ETV Bharat / state

రెండేళ్ల పాలనను ప్రజలు నిశితంగా పరిశీలించి తీర్పు ఇచ్చారు: సీఎం రేవంత్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం - భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం

CM REVANTH ON NAVEEN YADAV VICTORY
CM REVANTH ON NAVEEN YADAV VICTORY (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : November 14, 2025 at 6:32 PM IST

|

Updated : November 14, 2025 at 8:01 PM IST

4 Min Read
Choose ETV Bharat

CM Revanth Reddy on Congress Party Victory In Jubilee Hills : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో సీఎం మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం హైదరాబాద్‌ నగర ప్రజల్లో కాంగ్రెస్‌పై నమ్మకం క్రమంగా పెరుగుతోందన్నారు. జూబ్లీహిల్స్‌లో విజయం అందించిన ప్రజలకు ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నవీన్‌ యాదవ్‌ విజయం కోసం కృషి చేసినటువంటి కాంగ్రెస్​ పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌ నగరంలో హస్తం పార్టీకి సరైన ఫలితాలు రాలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్ల పాలనను ప్రజలు నిశితంగా పరిశీలించి ఈ తీర్పును ఇచ్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రాభివృద్ధికి కేంద్రమంత్రులు కలిసి రావాలి : 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 39శాతం ఓట్లు వచ్చాయన్న సీఎం రేవంత్ రెడ్డి, 6 నెలల తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాకు ఓట్లశాతం 42కు పెరిగిందన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు 51శాతం ఓట్లను ప్రజలు ఇచ్చారని ఆయన వివరించారు. సంక్షేమ పథకాలను అందిస్తున్న సర్కారును ప్రజలు ఆశీర్వదించారని హర్షం వ్యక్తం చేశారు. గెలుపోటములకు కాంగ్రెస్‌ పొంగిపోదు, కుంగిపోదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల తరఫున నిలబడటం, పోరాడటమే కాంగ్రెస్‌ పార్టీ కర్తవ్యమన్నారని రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్ర ఆదాయంలో 65శాతం వరకు హైదరాబాద్‌ నగరం నుంచే వస్తోందని ఆయన వెల్లడించారు. దీనికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

తీరుమారకుంటే అలాంటి ఫలితాలు వస్తాయి : హైదరాబాద్‌ నగరాన్ని సమస్యల రహిత నగరంగా తీర్చి దిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా కిషన్‌రెడ్డి సహాయ నిరాకరణ చేస్తున్నారని ఆరోపించారు. అనేక ప్రాజక్టులకు అనుమతులు రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. మెట్రో, మూసీ ప్రక్షాళన వంటి వాటికి అనుమతులను అడ్డుకుంటున్నారని రేవంత్ మండిపడ్డారు.

కిషన్‌రెడ్డి ఎంపీ నియోజకవర్గంలోనే బీజేపీ బాగా ఓట్లు తగ్గాయని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ ఓట్లు 65వేల నుంచి 17 వేలకు ఎందుకు తగ్గాయో కిషన్‌రెడ్డి ఆలోచించాలన్నారు. ఆయన వ్యవహార శైలిని ప్రజలు గమనించారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. భూ కంపానికి ముందు వచ్చే ప్రకంపనగా జూబ్లీహిల్స్‌ ఫలితాన్ని చూడాలని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. తీరు మారకుంటే భూకంపం లాంటి ఫలితాలు బీజేపీకి వస్తాయిన్నారు. రాజకీయాలు మాని రాష్ట్రాభివృద్ధికి కేంద్రమంత్రులు కలిసి రావాలని, రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చే బాధ్యత కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలపై ఉందని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

రెండేళ్ల పాలనను ప్రజలు నిశితంగా పరిశీలించి తీర్పు ఇచ్చారు: సీఎం రేవంత్ రెడ్డి (ETV)

" జూబ్లీహిల్స్​ ఉపఎన్నికల్లో విలక్షణమైన తీర్పును ఇవ్వడమే కాకుండా పోలైన ఓట్లలో 51శాతం కాంగ్రెస్​ పార్టీకి ఓటెయ్యడం ద్వారా ప్రజాబలం ఈనాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఈ నగర అభివృద్ధి పూర్తిస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ తీర్పును బాధ్యతగా తీసుకుని హైదరాబాద్ అభివృద్ధి కోసం అవసరమైన ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించే విధంగా చేయాలనుకుంటున్నాం. కేంద్రం నుంచి తీసుకురావాల్సిన అనుమతులు, నిధులు రాబట్టుకోవడానికి కిషన్ రెడ్డి సహాయ నిరాకరణ చేస్తున్నారు"- రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి

కేటీఆర్‌ అహంకారం తగ్గించుకోవాలి : అసూయను తగ్గించుకోవాలని ప్రతిపక్ష నేతకు సూచిస్తున్నామని, అధికారం పోయినప్పటికీ కేటీఆర్‌లో అహంకారం, అసూయ పోలేదని రేవంత్ రెడ్డి అన్నారు. పదవులు ఎవరికీ శాశ్వతం కావని, కేటీఆర్‌ తన అహంకారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. మనం ఇంకా చాలా ఏళ్లు రాజకీయాలు చేయాల్సి ఉందన్నారు. ఫేక్‌ న్యూస్‌ రాయించి ఫేక్‌ సర్వేలు చేయించుకొని భ్రమలో బతకొద్దని హితవు పలికారు. భారత రాష్ట్ర సమితి ఓడిపోతుంది బీజేపీకి డిపాజిట్‌ రాదని ముందే చెప్పానని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

జూబ్లీహిల్స్‌లో తమకు మద్దతు ఇచ్చిన ఎంఐఎంకు ధన్యవాదాలు అని రేవంత్ రెడ్డి అన్నారు. అసదుద్దీన్‌ ఒవైసీకి కాంగ్రెస్‌ కార్యకర్తల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల పరిస్థితులను ఆధారంగా పొత్తులు, మద్దతు ఉంటుందని ఆయన వివరించారు. బిహార్‌ ఫలితాలను తాను ఇంకా సమీక్షించలేదన్నారు. జాతీయ రాజకీయాలపై ఇంకా దృష్టి సారించలేదని రేవంత్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈనెల 17న జరిగే కేబినెట్‌ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కేసీఆర్‌ ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో లేరు, ఆయన ఆరోగ్యం కూడా అంతగా సహకరించడం లేదని వివరించారు. కేసీఆర్‌ గురించి ఇప్పుడు స్పందించాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే పదేళ్లపాటు కాంగ్రెస్‌ పాలిస్తుందని, మార్పు చేసి చూపిస్తామన్నారు. సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్​ విజయం వెనుక సీఎం రేవంత్ రెడ్డి 'బిగ్​ స్ట్రాటజీ' - నవీన్​ యాదవ్​ గెలుపునకు కారణాలివే?

జూబ్లీహిల్స్​లో ఎగిరిన కాంగ్రెస్ జెండా​ - మెజార్టీ ఎంతంటే?

Last Updated : November 14, 2025 at 8:01 PM IST