ETV Bharat / state

వచ్చే ఏడాది మార్చికల్లా పోలవరం - ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు

తొలి దశలో 119 టీఎంసీల నీళ్లు నిలబెడతాం : ముఖ్యమంత్రి చంద్రబాబు - ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిశీలన - ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలవాలని ఆదేశం

CM Chandrababu Visited Polavaram Dam
CM Chandrababu Visited Polavaram Dam (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 8, 2026 at 9:54 AM IST

3 Min Read
Choose ETV Bharat

CM Chandrababu Visited Polavaram Dam: పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తొలి దశలో 119 టీఎంసీల నీటిని నిల్వ చేసి, గ్రావిటీ ద్వారా కుడి, ఎడమ కాలువలకు అందిస్తామని వెల్లడించారు. పోలవరం కుడి కాలువ నిర్మాణం దాదాపు పూర్తయిందని, ఎడమ కాలువ పనులు ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేస్తామన్నారు. పునరావాసంలో భాగంగా తొలి దశలో 38,060 నిర్వాసిత కుటుంబాలకు కాలనీలు నిర్మించి తరలించాల్సి ఉందని, ప్యాకేజీలు అందించాల్సి ఉందని ఈ పనులన్నీ ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును బుధవారం సీఎం సందర్శించారు. నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలవరం, జలవనరుల శాఖ, పునరావాస అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులతో భేటీలోనూ, తర్వాత విలేకర్లతోనూ సీఎం చంద్రబాబు మాట్లాడారు.

‘అప్పట్లో రూ.400 కోట్లు పెట్టి నిర్మించిన డయాఫ్రం వాల్‌ ధ్వంసం అవ్వడంతో దాన్ని పక్కన పెట్టారు. అదనంగా రూ.1,000 కోట్లతో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మిస్తున్నాం. ఇప్పటికే 87 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తాం. కుడి, ఎడమ అనుసంధాన టన్నెళ్లు, నావిగేషన్‌ కాలువ పనులు ఈ సంవత్సరం జూన్‌కు పూర్తి చేస్తాం. గ్యాప్‌-1 ప్రధాన డ్యాం ఈ ఏడాది జూన్‌ నెలాఖరుకు, గ్యాప్‌-2 ప్రధాన డ్యాం పనులు మార్చి 2027 నాటికి పూర్తి చేస్తాం’ అని వివరించారు.

పోలవరం ఎడమ కాలువ అనకాపల్లి నుంచి విశాఖ వరకు ఇతరత్రా పనులు ఉంటే పూర్తి చేయాలని అన్నారు. ఎడమ, కుడి కాలువల ద్వారా అన్ని రిజర్వాయర్లు, చెరువులు, ఇతరత్రా జలాశయాలు ఏం ఉన్నా ఈ నీటితో నింపేలా చూడాలి. ఇందుకు అదనపు స్లూయిస్‌లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా సిద్ధం చేయాలి. పునరావాసం ఈ సంవత్సరం చివరికి పూర్తి చేసేలా నెలవారీ లక్ష్యాలతో ప్రణాళిక ఇవ్వాలి. అది ఎలా అమలు జరుగుతోందో పర్యవేక్షిస్తాన'ని చంద్రబాబు చెప్పారు.

''2020 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనుకున్నాం. 2019 జూన్‌లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది. అందుకే 7 సంవత్సరాలు ఆలస్యమైంది. వ్యయము కూడా పెరిగింది. కనీసం డయాఫ్రం వాల్‌ ధ్వంసమైన విషయమూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం సకాలంలో గుర్తించలేదు.'' - సీఎం చంద్రబాబు

సంక్రాంతి కన్నా ముందే ప్రజంటేషన్‌: ఐకానిక్‌ బ్రిడ్జి పనులకు టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలవరం డ్యాం చుట్టూ 9,000 ఎకరాల్లో పర్యాటక ప్రాజెక్టు చేపట్టేందుకు జపాన్‌ కన్సల్టెన్సీ సంస్థ ఇచ్చిన ప్రజంటేషన్‌ను సైతం పరిశీలించారు. భారత సంస్కృతీ సంప్రదాయాలకు తగ్గట్టుగా రూపొందించిన స్పిల్‌ వే సుందరీకరణ ప్రణాళికలనూ చూశారు. సంక్రాంతి కన్నా ముందే అమరావతికి వచ్చి తనకు మరోసారి సమగ్ర ప్రజంటేషన్‌ ఇవ్వాలని ఆదేశించారు.

పోలవరంలో డెడ్‌ స్టోరేజ్‌ నుంచి చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్​ పనుల్లో సివిల్‌ పనులు పూర్తి చేయాలని, పంపుల ఏర్పాటు అంశం తర్వాత పరిశీలిద్దామని చంద్రబాబు సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ వే, నావిగేషన్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి కూడా జలరవాణా జరిగేలా కాకినాడ పోర్టు వరకు కాలువల ద్వారా ఈ రవాణా సాగేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలిని అన్నారు. ఈ అంశాలు, నేషనల్ హైవే అనుసంధానంపై సంబంధిత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా: నదుల అనుసంధానం తన కల అని చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో అన్ని నదులూ సముద్రంలో కలుస్తున్నాయని వంశధార, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంతో ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా మార్చడం తన స్వప్నమని చెప్పారు. రాష్ట్రంలో అంతర్గత నదుల అనుసంధానానికి ప్రధాని మోదీ అనుమతి ఇచ్చారని అన్నారు. గంగా- కావేరి అనుసంధానమూ జరుగుతుందని చంద్రబాబు అన్నారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ సమావేశంలో ప్రజంటేషన్‌ ఇచ్చారు.

పునరావాసానికి సంబంధించి ఇళ్ల నిర్మాణం, ప్యాకేజీల విషయంలో నెలకొన్న ఇబ్బందులను జిల్లా కలెక్టర్లు ముఖ్యమంత్రికి వివరించారు. సీఎంతో సమావేశంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, పార్థసారథి, జలవనరులశాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నరసింహమూర్తి, పునరావాస కమిషనర్‌ ప్రశాంతి, మేఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

అమరావతికి చట్టబద్ధత కల్పించండి:సీఎం చంద్రబాబు

పోలవరంలో పర్యటించిన చంద్రబాబు - జంట సొరంగాలు పరిశీలన