పెట్టుబడుల్లో దేశంలోనే ఏపీ నెంబర్ 1 - గూడూరులో మెగా ఫర్నిచర్ పార్క్: సీఎం చంద్రబాబు
గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, జీవితంలో ఆ పార్టీ గెలవకూడదన్న సీఎం చంద్రబాబు - ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అని మరోసారి హెచ్చరించిన సీఎం

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 1, 2026 at 3:50 PM IST
CM Chandrababu Tour in Nellore District : పేదలకు అండగా ఉంటూ సంక్షేమం అందిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. పేదరిక నిర్మూలనకు అందరూ కృషి చేయాలని పీ4 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలునిచ్చారు. నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెం ప్రజావేదిక సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.
పేదవారందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తాం. డ్వాక్రా సంఘాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఇంటికో పారిశ్రామికవేత్త తయారు కావాలి. అందరికీ సంక్షేమ ఫలాలు అందాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి. పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీ చాలా ముందుంది. దేశంలోనే మెగా ఫర్నిచర్ పార్క్ గూడూరులో వస్తోంది. 10 వేల మందికి ఉపాధి కల్పించబోతున్నాం. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వస్తున్నాయి. ఒకప్పుడు పెట్టుబడిదారులు పారిపోయారు. ఇప్పుడు రాష్ట్రాన్ని వెతుక్కుంటూ వస్తున్నారు. నమ్మకం కలిగించినందుకే రాష్ట్రానికి క్యూ కడుతున్నారు’’ అని చంద్రబాబు అన్నారు.
గొడ్డలి పార్టీ నెవర్ అగైన్: ‘గొడ్డలి పార్టీ నెవర్ అగైన్’ అని, జీవితంలో ఆ పార్టీ మళ్లీ గెలవకూడదని, ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నేరాలు చేయడం రాజకీయ పార్టీలకు తగదని, నేరస్థుల పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో పార్టీలను చూశానని, నేరాలు చేసే పార్టీని, నేరస్థులను కాపాడే పార్టీని చరిత్రలో మొదటిసారి ఇప్పుడే చూస్తున్నానని మండిపడ్డారు. అర్హత లేనివాళ్లకు అందలం ఎక్కిస్తే చాలా సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అవుతుందని మరోసారి హెచ్చరించారు. హోంమంత్రి అనితపై అసభ్య వ్యాఖ్యలను తప్పుబట్టారు. గొడ్డలి పార్టీ నేత సతీమణిపై పోస్టు పెడితే వెంటనే అరెస్టు చేశామని, ఆడవాళ్లపై నోరు పారేసుకున్న ఎవరినీ వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు.
గతంలో మానసిక క్షోభ అనుభవించా: విజయవాడలో ఒక వ్యక్తి అదృశ్యమయ్యారని, ఆయనను అరెస్టు చేసిన తర్వాతే మిస్ అయ్యాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ విషయం తన దృష్టికి రాగానే సిట్ (SIT) వేసి దర్యాప్తు ప్రారంభించామని, తప్పు చేసింది పోలీసులైనా సరే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించానని చెప్పారు. అయితే, ఈ వ్యవహారానికి కొందరు కుల ముద్ర వేసి విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టారని, అసలు ఇలాంటి అసభ్యకర పోస్టులతో ఏం సాధించాలని అనుకుంటున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. గతంలో తన భార్యను అసెంబ్లీ సాక్షిగా దూషిస్తే, తాము ఎంతో మానసిక క్షోభ అనుభవించామని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం కుమార్తెలపై కూడా నీచమైన పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర పునర్నిర్మాణానికి నేను, పవన్ ముందుకొచ్చాం: గొడ్డలి పార్టీ కులమతాల మధ్య చిచ్చుపెడుతూ అమరావతిపై దుష్ప్రచారం చేస్తోందని, గత ఐదేళ్లలో మూడు ముక్కలాట తప్ప ఏమీ చేయలేదని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. భవిష్యత్తులో అన్ని ఏసీ బస్సులే నడుపుతామన్నారు. లబ్ధిదారులు ఏదైనా ఒక నెలలో తీసుకోకపోయినా, మూడు నెలల పింఛన్ ఒకేసారి ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి తాను, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి ముందుకొచ్చామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధితోపాటు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, సుపరిపాలనకు నాంది పలికామని హర్షం వ్యక్తం చేశారు. ‘మన మిత్ర’ యాప్‌లోనే అన్ని ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచామని, 62.20 లక్షల మంది కోసం ఏటా రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. తాను ఇంట్లో కూర్చుని బటన్ నొక్కేవాణ్ని కాదని, ప్రజల్లో ఉండే వ్యక్తినన్నారు. 28 కేటగిరీల వారికి పండుగ వాతావరణంలో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందిస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని స్పష్టం చేశారు.
"సంజీవని ప్రాజెక్టు" తీసుకువస్తున్నాం: రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి ‘సంజీవని ప్రాజెక్టు’ తీసుకువస్తున్నామని, రాబోయే రోజుల్లో ప్రజలకు ఇంటి వద్దకే వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గంజాయికి ఆంధ్రప్రదేశ్‌లో అస్సలు చోటు లేదని, రాష్ట్రాన్ని పూర్తిగా డ్రగ్ రహితంగా తయారుచేస్తామని స్పష్టం చేశారు. విద్యా రంగంలో మార్పులు వస్తున్నాయని, ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడుల్లోకి విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు.
ఖనిజ సంపదకు "విలువ" జోడింపు - గరిష్ఠ ఆదాయమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
రాష్ట్ర పారిశ్రామిక విస్తరణలో మరో కీలక అడుగు - తిరుపతి జిల్లాకు 'హీరో' గ్లోబల్ పార్ట్స్ సెంటర్

