ETV Bharat / state

సాగునీటి ప్రాజెక్టుల బాట పట్టిన సీఎం - గడువులోగా నిర్మాణాల పూర్తిపై సమీక్ష

ఈ నెలలోనే పోలవరం, వెలిగొండతో పాటు ఉత్తరాంధ్రకు చంద్రబాబు - నీటివిధానం ముసాయిదా విడుదలకు ఏర్పాట్లు - సిద్ధమవుతున్న జలవనరులశాఖ- 2027 జూన్‌ చివరి వారంలో గోదావరి పుష్కరాలు

CM Chandrababu Will Visit Irrigation Projects
CM Chandrababu Will Visit Irrigation Projects (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 2, 2026 at 7:55 AM IST

3 Min Read
Choose ETV Bharat

CM Chandrababu Will Visit Irrigation Projects : ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెలలో సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులతో పాటు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులనూ క్షేత్రస్థాయిలో సందర్శించనున్నారు. అంతేకాకుండా గడువులోగా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడంపై సమీక్షిస్తారు. ఈ మేరకు సీఎంఓ నుంచి జలవనరులశాఖ ఉన్నతాధికారులకు గురువారం సమాచారం అందింది. ఈ జనవరి తొలి వారంలోనే పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. 2027 డిసెంబరు నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనేది లక్ష్యం. గోదావరి పుష్కరాలు 2027 జూన్‌ చివరి వారంలో మొదలవుతాయి. సరిగ్గా అప్పుడే ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతుంది. అప్పటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తే బాగుంటుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు.

పోలవరం ప్రాజెక్టుకు తొలివిడత నిధుల మంజూరుతో పాటు, అడ్వాన్సుగా నిధులిచ్చేందుకు అంగీకరించిన క్రమంలోనే కేంద్రం గడువు కూడా నిర్దేశించింది. ఇప్పటికే కాఫర్‌ డ్యాం పనులు ఓ కొలిక్కి వస్తున్నాయి. మరోవైపు గ్యాప్‌ 1 ప్రధాన డ్యాం పనులు ప్రారంభమయ్యాయి. ప్రధాన డ్యాం గ్యాప్‌ 2 పనులూ సాగుతున్నాయి. డయాఫ్రం వాల్‌పై ప్రధాన డ్యాం పనులు ప్రారంభించారు. వీటితోపాటు కుడి, ఎడమ కాలువలను అనుసంధానించే పనులూ వేగంగా జరుగుతున్నాయి. 2027 ఖరీఫ్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు ఉన్న అవకాశాలు, నిర్మాణ పురోగతిపైనా ముఖ్యమంత్రి దృష్టి సారించనున్నారు. పోలవరం ఎడమ కాలువ పనులు జనవరి నెలాఖరుకు పూర్తి చేయాలనేది లక్ష్యం. ఇప్పటికే పనులు వేగంగా జరుగుతున్నాయి.

పోలవరం వద్ద చేపట్టే పర్యాటక ప్రాజెక్టులపైనా సీఎం సమీక్షిస్తారని సంబంధిత అధికారుల తెలుపుతున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద ఈ ఏడాది నీటి విధానానికి ముసాయిదా విడుదల చేయనున్నారు. జలాశయాల్లో నీటి నిల్వలు 80%కు మించి అందుబాటులో ఉండటంతో అన్ని ప్రాంతాల్లో చెరువులు నింపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నీళ్లు అందుబాటులో ఉన్నందున ఖరీఫ్‌ సాగు ముందుగా ప్రారంభించాలనేది ప్రణాళిక. భూగర్భజలాలు పెంచే ప్రణాళికలనూ గ్రామాలవారీగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ నీటివిధానంపై ముసాయిదా విడుదల చేస్తారు. పారిశ్రామిక, తాగు, సాగునీటి విడుదలకు ప్రణాళిక వెలువరిస్తారు.

వెలిగొండకు జనవరి 7 లేదా 9న : వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 7 లేదా 9న సీఎం సందర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది జులై నాటికి వెలిగొండ ప్రాజెక్టు నుంచి నల్లమలసాగర్‌కు నీళ్లు మళ్లించి తొలిదశలో 1,19,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో పనులు చేస్తున్నారు. రెండు టన్నెళ్లలో బెంచింగ్‌ లైనింగ్‌ పనులు పూర్తిచేసేలా అడుగులు పడుతున్నాయి. ఇలా నీళ్లు ఇవ్వాలంటే హెడ్‌ రెగ్యులేటర్ల రిటైనింగ్‌ వాల్, వింగ్స్, రిటర్న్‌ల నిర్మాణం పూర్తిచేయాలి.

తొలి టన్నెల్‌లో 15 మీటర్ల మేర లైనింగ్, రెండో టన్నెల్‌లో 361 మీటర్ల మేర బెంచింగ్‌ తవ్వకంతో పాటు 3,686 మీటర్ల మేర లైనింగ్‌ చేయాలి. ఫీడర్‌ కాలువలో పెండింగ్‌ పనులనూ కొలిక్కి తేవాలి. ఇక్కడ రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులూ ప్రారంభమయ్యాయి. తీగలేరు కాలువకు హెడ్‌ రెగ్యులేటర్ల నిర్మాణమూ సాగుతోంది. పునరావాసం కూడా పూర్తిచేయాలి. నల్లమలసాగర్‌లో ఉన్న గ్రామాలను ఖాళీచేయించాలి. ప్రస్తుతం ఈ పనులు జరుగుతున్నా రూ.500 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సీఎం ఈ పనులు పరిశీలించి, మార్గదర్శనం చేస్తారు.

నేరడి బ్యారేజి : ఈ నెల 17న ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు దృష్టిసారిస్తారు. ఆయన ఏ ప్రాజెక్టును సందర్శిస్తారో ఇంకా ఖరారు కావాలి. ఈ జిల్లాల్లో రూ.2,087 కోట్లు ఖర్చుచేస్తే 9 ప్రాజెక్టులు పూర్తవుతాయని జలవనరులశాఖ ప్రణాళిక రూపొందించింది. కొత్త ఆయకట్టు 1.24 లక్షల ఎకరాలు సాగులోకి రావడంతో పాటు 2.48 లక్షల ఎకరాల స్థిరీకరణకు ఉపకరిస్తుంది. నేరడి బ్యారేజి నిర్మాణం చేపట్టాలనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇందుకు వీలుగా వంశధార ట్రైబ్యునల్‌ తుది నోటిఫికేషన్‌ వెలువరించాలని పట్టుబడుతోంది.

ధవళేశ్వరం బ్యారేజ్​కు కొత్త గేట్లు - రూ.150 కోట్లు కేటాయింపు

పోలవరం నిర్మాణానికి రూ.62,436 కోట్లు! - తాజాగా అంచనాలు వేసిన రాష్ట్ర ప్రభుత్వం