ETV Bharat / state

హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు కట్టి పేదలకు అందిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లోని నాచారంలో బాలామృతం ప్లాంటు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - బాలామృతం ప్లాంటు నాలుగైదు రాష్ట్రాలకు సరఫరా చేసేలా అభివృద్ధి చెందుతుందని వెల్లడి - ఉప్పల్‌ను అభివృద్ధి చేస్తామని హామీ

CM Revanth Reddy
CM Revanth Reddy (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : July 7, 2026 at 7:24 PM IST

|

Updated : July 7, 2026 at 8:51 PM IST

2 Min Read
Choose ETV Bharat

CM Revanth Reddy Inaugurates Balamrutham Plant in Nacharam : నాచారంలో ఏర్పాటు చేసిన బాలామృతం ప్లాంటు నాలుగైదు రాష్ట్రాలకు సరఫరా చేసేలా అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్‌లోని నాచారంలో బాలామృతం ప్లాంటు సీఎం ప్రారంభించిన అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.

టీచర్లకు ఉచిత భోజనం : మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి ఆరేళ్ల వరకు బాలామృతం ఇస్తామని, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అల్పాహారం, నాణ్యమైన భోజనం అందిస్తున్నామని సీఎం తెలిపారు. ఏటా రూ.25 వేల కోట్లు విద్య కోసం ఖర్చు చేస్తున్నామని, టీచర్లు, సిబ్బందికి అల్పాహారం, భోజనం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాం : 2 కోట్లకు పైగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్న రేవంత్ రెడ్డి ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు రూ.10 వేలు ఆదా అవుతుందని తెలిపారు. ఆర్టీసీకి ప్రభుత్వం రూ.11 వేల కోట్లు చెల్లించిందని, 3.28 కోట్ల తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం అందిస్తున్నామని గుర్తు చేశారు. త్వరలో హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు కట్టి పేదలకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 4.5 లక్షల ఇళ్లు కట్టామని పేర్కొన్నారు. పట్టణాల్లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు కట్టి పేదలకు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నామని వెల్లడించారు.

"త్వరలో హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు కట్టి పేదలకు అందిస్తాం. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 4.5 లక్షల ఇళ్లు కట్టాం. పట్టణాల్లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు కట్టి పేదలకు ఇవ్వాలని లక్ష్యం. 2034లోగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. పెట్రోల్‌ బంకులకు స్థలాలు ఇచ్చి మహిళలు నడిపేలా చర్యలు తీసుకున్నాం" - రేవంత్ రెడ్డి, సీఎం

ఉప్పల్‌ను అభివృద్ధి చేస్తాం : 2034లోగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. పెట్రోల్‌ బంకులకు స్థలాలు ఇచ్చి మహిళలు నడిపేలా చర్యలు చేపట్టామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఉప్పల్‌ అభివృద్ధి బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు.

నెలకు 10 వేల టన్నుల బాలామృతం తయారీ : అంతకు ముందు నాచారంలో బాలామృతం ప్లాంటు ప్రారంభించిన సీఎం ప్లాంటు ఆవరణలో మొక్క నాటారు. రూ.40 కోట్లతో బాలామృతం ప్లాంటు నిర్మించారు. బాలామృతం ప్లాంటు లోపల ప్రత్యేక ప్రదర్శన సీఎం తిలకించారు. ప్లాంటు ప్రత్యేకతలను నిర్వాహకులు సీఎంకు వివరించారు. బాలామృతం తయారీ విధివిధానాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్లాంటు ద్వారా గంటకు 18 టన్నుల, నెలకు 10 వేల టన్నుల బాలామృతం తయారవుతుంది. మూడేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం అందించేలా బాలామృతం తయారు చేస్తున్నారు.

ఫ్యూచర్ సిటీలోని అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో తీర్చి దిద్దాలి : సీఎం రేవంత్ రెడ్డి

Last Updated : July 7, 2026 at 8:51 PM IST