పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ - క్షేత్రస్థాయిలో పరిశీలన
ఇవాళ, రేపు పాలమూరు జిల్లాలో సీఎం సుడిగాలి పర్యటనలు - పెండింగ్ ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్న సీఎం - ఇవాళ సాయంత్రం సోమశిలలో జిల్లాలోని ప్రాజెక్టులపై సమీక్ష

Published : June 4, 2026 at 7:41 AM IST
CM Revanth Reddy Palamuru Rangareddy Project Visit : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతుల పరిశీలనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. నేడు, రేపు ఉమ్మడి జిల్లాలోని నారాయణపేట-కొడంగల్, పాలమూరు-రంగారెడ్డితోపాటు పెండింగ్ ప్రాజెక్టుల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఇవాళ సాయంత్రం కొల్లాపూర్‌లోని సోమశిలలోనే బస చేయనున్న సీఎం, ప్రాజెక్టులపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రేపు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులోని పలు ప్యాకేజీలను పరిశీలిస్తారు. అనంతరం జడ్చర్లలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.
పనుల పురోగతిని పరిశీలించేందుకు పర్యటన : ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. పెండింగ్ పనులను పూర్తి చేసి రైతులకు నీళ్లందించే లక్ష్యంతో కార్యాచరణ చేపట్టింది. ఇటీవలే జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమైన సీఎం రేవంత్‌రెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఎన్ని నిధులైనా ఇస్తానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో సందర్శించి పనుల పురోగతిని పరిశీలించేందుకు సీఎం రేవంత్ పాలమూరు జిల్లా పర్యటన చేపట్టారు. ఇవాళ, రేపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, పంప్ హౌస్‌లను పరిశీలించనున్నారు. సాయంత్రం నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిలకు చేరుకుంటారు. అక్కడి మృగవాణి రిసార్ట్ రివర్ ఫ్రంట్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
రిజర్వాయర్లను ఏరియల్ వ్యూ ద్వారా : రేపు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి నివాసంలో అల్పాహారం అనంతరం కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు పంప్ హౌస్‌కు సీఎం చేరుకుంటారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్యాకేజీ-3 హెడ్ రెగ్యులేటర్, ప్యాకేజీ-2 నార్లాపూర్ రిజర్వాయర్, ప్యాకేజీ-1 డెలివరీ సిస్టర్న్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిఫ్ట్-1 పంప్ హౌస్‌లను పరిశీలిస్తారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్యాకేజీ-3లోని కాలువ పనులు, ఏదుల రిజర్వాయర్, పంప్ హౌస్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. పీఆర్ఎల్ఐలోని కరివెన రిజర్వాయర్ ప్యాకేజీ 14, 15 పనులను పర్యవేక్షిస్తారు. జడ్చర్లలో బహిరంగ సభ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.
పాలమూరు జిల్లా స్వరూపమే మారబోతుంది : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నీటిపారుదల స్వరూపాన్ని మార్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం బలమైన లక్ష్యాన్ని పెట్టుకుందని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేడు, రేపు (4,5 తేదీల్లో నేడు, రేపు) ఈ జిల్లా పర్యటనతో పాలమూరు ప్రాజెక్టుల స్వరూపమే మారుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని జలసౌధలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల స్థితిగతులు, సీఎం పర్యటన ఏర్పాట్లపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
బిల్లుల చెల్లింపుపై సీఎం భరోసా : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి పూర్తి చేయించాలని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో ఆదేశించారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలైనంత త్వరగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయిస్తే నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా తానే బాధ్యత తీసుకుంటానని సీఎం భరోసా ఇచ్చారు. సాగు నీటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి : సీఎం ఆదేశాలు
నత్తనడకన సాగుతున్న పాలమూరు పెద్దాసుపత్రి నిర్మాణం - పేదలకు తప్పని ఎదురుచూపులు

