ETV Bharat / state

కాకినాడ పేలుడు ఘటన - మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం: సీఎం చంద్రబాబు

ఇలాంటివి మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామన్న చంద్రబాబు - బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తున్నామన్న సీఎం - బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని వెల్లడి

CM Chandrababu Visit Fireworks Explosion Place in Vetlapalem
CM Chandrababu Visit Fireworks Explosion Place in Vetlapalem (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 28, 2026 at 7:15 PM IST

|

Updated : February 28, 2026 at 10:05 PM IST

2 Min Read
Choose ETV Bharat

CM Chandrababu Visit Fireworks Explosion Place in Vetlapalem : కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా పేలుడు ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. పేలుడు జరిగిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులతో మా‌ట్లాడి తెలుసుకున్నారు. కలెక్టర్ షణ్మోహన్‌ ఘటన వివరాలను సీఎం చంద్రబాబుకు వివరించారు. చంద్రబాబు వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, స్థానిక కూటమి ప్రజాప్రతినిధులు ఉన్నారు. మృతుల వివరాలు, క్షతగాత్రుల సమాచారాన్ని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

ఘటనాస్థలంలో చేపట్టిన సహాయక చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. క్షతగాత్రుల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలో ఎప్పటి నుంచి బాణసంచా తయారు చేస్తున్నారని సీఎం చంద్రబాబు అడగ్గా, చాలా కాలం నుంచి అనుమతులు లేకుండా పరిశ్రమ నడుపుతున్నారని అధికారులు చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, సహాయకచర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు సీఎం సూచనలు చేశారు.

కాకినాడ పేలుడు ఘటన - మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం: సీఎం చంద్రబాబు (ETV Bharat)

అనంతరం సామర్లకోట ఆసుపత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రమాదంలో మృతిచెందినవారి మృతదేహాలను శవపరీక్ష కోసం అధికారులు సామర్లకోట ఆసుపత్రికి తరలించగా మృతుల కుటుంబసభ్యులు ఆసుపత్రి వద్దే ఉన్నారు. వారందరితో మాట్లాడిన సీఎం ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే బాణసంచా పేలుడు ఘటనలో గాయపడి సామర్లకోట ఆసుపత్రిలో చికిత్స పొందుతన్న ముగ్గురు క్షతగాత్రులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. వారితో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.

రూ.20 లక్షల చొప్పున పరిహారం : తరువాత కాకినాడ జీజీహెచ్​కు బయలుదేరి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, క్షతగాత్రుల్లో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్‌ చేస్తున్నట్లు చెప్పారు. విచారణ పూర్తయ్యాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని, బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పేలుడు పదార్థాల వద్ద జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్వాహకులు విఫలమయ్యారన్నారు. ఈ తరహా ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధ్యులైన వ్యక్తుల ఆస్తులు కూడా జప్తు చేసి బాధిత కుటుంబాలకు సాయం చేస్తామన్నారు. కొందరు వ్యక్తులు పదేళ్లుగా ఇక్కడ పని చేస్తున్నారని చెప్పారు. అనుమతి లేకుండా బాణసంచా తయారు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బుల్లెట్ ప్రూఫ్‌ వాహనం లేకుండానే : అయితే విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు, వేట్లపాలెం ప్రమాద ఘటన తెలిసిన వెంటనే అక్కడి నుంచి బయల్దేరి వచ్చారు. NSG భద్రత, బుల్లెట్ ప్రూఫ్‌ వాహనం లేకుండానే కాకినాడ జిల్లాలో పర్యటించారు. వేట్లపాలెంలోని ఘటనాస్థలానికి, సామర్లకోట PHCకి, కాకినాడ GGHకు జిల్లా కలెక్టర్‌ వాహనంలోనే సీఎం వెళ్లారు. బాణసంచా తయారీ కేంద్రం ఊరికి దూరంగా ఉండటంతో సాయంత్రానికి ఆ ప్రాంతమంతా చిమ్మచీకటి అలుముకోగా బ్యాటరీ లైట్ల వెలుతురులోనే సంఘటనా స్థలాన్ని సీఎం పరిశీలించారు. వ్యక్తిగత భద్రతను పక్కనపెట్టి మరీ బాధితులతో నేరుగా మాట్లాడారు. ప్రోటోకాళ్లన్నీ పక్కనపెట్టి బాధితుల గోడు విన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

కాకినాడ జిల్లాలో భారీ పేలుడు - 21కి చేరిన మృతుల సంఖ్య

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - ఘటనాస్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు

Last Updated : February 28, 2026 at 10:05 PM IST