కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఆర్థిక ఉగ్రవాదులు : సీఎం రేవంత్
కేసీఆర్ వాదనలో బలం ఉంటే సభకు రావాలని పిలుపునిచ్చిన సీఎం - కాళేశ్వరం ప్రాజెక్టుపై కూలంకషంగా చర్చిద్దామని పిలుపు - కేసీఆర్ చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలకు శిక్ష పడకూడదన్న ముఖ్యమంత్రి

Published : July 7, 2026 at 10:25 PM IST
CM Revant On Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో కేసీఆర్ ఆలోచనలు మారాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ది ఆర్థిక ఉగ్రవాద కుటుంబమని వ్యాఖ్యానించారు. ఊరు, పేరు, అంచనాలు మార్చి నిధులు కొల్లగొట్టడానికి కేసీఆర్ స్కీమ్ అని ఆరోపించారు. ప్రజాభవన్‌లో నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్‌పై కేసీఆర్ విశ్రాంత ఇంజినీర్ల కమిటీ వేశారని, మేడిగడ్డ బ్యారేజ్ నిర్మిస్తే నిలబడదని ఇంజినీర్లు స్పష్టంగా చెప్పారని సీఎం వెల్లడించారు. వేమనపల్లి వద్ద బ్యారేజీ నిర్మిస్తే కొంతమేర పర్వాలేదని చెప్పారు.
రూ.81 వేల కోట్లకు పెంచారు : విశ్రాంత ఇంజినీర్లు ఇచ్చిన నివేదికను కేసీఆర్ పక్కన పెట్టారని సీఎం అన్నారు. కేసీఆర్‌కు కావాల్సిన విధంగా నివేదిక ఇవ్వాలని వ్యాప్కోస్‌కు చెప్పారని తెలిపారు. రూ.38 వేల కోట్ల ప్రాజెక్టు అంచనాను రూ.81 వేల కోట్లకు పెంచారని వెల్లడించారు. ప్రాజెక్టు అంచనా రూ.1.47 లక్షల కోట్లకు పెరిగిందని కాగ్ నివేదిక ఇచ్చిందని స్పష్టం చేశారు. ప్రాజెక్టు కింద ఆయకట్టు, నీళ్లు సహా ఏదీ పెరగలేదని వెల్లడించారు. డిజైన్, ప్రణాళిక, నాణ్యత పాటించి ఉంటే చర్చించే పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తన బ్రెయిన్ చైల్డ్ అని కేసీఆర్ స్పష్టంగా చెప్పారని సీఎం గుర్తుచేశారు. ప్రాజెక్టు చేపట్టిన ఏడాదిలోనే నిర్మాణంలో లోపాలు బయటపడ్డాయని తెలిపారు. మేడిగడ్డ వద్ద సీసీ బ్లాకులను సరిచేయాలని ప్రాజెక్టు ఈఈ రమణారెడ్డి 2020లో లేఖ రాశారని చెప్పారు. ఈఈ లేఖ పట్టించుకోకుండా ప్రాజెక్టు సంస్థ మరమ్మతులు చేపట్టలేదన్నారు. గోదావరి వరదకు 2022లో కన్నెపల్లి పంపుహౌస్‌లు మునిగాయని గుర్తుచేశారు.
మేడిగడ్డ బ్యారేజీ వెన్నుపూస లాంటిది : ఈ విషయం పట్టించుకోకపోవడం వల్ల 2023లో కాళేశ్వరం పిల్లర్లు కూలాయని సీఎం వెల్లడించారు. బ్యారేజీల నిర్మాణానికి ముందు భూమిలో పరీక్షలు చేయలేదన్నారు. ఒక బ్యారేజీ నుంచి ఎత్తిపోస్తే మూడు బ్యారేజీలవి వరుసగా ఎత్తాలన్నారు. ఇసుక మేటలపై నిర్మించడం వల్ల నిల్వ చేసిన నీటి ఒత్తిడికి బ్యారేజీ కుంగిందని వెల్లడించారు. నాలుగు పిల్లర్లు కుంగిపోతే ఏమవుతుందని కేసీఆర్ అంటున్నారని తెలిపారు. గోదావరి జలాల ఎత్తిపోతలకు మేడిగడ్డ బ్యారేజీ వెన్నుపూస లాంటిదని ప్రస్తావించారు. వెన్నుపూస దెబ్బతింటే చేసేదేమీ ఉండదని సీఎం అన్నారు. నీళ్లు అలా వస్తే ఇలా పోతాయన్నారు. 80 వేల పుస్తకాలు చదివిన మేధావి మూడేళ్లలో కట్టిన కాళేశ్వరం కూలిందని విమర్శించారు.
కేసు పెట్టిందే కేసీఆర్ ప్రభుత్వమే : వారం రోజులు ఇస్తే తడాఖా చూపిస్తానని సవాళ్లు విసురుతున్నారని కేసీఆర్ మిడిమిడి జ్ఞానం ఉన్నవారిని పంపితే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని సీఎం ప్రస్తావించారు. ప్రాజెక్టు కూలిందని మహదేవ్‌పూర్ పీఎస్‌లో కేసు పెట్టిందే కేసీఆర్ ప్రభుత్వమని గుర్తుచేశారు. నాణ్యత లోపం వల్ల కాళేశ్వరం కూలిందని ఎన్‌డీఎస్‌ఏ చెప్పిందని అన్నారు. కాంగ్రెస్ వచ్చాక పీసీ ఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ జరిగిందని చెప్పుకొచ్చారు. కేసీఆర్, కేటీఆర్ సహా అధికారులందరినీ కమిషన్ విచారించిందని పేర్కొన్నారు.
నిపుణుల సూచనల మేరకు బ్యారేజీ గేట్లు పైకి ఎత్తి ఉంచామని వెల్లడించారు. గోదావరి నీళ్లు ఆపితే ప్రాజెక్టు నిండి బరువు పడి మరింత కుంగుతుందన్నారు. భూమి కుంగితే బ్యారేజీ పోతుందని, భద్రాచలం వరకు కొట్టుకుపోతుందిని సీఎం వెల్లడించారు. నిపుణులు ఇచ్చిన సమస్య పరిష్కారం అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.
కేసీఆర్‌ది ఆర్థిక ఉగ్రవాద కుటుంబం : కరవు వస్తే కాళేశ్వరం ప్రజలకు పనికొస్తుందని చెబుతున్నారు. తాటిచెట్టులా పెరిగితే సరిపోదు తలకాయలో గుజ్జు ఉండాలని సీఎం విమర్శించారు. ఎల్‌నినో వల్ల కరవు వస్తే వర్షాలు, వరదలు, తుపానులు లేవన్నారు. ఎల్‌నినో వల్ల వర్షాలు రాకపోతే వరదలు ఎలా వస్తాయి? ఎలా ఒడిసి పట్టాలి? అని సీఎం విమర్శించారు.
కేసీఆర్‌ది ఆర్థిక ఉగ్రవాద కుటుంబమని వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఆర్థిక ఉగ్రవాదులని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ఆర్థిక మూలాలను దోపిడీ, విధ్వంసం చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం ముసుగులో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దోపిడీకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ ఉద్యమంలో ముందున్న కోదండరామ్, ప్రొ.యాదగిరి వంటి వారిని దగ్గరకు రానివ్వలేదన్నారు.
లేఖ రాస్తే శాసనసభలో చర్చిద్దాం : కాళేశ్వరం అంశంపై కేసీఆర్ లేఖ రాస్తే శాసనసభలో చర్చిద్దామని సీఎం సవాల్ విసిరారు. కాళేశ్వరంపై వారం కాదు మూడేళ్లు కేసీఆర్‌కే అప్పగిస్తామని వెల్లడించారు. ఎల్ అండ్ టీ, కాంట్రాక్టర్లను తీసేసి మేజర్ కాంట్రాక్టర్‌గా కేసీఆర్‌కే అప్పగిస్తామన్నారు. హెడ్ కాంట్రాక్టర్‌గా ఎలా పునరుద్ధరిస్తారో కేసీఆర్ చేయాలన్నారు. కేసీఆర్ వాదనలో బలం ఉంటే ఏ తప్పు చేయకపోతే సభకు రావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఎప్పుడు కోరితే అప్పుడు స్పీకర్‌ను రిక్వెస్ట్ చేసి సభ పెడతానన్నారు. వారు కోరుకునన్ని రోజులు శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
సంయుక్త సమావేశాలు నిర్వహిస్తాం : కేసీఆర్‌ను ప్రత్యేకంగా మండలికి కూడా అనుమతిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఒకేసారి సంయుక్త సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కూలంకషంగా చర్చిద్దామన్నారు. నిపుణులు, అడ్వకేట్ జనరల్‌ను సభకు పిలిచి జాయింట్ సెషన్ నిర్వహిద్దామని పేర్కొన్నారు. కేసీఆర్ చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలకు శిక్ష పడకూడదన్నారు. తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులు గోదావరి పాలు కాకూడదని సీఎం అన్నారు.
నేరగాళ్లను శిక్షించలేకపోతున్నాం : మూడు బ్యారేజీలు ఉపయోగపడి ఉంటే రాత్రింబవళ్లు ఉండి పూర్తి చేసేవాళ్లమని సీఎం అన్నారు. నిజంగా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో అసహనంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. నేరగాళ్లను శిక్షించలేకపోతున్నామని ప్రస్తావించారు. ప్రాజెక్టును వినియోగంలోకి తేలేకపోతున్నామనే బాధ ఉందని చెప్పుకొచ్చారు. ప్రజలు ఉరి తీయాలని కోరుకుంటుంటే నిబంధనలు అడ్డు వస్తున్నాయన్నారు. తప్పిదాలను సరిదిద్దుకునేందుకే నిపుణుల కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. సరిదిద్దడం మరో పెద్ద తప్పుగా మారితే అత్యంత ప్రమాదకరం అవుతుందని వెల్లడించారు.

