సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత కలెక్టర్లదే : సీఎం రేవంత్ రెడ్డి
ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ - జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక - అన్ని స్థాయిల ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం - కలెక్టర్ల సదస్సులో సీఎం దిశానిర్దేశం

Published : March 3, 2026 at 4:43 PM IST
|Updated : March 4, 2026 at 7:36 AM IST
CM Revanth Reddy on Public Administration Progress Plan : క్షేత్రస్థాయిలో కొందరు కలెక్టర్లు పర్యటించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్లు ప్రతి నెలా కనీసం 10 రోజులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాల్సిందేనని లేకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ జరిగినట్లు తెలిస్తే వెంటనే ఆ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని సస్పెండ్ చేస్తామని సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం హెచ్చరించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం పిలుపునిచ్చారు.
కలెక్టర్ పనితీరుకు కొలమానం : ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్‌ను అత్యంత బాధ్యతతో, ఫలితాలపై దృష్టి సారించి అమలు చేయాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మూడు నెలలు ప్రతి కలెక్టర్ పనితీరుకు కొలమానమని, వారి సర్వీస్ కెరీర్‌కు పునాదిగా నిలుస్తుందన్నారు. సచివాలయంలో జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రజలను నేరుగా కలిసే అధికారం, అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉందని గుర్తుచేశారు. జిల్లాల్లో కలెక్టర్లు ప్రతి నెలా కనీసం 10 రోజులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేసి తనకు నివేదికను అందించాలని సీఎస్ రామకృష్ణారావును ఆదేశించారు.
99 రోజుల ప్రణాళిక అమలు : ఎల్లుండి నుంచి జూన్ 12 వరకు జరిగే ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ప్రజాప్రతినిధుల సమన్వయంతో 99 రోజుల ప్రణాళిక అమలు చేయాలని సీఎం సూచించారు. కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ఈనెల 12న జిల్లా కేంద్రాల్లో ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ముందుగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలన్నీ వేడుకలా జరగాలని సీఎం సూచించారు.
కలెక్టర్లదే బాధ్యత : ప్రతి గ్రామంలో పునరుత్పాదక విద్యుత్తుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వ్యవసాయ పంపుసెట్లకు బదులు సోలార్ పంప్ సెట్ల వినియోగంతో వచ్చే లాభాన్ని కూడా రైతులకు తెలియజేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయని, ప్రతి పాఠశాలలో రోజూ ఒక్కో అధికారి మధ్యాహ్న భోజనం పర్యవేక్షించాలని, పిల్లలతో పాటు భోజనం చేసే బాధ్యతలు అప్పగించాలన్నారు. జిల్లా కలెక్టర్లు వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు.
100 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటేడ్ స్కూళ్లు : వచ్చే విద్యా సంవత్సరంలోనే 100 నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన మండలాల్లో ఒక తెలంగాణ ఇంటిగ్రేటేడ్ స్కూళ్లను ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను అందించటంతో పాటు స్కూలు బస్సులు, పాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం అక్కడే అందిస్తామని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఆరుట్ల స్కూల్‌ను తీర్చిదిద్దినట్లుగా అన్ని రకాల వసతులతో ఈ పాఠశాలలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులనూ తరచుగా సందర్శించాలని, సమస్యలు రాకముందే ముందస్తు చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి : బోగస్ ఉద్యోగులను సృష్టించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల విషయంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం హెచ్చరించారు. ఈ దందాకు పాల్పడ్డ ఏజెన్సీలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లాల్లో ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని మిల్లర్ల నుంచి తిరిగి రాబట్టుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని సీఎం అప్రమత్తం చేశారు. కొన్ని జిల్లాల్లో ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు సమాచారం వస్తోందని సీఎం అన్నారు.
ప్రాజెక్టులకు భూసేకరణ వేగవంతం : ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే చర్యలను సహంచేది లేదని ఎక్కడ ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ జరిగినట్లు తెలిస్తే వెంటనే ఆ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని సస్పెండ్ చేస్తామని సీఎం హెచ్చరించారు. భూభారతి దరఖాస్తులన్నీ గడువులోగా పరిష్కరించాలని, అక్రమాలు జరిగితే వెంటనే గుర్తించాలని సూచించారు. వివిధ ప్రాజెక్టులు, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ, మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టులు ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జూన్‌లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి సమావేశం నిర్వహిస్తామని సీఎం చెప్పారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ పడొద్దు : సీఎం రేవంత్ రెడ్డి
జీఎస్టీ కౌన్సిల్ తరహాలో ఏఐ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి

