నేడే రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం - ఈసారి నియోజకవర్గానికి ఎన్ని ఇస్తారంటే?
ఆసిఫాబాద్ జిల్లా కొఠారిలో పైలాన్ ఆవిష్కరించనున్న సీఎం - ఇందిరమ్మ రెండో విడతలో భాగంగా 2 లక్షల ఇళ్ల మంజూరు - స్వతంత్ర భారత చరిత్రలోనే అతి పెద్ద గృహ విప్లవమన్న పొంగులేటి

Published : June 1, 2026 at 8:12 AM IST
Indiramma Housing Scheme Phase -2 : ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైలాన్ ఆవిష్కరించి, రెండో విడతకు శ్రీకారం చుట్టనున్నారు. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో విడతలోనూ స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇచ్చేలా పథకాన్ని అమలు చేయనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013 వరకు అమలు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మంజూరై, ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తి చేయడానికి కూడా రెండో విడతలో నిధులు ఇవ్వనున్నారు.
2023లో గృహలక్ష్మి పథకంలో ఇండ్లు మంజూరై పూర్తి చేసుకోలేకపోయిన వారికి కూడా నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నియోజకవర్గానికి 1500 ఇళ్లకు రూ.5 లక్షల చొప్పున మంజూరు చేయనున్నారు. నియోజకవర్గానికి మరో 500 పెండింగ్ ఇళ్లకు ఇందిరమ్మ నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో గుడిసెల్లో నివసిస్తున్న 13 వేల కుటుంబాలకు రెండో విడతలోనే ఇందిరమ్మ ఇల్లు కేటాయించనున్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అల్పాదాయ, మధ్య తరగతి వర్గాలకు మరో లక్ష ఇళ్లను నిర్మించనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించింది.
మొదటి విడతలో 3,24,952 ఇల్లు మంజూరు : గతేడాది ఫిబ్రవరిలో నారాయణపేట జిల్లాలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. గిరిజన నియోజకవర్గాల్లో వంద నుంచి 1500 వరకు అదనంగా ఇళ్లను కేటాయించారు. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 3,24,952 ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయి. వాటిలో 2 లక్షల 74 వేల 301 నిర్మాణాలు చేపట్టగా సుమారు లక్ష పది వేల గృహాలు ప్రవేశాలకు సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తోంది.
ఉచితంగా రూ.5 లక్షలతో భారీ గృహ నిర్మాణం : కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో రూ.లక్షన్నర, గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు రూ.72 వేలు ఇవ్వనుంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా నిధులు రాకపోవడంతో నిర్మాణాలు పూర్తి చేసిన లబ్ధిదారులకు సుమారు రూ.1.60 లక్షలు చివరి విడత బిల్లును హౌసింగ్ కార్పొరేషన్ ఇంకా ఇవ్వలేదు. కేంద్రం ఇవ్వకపోయినా లబ్ధిదారులందరికీ రూ.5 లక్షలు కచ్చితంగా ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదల సొంతింటి కలలను నెరవేర్చడానికి ఉచితంగా రూ.5 లక్షలతో భారీ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోందని పొంగులేటి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాకుండా, పేద కుటుంబాల జీవితాలను మార్చేస్తున్న సామాజిక ఉద్యమంగా మారిందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభివర్ణించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పైలాన్ ఆవిష్కరణ : మొదటి విడతలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లలో సుమారు లక్ష గృహ ప్రవేశాలకు సిద్ధమయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా కొఠారిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామూహిక గృహ ప్రవేశాల్లో పాల్గొననున్నారు. సీఎం పర్యటన కోసం జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పైలాన్ ఆవిష్కరించిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. సీఎం తమ గ్రామానికి రావడంపై కోరాఠి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొరాఠిలో కార్యక్రమం ముగిసిన తర్వాత కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్స్‌కు సీఎం చేరుకుంటారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇందిరమ్మ ఇళ్లపై పిడుగు - నిర్మాణ సామగ్రిపై లబ్ధిదారులకు అధిక భారం

