ ఏఐ రోడ్‌మ్యాప్ అవసరమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. సెమీకండక్టర్ చిప్ తయారీ, జీపీయూ సామర్థ్యాలు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ వినియోగం, ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు, అప్లికేషన్ల అభివృద్ధిలో భారత్ స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగాలని సూచించారు.
ఏఐ వార్‌రూమ్ ఏర్పాటు చేయాలి : ప్రపంచవ్యాప్తంగా ఏఐ పరిణామాలను నిశితంగా పర్యవేక్షించేందుకు కేంద్రం–రాష్ట్రాల సమన్వయంతో జాతీయ ఏఐ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్‌లోనే ఆ వార్ రూమ్ నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రపంచ స్థాయి పరిశోధనలకు ఊతమిచ్చే ఏఐ యూనివర్సిటీని దేశంలో స్థాపించాలని సూచించారు. ఏఐ విస్తరణ నేపథ్యంలో ఉపాధిపై తలెత్తుతున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ కొన్ని రంగాల్లో ఉద్యోగ నష్టాలు సంభవించవచ్చనన్నారు. అయితే సరైన రీ-స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్ చర్యల ద్వారా ఏఐ వల్ల సృష్టించబడే కొత్త అవకాశాలు మరింత విస్తృతంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.
మేం సిద్ధం : యువతను ఏఐ-ఆధారిత భవిష్యత్తుకు సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. స్టార్టప్‌లకు మద్దతు కల్పించేందుకు జాతీయ ఏఐ నిధి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచే ఏఐ స్టార్టప్ విలేజ్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఏఐ రంగంలో విధానాలు, చట్టాలు, నైతిక ప్రమాణాలకు మార్గనిర్దేశం చేసే అత్యున్నత సంస్థగా ఇండియా ఏఐ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రిని కోరారు. సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన, ప్రజా సేవల మెరుగుదల, జాతీయ భద్రతకు తోడ్పడేలా ఏఐ అభివృద్ధి ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బాధ్యతాయుతమైన, సమ్మిళిత, భవిష్యత్ దృష్టితో కూడిన ఏఐ వ్యవస్థను నిర్మించేందుకు ప్రపంచ నిపుణులు, సంస్థలు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. ఈ మార్పు యుగంలో భారత్ నాయకత్వం వహించాల్సిన సమయం ఇదేనని సీఎం స్పష్టం చేశారు
"ఏఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదగాలి. గ్రీన్ ఎనర్జీ, డేటా స్టోరేజ్, అప్లికేషన్స్‌లో మరింత అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్రాల్లో ఏఐ అభివృద్ధిని పర్యవేక్షించేందుకు వార్‌రూంను ఏర్పాటు చేయాలి. ఆ రంగంలో మరింత వృద్ధిని సాధించేందుకు వార్‌రూం ఉపయోగపడుతుంది. హైదరాబాద్‌లో ఏఐ వార్ రూం ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రదేశం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఏఐ రంగంలో అగ్రగామిగా ఉండేందుకు జీపీయూ, చిప్స్‌ల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలి. జీఎస్టీ కౌన్సిల్ తరహాలో ఏఐ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
2034 నాటికి 'నెట్ జీరో' నగరంగా హైదరాబాద్ మెట్రో పాలిటన్ ప్రాంతం : సీఎం
భారత్‌తోనే కాదు ప్రపంచ అగ్రగామి క్లస్టర్లతో పోటీపడుతున్నాం : రేవంత్ రెడ్డి

