నేనూ డాక్టర్నే! - కానీ సోషల్ డాక్టర్‌ను : సీఎం రేవంత్ రెడ్డి
హెచ్‌ఐసీసీలో ఫెలోస్ ఇండియా సదస్సు - ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్, ట్రైనింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సదస్సు - ఫెలోస్ ఇండియా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

Published : January 10, 2026 at 10:37 PM IST
|Updated : January 11, 2026 at 7:02 AM IST
CM Revanth Reddy Participated Fellows India 2026 : ప్రజారోగ్య సంరక్షణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాలసీలు మెరుగుపరచడానికి వైద్యులతో కలిసి పని చేసేందుకు సిద్ధమని సూచనలు ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు వైద్యులు స్వచ్ఛందంగా సీపీఆర్ నేర్పిస్తే చాలా మంది ప్రాణాలు కాపాడగలమని సీఎం అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫౌండేషన్ నిర్వహించిన ఫెలోస్ ఇండియా కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది : తాను వైద్యుడిని కాకపోయినప్పటికీ సామాజిక రుగ్మతలకు చికిత్స చేసే డాక్టర్‌నని సీఎం వ్యాఖ్యానించారు. వైద్యులు ప్రజలు, సమాజంపై తమ బాధ్యతను ఎప్పటికీ మరచిపోవద్దని సీఎం అన్నారు. వైద్యులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవాలని, అయితే ప్రజల నాడిని పట్టుకోవడం మరిచిపోవద్దని సీఎం పేర్కొన్నారు. గుండె జబ్బులను నివారించే మిషన్‌లో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం, వైద్యులు కలిసి పని చేద్దామని సీఎం అన్నారు. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ కోసం అందరూ కృషి చేయాలని కోరారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ అనుబంధ రంగాల్లో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలోనే అత్యుత్తమంగా తెలంగాణ ఉండాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
"నేను వైద్యుడిని కాదు కానీ నేనూ డాక్టర్నే సోషల్ డాక్టర్‌ను. లైఫ్ సైన్సెస్, ఫార్మా ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది. హెల్త్ కేర్ ఆవిష్కరణ కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది. మనుషులు, సమాజంపై వైద్యులు తమ బాధ్యతను ఎప్పటికీ మరచిపోవద్దు. వైద్యులు అధునాతన సాంకేతికతను అప్‌గ్రేడ్ చేసుకోవాలి. గుండె జబ్బులను నివారించే మిషన్‌లో మనం భాగస్వాములం అవుదాం. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మనం కలిసి పని చేద్దాం. క్వాలిటీ ఆఫ్ హెల్త్‌కేర్ కోసం అందరూ కృషి చేయాలి. ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలోనే అత్యుత్తమం కావాలి."- రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
విద్యార్థులకు సీపీఆర్ నేర్పించేందుకు వైద్యులు స్వచ్ఛందంగా ముందుకొస్తే ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇలాంటి సదస్సులు హైదరాబాద్‌లో జరగడం తనకెంతో గర్వంగా ఉందన్నారు. మీరంతా విజయవంతమైన కార్డియాలజిస్టులైన ఎప్పటికప్పుడు మీ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి ఇలాంటి సదస్సులు బాగా ఉపయోగపడతాయని తెలిపారు. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యమని, కొత్త విషయాలను తెలుసుకోవడం, నైపుణ్యాన్ని పెంచుకోవడం మానేస్తే కెరీర్‌కు ముగింపు పలికినట్లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.
‘‘ప్రజల ఆరోగ్య సంరక్షణకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. వైద్యారోగ్య రంగాల అభివృద్ధికి ఉత్తమ పాలసీల కోసం వైద్యులతో కలిసి పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్‌కేర్ ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచమంతా ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వైపు వేగంగా పరుగులు తీస్తోంది. మీరు కూడా అధునాతన సాంకేతికతను సొంతం చేసుకోవాలి. అదే సమయంలో రోగుల నాడిని పట్టుకోవడం విస్మరించొద్దు. ప్రస్తుతం గుండె జబ్బులు పెరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు మనమందరం కలిసి కృషి చేయాలి"- రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
ఈ సదస్సులో భాగంగా క్లిష్టమైన కరోనరీ యాంజియోప్లాస్టీలు, ఆధునిక వాల్వులర్ ప్రొసీజర్లు, కొత్త వైద్య పరికరాలు, భవిష్యత్ కార్డియాలజీపై వైద్యులు ప్రత్యేక చర్చ నిర్వహించారు. సదస్సులో మెడికవర్ సీఎండీ డాక్టర్ అనిల్‌కృష్ణ, ఆర్గనైజింగ్ ఛైర్మన్ డాక్టర్ ఎన్.ప్రతాప్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ శరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్టార్టప్‌ల కోసం రూ.1000 కోట్ల ఫండ్ - గూగుల్ అంత ఎత్తుకు ఎదగాలన్న సీఎం రేవంత్

