హైదరాబాద్ మెట్రో రెండో దశకు అనుమతులు ఇవ్వండి - కేంద్రమంత్రిని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
మెట్రో రెండో దశకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి - మెట్రోను రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్నట్లు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం - మెట్రో రెండో దశ డీపీఆర్‌ను వెంటనే ఆమోదించండి

Published : May 6, 2026 at 5:45 PM IST
|Updated : May 7, 2026 at 10:12 AM IST
CM Revanth Reddy on Permissions for the Second Phase of Metro : హైదరాబాద్ మెట్రో రెండో దశకు త్వరగా ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో అరగంట పాటు భేటీ అయ్యారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు-ఫ్యూచర్ సిటీ కారిడార్‌ను ఫేజ్-3 కింద చేపట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం సాయంత్రం ఇక్కడ ఖట్టర్‌తో సమావేశమై ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రోను విస్తరించాల్సిన అత్యవసరం ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు.
ఇప్పటికే డీపీఆర్ సమర్పించాం : హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహరాలశాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏడు కారిడార్లతో కూడిన మెట్రో ఫేజ్-2 సమగ్ర ప్రణాళికను రూపొందించి ఇప్పటికే డీపీఆర్ సమర్పించినట్లు కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. దిల్లీలో కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ మెట్రో ఫేజ్- రెండో దశ, మెట్రో ఫేజ్-3పై చర్చించారు.
ఢిల్లీ: హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ @mlkhattar గారికి విజ్ఞప్తి చేశారు. ఏడు కారిడార్లతో కూడిన మెట్రో ఫేజ్-II సమగ్ర ప్రణాళికను రూపొందించి డీపీఆర్‌ను ఇప్పటికే సమర్పించామని… pic.twitter.com/d0DSvYZkjH
— Telangana CMO (@TelanganaCMO) May 6, 2026
ఇప్పటికే మొదటి దశను స్వాధీనం చేసుకున్నాం : వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో ప్రయాణికుల సౌకర్యార్ధం మెట్రో సేవలను మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి దృష్టికి రేవంత్ తీసుకెళ్లారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2, ఫేజ్-3 విస్తరణ సజావుగా సాగే ఉద్దేశంతోనే మెట్రో ఫేజ్-మొదటి దశను ఎల్ అండ్ టీ, హెచ్ఎంఆర్ఎల్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని కేంద్ర మంత్రి ఖట్టర్‌కి వివరించారు. ప్రస్తుతం ఫేజ్-1 ప్రభుత్వం పరిధిలో ఉండడంతో ఫేజ్-2, ఫేజ్-3 విస్తరణ సులువు అవుతుందని గుర్తుచేశారు.
జాయింట్ వెంచర్‌గా చేపట్టాలి : హైదరాబాద్‌లో మెట్రో రైలు నెట్‌వర్క్ విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్-2లో ఏడు కారిడార్లతో 122.9 కిలో మీటర్ల మేర విస్తరణకు రూ. 38,595 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన సమగ్ర డీపీఆర్‌ను సమర్పించినట్లు సీఎం తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా చేపట్టేందుకు త్వరగా ఆమోదం తెలపాలని ఖట్టర్‌కి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో కేంద్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి కె. శ్రీనివాస్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (పట్టణ రవాణా) ఎన్.వి.ఎస్.రెడ్డి, దిల్లీ తెలంగాణ భవన్ ప్రత్యేకాధికారి సంజయ్ కుమార్, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయ కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలపై సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం - పలు సూచనలు చేసిన రఘురాం రాజన్
'కేరళలో కాంగ్రెస్ విజయం - గెలుపు వెనక తెలంగాణ సీఎం వ్యూహాలు'

