పక్కా ఇళ్లు వచ్చింది - సామూహిక గృహ ప్రవేశాలతో ఆదివాసీ గూడెం మురిసింది
కొఠారి పంచాయతీ కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్లకు సీఎం శ్రీకారం - మంత్రులతో కలిసి ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి - ప్రత్యేక ఆకర్షణగా ఆదివాసీల గుస్సాడి సంప్రదాయ నృత్యాలు

Published : June 2, 2026 at 8:48 AM IST
CM Revanth Reddy Announces 2.50 Lakh New Houses : అదో కుగ్రామం. అక్కడి వారంతా గిరిజన సామాజిక వర్గంలో అత్యంత వెనకబడిన కొలాం తెగవారు. పూరిగుడిసెల్లో జీవిస్తున్న వారికి పక్కా ఇళ్లు కట్టించడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి సామూహిక గృహ ప్రవేశాల్లో పాల్గొనడం వారిలో రెట్టించిన ఉత్సాహం నింపింది. జిల్లాల్లోనూ పండుగ వాతావరణంలో మంత్రుల సమక్షంలో గృహ ప్రవేశాలు జరిగాయి.
కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలోని కొఠారి పంచాయతీ పరిధిలోకి వచ్చే కొత్తగూడలో కొలాంతెగ ఆదివాసీలకు కేటాయించిన పాతిక ఇళ్లను మంత్రులతో కలిసి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదివాసీల గుస్సాడి సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తొలుత గ్రామ సర్పంచితో కలిసి ముఖ్యమంత్రి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం షేర్ వాల్ సాంకేతికత విధానంతో నిర్మించిన ఇంటిని పరిశీలించారు. ఆదివాసీలతో కలిసి నేలపై కూర్చొని వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన వారికి ఎవరికైనా ఇళ్లు రాకుంటే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆదివాసీ గూడెంలు, గిరిజన తండాలు అభివృద్ది చెందినప్పుడే రాష్ట్రం ప్రగతిపథంలో నడుస్తుందని సీఎం చెప్పారు.
రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లు : 'ఈ ఏడాదిలో లక్ష మంది ఇళ్లు కట్టుకున్నారు. వచ్చే సంవత్సరం ఇదే తేదీన అన్ని గూడేల్లో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించి పండుగ చేసుకుందాం. అలాగే ప్రత్యేక డ్రైవ్ పెట్టి ఆదివాసీ గిరిజనులకు ఇళ్లు మంజూరు చేస్తాం. గతంలో నిర్మించుకున్న ఇళ్ల పైకప్పు గూన, రేకులు ఉన్న వారికి రెండో విడతలో స్లాబుకు అవకాశం కల్పిస్తున్నాం. రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లు ఇక్కడి నుంచే మంజూరు చేస్తున్నాం. మహిళలను ఇంటి పెద్దగా గుర్తించి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. మిమ్మల్ని చూస్తుంటే దసరాకు వచ్చినట్లు ఉంది. చదువుతోనే జీవితాల్లో మార్పు వస్తుంది. అదొక్కటే కొత్త వెలుగులు నింపుతుంది.' అని సీఎం గూడెం వాసులతో ముచ్చటించారు.
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల పండుగ : రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు పండుగ వాతావరణంలో జరిగాయి. జిల్లాల్లోనూ స్థానిక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్పూర్లో ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. లబ్ధిదారుల దంపతులకు నూతన వస్త్రాలను ఎమ్మెల్యే అందించారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్‌లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ప్రారంభించారు. లబ్ధిదారు మహిళలకు సారె సమర్పించారు. భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆరో వార్డులో నిర్మించిన రెండు ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. మెదక్ జిల్లా రేగోడు మండలం గజ్వాడ గ్రామంలో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నాం. పేదలు ఇల్లు కట్టుకోవాలి. ఏదో ఓ రకంగా రెండు, మూడు లక్షలు ఎక్కువైనా పట్టుదలతో ఇల్లు కట్టుకోవడమంటే ఇది సమాజానికి ఒక సందేశం, స్ఫూర్తి. అర్హత ఉంటే ఇల్లు ఇవ్వాల్సిందే. ఎవరికి కూడా ఇల్లు వస్తుందో? లేదో? అనే మాట, సందేహం రాకూడదు'' - దామోదర రాజనర్సింహ, వైద్యారోగ్యశాఖ మంత్రి
'ఇందిరమ్మ ఇళ్లకు ఆరోజే గృహప్రవేశాలు - ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వొద్దు'

