ETV Bharat / state

తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ ఆధిపత్యాన్ని స్వీకరించరు : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ ఆధిపత్యాన్ని స్వీకరించరన్న సీఎం - సమక్క, సారక్క, కాకతీయులు ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడారని వ్యాఖ్య - టీజీపీఎస్సీ ప్రక్షాళన చేశామని స్పష్టీకరణ

CM REVANTH REDDY
CM REVANTH REDDY (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 26, 2026 at 7:58 PM IST

|

Updated : February 26, 2026 at 8:39 PM IST

3 Min Read
Choose ETV Bharat

CM Revanth Reddy in MCHRD : తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ ఆధిపత్యాన్ని స్వీకరించరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలకులకు వ్యతిరేకంగా కొట్లాడేవారు శ్రీమంతులు కాదని పేర్కొన్నారు. సమక్క, సారక్క, కాకతీయులు ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. హైదరాబాద్​లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న గ్రూప్–1, 2 అధికారుల వెలిడిక్టరీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇందులో 271 మంది గ్రూప్–1, 171 మంది గ్రూప్–2 అధికారులు, 51 మంది మిలటరీ ఇంజినీరింగ్ సర్వీస్ ఉద్యోగులు ఉన్నారు.

టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశాం : స్యాతంత్య్రానంతరం నల్గొండ పార్లమెంటు నుంచి దివంగత రావి నారాయణరెడ్డి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిచారని అన్నారు. బూర్గుల రామకృష్ణరావు, పీవీ తెలంగాణ నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారన్నారు. గ్రూప్‌-1 పరీక్షలను నిర్వహించి నియామక పత్రాలను అందించామన్న సీఎం ప్రశ్నాపత్రాలు జిరాక్స్‌ సెంటర్లలో అమ్మకుండా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్​ను ప్రక్షాళన చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అభ్యర్థుల తరపున పోరాటం చేశామని గుర్తుచేశారు. కోర్టుల్లో వాదనలు బలంగా వినిపించామని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను కుటుంబసభ్యులుగా భావిస్తుందన్నారు.

న్యాయస్థానాల్లో లిటిగేషన్ పెట్టారు : బాగా చదువుకున్న వాళ్లను టీజీపీఎస్సీలో నియమించామని, అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకున్నామని కోర్టుల్లో లీగల్ లిటిగేషన్ పెట్టారన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క తప్పు కూడా చేయలేదని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులనే రాష్ట్ర ప్రతినిధులుగా భావిస్తోందని, వారి ద్వారానే ప్రభుత్వ పథకాలు అమలు అవుతాయని చెప్పారు. ఉద్యోగులే తమ కళ్లు, తమ ప్రతినిధులని కొనియాడారు. తాము ఎన్ని పాలసీలు చేసినా దానిని అమలులో ఉద్యోగులే చాలా ముఖ్యమన్నారు.

"మీకు ఉద్యోగాలు వచ్చాయన్న సంతోషాన్ని కొంతమంది ఒక్క రోజు కూడా మిగిలించలేదు. ప్రభుత్వం గ్రూప్​-1 ఉద్యోగాలను అమ్ముకుందని గిట్టని వాళ్లు ప్రచారం చేశారు. న్యాయస్థానాల్లో కూడా లీగల్ లిటిగేషన్లు పెట్టారు. రాజకీయ పార్టీలు చేసిన ఆరోపణలు మీరు చూశారు. ఎక్కడా కూడా ప్రభుత్వం తప్పులు చేయలేదు. ఆ అవకాశం ఇవ్వదు. ఈ పిల్లలు మెరిట్​లోనే సెలెక్ట్​ అయ్యారు. వాళ్లమీదున్న నమ్మకమే గ్రూప్​-1,2 అధికారులుగా చేసింది. ఎవరూ ఏమనుకున్నా వాళ్ల పక్షాన నేను నిలబడ్డాను. మీలో చాలామంది ఐఏఎస్​, ఐపీస్​లుగా అవ్వడానికి అవకాశం ఉంది. బాధ్యాతయుతంగా పనిచేయండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు సేవ చేయండి" -రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి

ఇదొక ఎమోషన్ : మెకానికల్​గా శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులను కలవటానికి రాలేదన్న సీఎం ఇదొక భావోద్వేగమని తెలిపారు. చిత్తశుద్ధితో పని చేసి గ్రూప్​-1 అధికారులు ఐఏఎస్‌లుగా ఎంపిక కావాలని చెప్పారు. ఇందులో నుంచి కొద్దిమందే ఐఎఎస్ ఐపీఎస్​లుగా అవుతారని మీపై ఉన్న బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. ఉద్యోగులను ఉద్దేశించి మన మూలాలు, నేపథ్యం గుర్తుపెట్టుకుని ప్రజలకు సేవ చేయాలని సూచించారు.

మరో ఆరు నెలల్లో హైదరాబాద్​కు హర్వర్డ్ : ముందుగా నిరుద్యోగుల నుంచి ఉద్యోగులుగా మారిన వారందరూ ఇప్పుడు తల్లిదండ్రులను మంచిగా చూసుకోకపోతే తన ఆలోచన విఫలం అయినట్లుగానే భావిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తల్లిదండ్రులను చూసుకోకపోతే వారి జీతాల నుంచి 10 నుంచి 15 శాతం కోత విధించే పాలసీని రాబోయే అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు. ఈ మధ్య తాను కూడా హర్వర్డ్ యూనివర్సిటిలో స్టూడెంట్​గా వెళ్లానన్న సీఎం ఎంసీహెచ్​ఆర్డీ హార్వర్డ్ మధ్య ఎంవోయూ చేస్తానని ప్రకటించారు. మరో ఆరు నెలల్లో హార్వర్డ్ యూనివర్సిటీ ఎంసీహెచ్​ఆర్డీకీ రాబోతుందన్నారు. హార్వర్డ్​ను హైదరాబాద్​కు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ నిర్మాణంలో రాజీ పడొద్దు : సీఎం రేవంత్‌రెడ్డి

వచ్చే రెండు, మూడేళ్లలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

Last Updated : February 26, 2026 at 8:39 PM IST