ETV Bharat / state

జీహెచ్​ఎంసీ స్థానంలో కోర్​ అర్బన్ చట్టం​ - 99 రోజుల కార్యక్రమంలో ముందుగా మున్సిప‌ల్ ప‌రిధిలోని ప‌నులు

కోర్ అర్బన్ ఏరియాలో పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం - జీహెచ్​ఎంసీ చ‌ట్టం స్థానంలో కోర్ అర్బన్ చ‌ట్టం త‌యారు చేయాల‌ని అధికారుల‌కు ఆదేశాలు - ఎలివేటెడ్ కారిడార్ల న‌మూనాల‌ను పరిశీలించి పలు సూచనలు

Core Urban Act to Replace GHMC Act in Hyderabad
Core Urban Act to Replace GHMC Act in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 28, 2026 at 7:30 AM IST

3 Min Read
Choose ETV Bharat

Core Urban Act to Replace GHMC Act in Hyderabad : హైదరాబాద్‌లోని స‌చివాల‌యంలో పురపాలక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుక్రవారం స‌మీక్ష నిర్వహించారు. ఔట‌ర్‌ రింగ్​రోడ్డు వరకు కోర్ అర్బన్ పరిధిలోని మూడు కార్పొరేష‌న్లకు వ‌ర్తించేలా జీహెచ్​ఎంసీ చ‌ట్టం స్థానంలో కోర్ అర్బన్ చ‌ట్టం త‌యారు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అనుమ‌తులు, రుసుములు, అభివృద్ధి ప‌నుల నిర్వహ‌ణ‌, ఇత‌ర వ్యవ‌హారాల‌న్నింటికీ ఆ చ‌ట్టమే ఆధారంగా ఉండాల‌ని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేప‌ట్టనున్న 99 రోజుల కార్యక్రమంలో ముందుగా మున్సిప‌ల్ ప‌రిధిలో ప‌నులు చేపట్టనున్నట్టు తెలిపారు. కోర్ అర్బన్ ఏరియాలో పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల‌ని సూచించారు. చెత్త వేయాల్సిన ప్రాంతాల‌ను గుర్తించి, అక్కడ బోర్డులు ఏర్పాటు చేయాల‌ని తెలిపారు. ఆ త‌ర్వాత నిర్దేశిత ప్రాంతాల్లో కాకుండా ఎక్కడప‌డితే అక్కడ చెత్త వేసే వారిపై చ‌ర్యలు తీసుకోవాలన్నారు.

ఎలివేటెడ్​ కారిడార్లు పరిశీలించిన సీఎం : కోర్ అర్బన్ ఏరియా ప‌రిధిలో ఆర్ అండ్ బీ, ఇత‌ర విభాగాల ప‌రిధిలోని రోడ్లన్నింటినీ పురపాలక శాఖ ప‌రిధిలోకి తీసుకురావాల‌ని సీఎం ఆదేశించారు. వివిధ యాజ‌మాన్యాల ప‌రిధిలో ఉన్న రోడ్లను ఒకే విభాగం కిందకు తేవడం వల్ల ప‌నుల్లో ఏక‌రూప‌త‌, వేగ‌వంతానికి తోడ్పడుతుంద‌న్నారు. రోడ్ల నిర్మాణ విష‌యంలో బాధ్యతాయుతంగా వ్యవహ‌రించాల‌ని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీలో రోడ్ల నిర్మాణం నిర్దేశిత కాలం వ‌ర‌కు మ‌ళ్లీ వేయ‌డానికి అనుమ‌తులు రావ‌ని, అలాంటి సాంకేతిక‌త‌ను వినియోగించాల‌ని సూచించారు. రోడ్డు నిర్మించిన త‌ర్వాత జీవిత కాలం ఎంత‌నేది నిర్ణయించి, ఆ లోపు దానిని తొల‌గించినా అక్కడ మ‌ళ్లీ రోడ్డు వేసినా బాధ్యులెవరనేది తేల్చాల‌న్నారు. న‌గ‌రంలో వివిధ ప్రదేశాల్లో ర‌ద్దీ త‌గ్గించేందుకు డిజైన్ చేసిన ఎలివేటెడ్ కారిడార్ల న‌మూనాల‌ను అధికారులు ప్రద‌ర్శించారు. వాటిని ప‌రిశీలించిన సీఎం ప‌లు సూచ‌న‌లు చేశారు. చారిత్రాక ప్రాధాన్యం గ‌ల క‌ట్టడాలను ప‌ర్యాట‌క స్థలాలుగా మార్చే చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


కోర్​ అర్బన్​ ఏరియాలో సీసీ కెమెరాలు : కోర్ అర్బన్ ఏరియాలో ప్రతి వీధి దీపం వెలుగుతుందో లేదో డ్యాష్ బోర్డులో తెలుసుకుని, స‌మ‌స్య ఉంటే వెంట‌నే ప‌రిష్కరించాల‌ని సీఎం ఆదేశించారు. కోర్ అర్బన్ ఏరియాలో అన్ని హోట‌ళ్లలోని కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాల‌ని ఆదేశించారు. త‌ర‌చూ త‌నిఖీలు చేప‌ట్టడంతో పాటు ప‌ర్యవేక్షణ కొన‌సాగాల‌న్నారు. ఫుడ్ సేఫ్టీకి ఆయా హోట‌ళ్లు తీసుకుంటున్న చ‌ర్యల‌ను మ‌దింపు చేసి, వారికి రేటింగ్స్ ఇవ్వాల‌ని సీఎం సూచించారు.

నగరంలో వాటర్​ హార్వెస్టింగ్​ వెల్స్​ ఏర్పాటు : కోర్ అర్బన్ ఏరియాలో ఫైర్ సేఫ్టీకి పెద్ద పీట వేయాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. 50 అంత‌స్తుల‌కు పైగా భ‌వంతులు నిర్మాణాలు జ‌రుగుతున్నాయ‌ని, అంత ఎత్తులో అగ్ని ప్రమాదాలను అరిక‌ట్టేందుకు అవ‌స‌ర‌మైన అధునాత‌న సామ‌గ్రి, సాంకేతిక‌త‌ను స‌మ‌కూర్చుకోవాల‌ని ఆదేశించారు. న‌గ‌రంలోని కూడళ్లలో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టాల‌ని సూచించారు. యూనిఫోల్స్‌ను ఏర్పాటు చేసి వాటిని మ‌ల్టీ యుటిలిటీ పోల్స్‌గా ఉప‌యోగించాల‌ని తెలిపారు.

అభివృద్ధికి అవ‌స‌ర‌మైన చ‌ర్యలు తీసుకోవాలి : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ ప‌రిధిలో ప్రభుత్వ కార్యాల‌యాల‌ను నిర్దేశిత స‌మ‌యంలో పూర్తి చేయాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. నిర్మాణాల్లో నాణ్యత‌కు పెద్దపీట వేయాల‌న్నారు. న‌గ‌రంలోని పెద్ద చెరువులు, కుంట‌ల అభివృద్ధికి అవ‌స‌ర‌మైన చ‌ర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. హైడ్రా ప‌రిర‌క్షించిన చెరువుల చుట్టూ క‌ట్టలు క‌ట్టి వ‌దిలి వేయ‌కుండా, వాటి ర‌క్షణ‌తో పాటు సుంద‌రీక‌ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు. ప‌ర్యాట‌క ప్రదేశాలుగా జ‌ల వ‌న‌రుల‌ను మార్చాల‌ని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.

తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ ఆధిపత్యాన్ని స్వీకరించరు : సీఎం రేవంత్ రెడ్డి

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ నిర్మాణంలో రాజీ పడొద్దు : సీఎం రేవంత్‌రెడ్డి