తెలంగాణకు గొడవ కావాలా, నీళ్లు కావాలా అంటే నీళ్లే కోరుకుంటా : రేవంత్‌రెడ్డి
నీళ్ల విషయంలో వివాదాలు, రాజకీయ లబ్ధికోసం ఆలోచన చేయవద్దన్న సీఎం రేవంత్ - ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకి పెట్టవద్దని ఏపీకి విజ్ఞప్తి

Published : January 9, 2026 at 4:24 PM IST
|Updated : January 9, 2026 at 5:25 PM IST
CM Revanth Reddy on Water Disputes : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉండకూడదనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా నీళ్ల సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కోర్టుల్లో కాకుండా మన సమస్యలను మనమే పరిష్కరించుకుందామని సీఎం విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజెన్ మెడికేర్ ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నీళ్ల సమస్యపై స్పందించారు. జల వివాదం విషయంలో రాజకీయ ప్రయోజనం పొందాలని తమ ప్రభుత్వం ప్రయత్నించడం లేదని ఆయన స్పష్టం చేశారు.
మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం : పంచాయితీ కావాలా? నీళ్లు కావాలా? అని తనను అడిగితే తెలంగాణకు నీళ్లే కావాలని చెబుతానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వివాదాలు కావాలా పరిష్కారం కావాలా అని అడిగితే పరిష్కారం కావాలని చెబుతానన్నారు. మన సమస్యలను మనమే సామరస్యంగా పరిష్కరించుకుందామన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ వేదికగా కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు పెట్టకండి అని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. ఇలా అడ్డంకులతో కేంద్ర ప్రభుత్వం నిధులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని రేవంత్ రెడ్డి అన్నారు.
తాము వివాదాలు కోరుకోవడం లేదని పరిష్కారం కోరుకుంటున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రాజకీయ ప్రయోజనాలు కాదు ప్రజల ప్రయోజనాలు కోసం ఆలోచిస్తున్నామన్నారు. తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలంటే పొరుగు రాష్ట్రం సహకారం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాలు(ఏపీ, తెలంగాణ) పరస్పరం సహకరించుకుంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అశాభావం వ్యక్తం చేశారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఇలా ఏ రాష్ట్రమైనా సరే మేం వివాదాలు కోరుకోవడం లేదన్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వేస్తే తెలంగాణ 10 అడుగులు ముందుకు వేస్తుంది అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ప్రపంచ నగరాలతో పోటీ : హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీపడుతోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సుజెన్ మెడికేర్ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని కొనియాడారు. పెట్టుబడులకు లాభం వచ్చేవిధంగా ప్రభుత్వం ప్రణాళికలు ఉన్నాయని ఆయన వివరించారు. ప్రపంచ స్థాయి దేశాలతో పోటీపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని పేర్కొన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఉందన్నారు. పెద్ద కంపెనీలకు సీఈవోలుగా ఉన్నది మన దేశం వారేనని ఆయన గుర్తుచేశారు.
"మీకు నీళ్లు కావాలా? వివాదం కావాలా? అంటే నేను నీళ్లు కావాలని కోరుకుంటా. నీళ్ల విషయంలో మనం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి.పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కృష్ణానదీలో ఉన్న పాలమూరు రంగారెడ్డి, కేఎల్‌ఐ, డిండి, ఎస్‌ఎల్‌బీసీ, నెట్టెంపాడు ప్రాజెక్టులు అనుమతులకు అడ్డంకి పెట్టవద్దు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టుల అనుమతులకు సహకరించండి. అడ్డంకి పెట్టడం వల్ల పర్యావరణ, సీడబ్ల్యూసీ అనుమతులకు ఇబ్బందిగా మారింది. రుణాలు మంజూరు కాకపోవడం, కేంద్రసహాకారం లేకపోవడం వల్ల రాష్ట్రంపై ఆర్థికభారం పడుతోంది. మాకు సహకరిస్తే మేము కూడా సహకరిస్తాం. మేము వివాదాలు కోరుకోవట్లేదు.. శాశ్వత పరిష్కారం కోరుతున్నాం. "- రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పనే లక్ష్యం : అంతకు ముందు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. జీసీసీలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. చాలా పెద్ద లైఫ్‌సైన్స్ కంపెనీలు వస్తున్నాయన్న ఆయన 2034 నాటికి వన్ ట్రిలియన్ ఎకానమీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని వెల్లడించారు. చాలా పెద్దఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు. పరిశ్రమల ద్వారా చాలా ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కంపెనీలకు పెద్దఎత్తున ప్రోత్సాహాకాలు కల్పిస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ పాలసీ తీసుకువచ్చిందన్నారు.
పోలవరం-నల్లమలసాగర్‌పై సమర్థ వాదనలు వినిపించండి : సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ పెట్టిన సంతకం ఇవాళ ఏపీకి మంచి ఆయుధంగా మారింది : సీఎం

