'వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు' - 30 ఏళ్ల సంకల్పం నెరవేరిందని 'ఎక్స్'లో చంద్రబాబు పోస్ట్
వెలిగొండ జలసిరులు - అభివృద్ధికి రెక్కలు అంటూ సీఎం ట్వీట్ - 30 ఏళ్ల క్రితం తీసుకున్న సంకల్పం నెరవేరిందంటూ ఎక్స్ వేదికగా తన భావాలను వ్యక్తం చేసిన సీఎం

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 25, 2026 at 5:35 PM IST
CM Chandrababu on Veligonda Project : 'వెలిగొండ జలసిరులు - అభివృద్ధికి రెక్కలు' అంటూ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 30 ఏళ్ల క్రితం తీసుకున్న సంకల్పం నెరవేరిందంటూ తన భావాలను వ్యక్తం చేశారు. ఈనెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. రైతుల పొలాలకు నీరు, యువకులకు ఉపాధి, ప్రతి కుటుంబానికి భరోసా సంకల్పించామన్నారు. పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలకు ఇంటింటికి కుళాయి ద్వారా ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామంటూ సీఎం భరోసా ఇచ్చారు. 30 ఏళ్ల క్రితం వెలిగొండ ప్రాజెక్టుకు తాను శంకుస్థాపన చేసిన ఫొటోను సీఎం జతచేశారు.
మూడు దశాబ్దాల కల సాకారం: భగీరథ ప్రయత్నంతో, గొప్ప సంకల్పంతో ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, సవాళ్లు, సమస్యలను అధిగమించి వెలిగొండ ఫేజ్-1ను పూర్తి చేసి కరవు నేలకు కృష్ణమ్మ జలాలలను అందించబోతున్నామని చంద్రబాబు అన్నారు. 30 ఏళ్ల క్రితం తీవ్ర కరవు ప్రాంతంగా, అత్యంత వెనుకబాటుతనంతో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాలు మార్చేందుకు తీసుకున్న సంకల్పం నేడు సాకారమైందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాడు ముఖ్యమంత్రిగా 1996 మార్చి 5న వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని గుర్తు చేశారు. మూడు దశాబ్దాల తర్వాత అదే ప్రాజెక్టును నా చేతుల మీదుగా ప్రారంభిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. 10.7 టీఎంసీల నీటిని నల్లమల సాగర్‌కు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
వెలిగొండ జలసిరులు – అభివృద్ధికి రెక్కలు
— N Chandrababu Naidu (@ncbn) August 25, 2026
ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, సవాళ్లు, సమస్యలను అధిగమించి భగీరథ ప్రయత్నంతో, గొప్ప సంకల్పంతో వెలిగొండ ఫేజ్-1ను పూర్తి చేసి కరువు నేలకు కృష్ణమ్మ జలాలను అందించబోతున్నాం. తీవ్ర కరువు ప్రాంతంగా, అత్యంత వెనుకబాటుతనంతో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా… pic.twitter.com/TOAAJHxHSU
వెలిగొండ జలసిరులు - అభివృద్ధికి రెక్కలు: ఈ నెల 31వ తేదీన మార్కాపురం జిల్లా ఈ చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతుందని చంద్రబాబు అన్నారు. ఫేజ్-1తో 1.19 లక్షల ఎకరాలకు, ఫేజ్-2తో 3.283 లక్షల ఎకరాలకు సాగునీరును అలాగే లక్షలాది మందికి తాగునీటిని అందించి, తరతరాలుగా కరవుతో పోరాడిన ప్రజలకు ఉపశమనం కల్పించడమే లక్ష్యమన్నారు. వెలిగొండ జల విజయంతో కరవు ప్రాంతంలో కృష్ణమ్మకు జలహారతి ఇస్తున్నామన్నారు.
ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసి పశ్చిమ ప్రకాశం ప్రజల ఆకాంక్షను నెరవేర్చామని వివరించారు. రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం ప్రాంతాలను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. బెంగళూరు-అమరావతి హైవే, రామాయపట్నం పోర్టుతో వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించి ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రజల జీవితాలు మార్చాలి, వెనుకబాటును దూరం చేయాలనే గట్టి పట్టుదలతో శ్రీశైలం మల్లన్న నుంచి మార్కాపురం చెన్నకేశవుని చెంతకు కృష్ణమ్మను తీసుకు వస్తున్నామన్నారు. ప్రతి రైతు పొలానికి నీరు, ప్రతి యువకుడికి ఉపాధి, ప్రతి కుటుంబానికి భరోసా ఇదే "సీబీఎన్ అనే నేను" సంకల్పం అని చంద్రబాబు అన్నారు. ప్రతి పౌరుడూ అనే నేను స్ఫూర్తితో పనిచేసి వ్యక్తిగత విజయాలు సాధిస్తూ జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కరవు సీమకు "వెలుగు కొండ" - నెరవేరుతున్న దశాబ్దాల కల
వెలిగొండ రైతులు రాష్ట్రానికి ఆదర్శం - నిర్వాసితుల త్యాగం వృథా కాదు: సీఎం చంద్రబాబు

