ETV Bharat / state

నూతన సంవత్సర కానుకగా రాజముద్రతో పాసుపుస్తకాల పంపిణీ : సీఎం చంద్రబాబు

పట్టాదారు పాసుపుస్తకాల పంపణీపై సీఎం చంద్రబాబు సమీక్ష - రైతులకు ఇచ్చిన హామీ మేరకు రాజముద్రతో పాసుపుస్తకాలు ఇస్తున్నామని వెల్లడి - రీసర్వే పూర్తయిన గ్రామాల్లో 22 లక్షల కొత్త పాసుపుస్తకాల పంపిణీ

CM Chandrababu Teleconference On Passbook Distribution in AP
CM Chandrababu Teleconference On Passbook Distribution in AP (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 2, 2026 at 10:28 PM IST

3 Min Read
Choose ETV Bharat

CM Chandrababu Teleconference On Passbook Distribution: ప్రభుత్వ రాజముద్ర, భూ యాజమానుల చిత్రాలతో ముద్రించిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. ఈ నెల 9 వరకు గ్రామసభల ద్వారా కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కొనసాగనుంది.

ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాసుపుస్తకాల పంపణీపై టెలీకాన్పరెన్స్ ద్వారా మంత్రులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ రైతులకు నూతన సంవత్సర కానుక అని అన్నారు. గత ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటోలతో భూమి హక్కు పత్రాల పంపిణీ చేయడంపై ప్రజల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రీ సర్వే తప్పులను సరిదిద్ది కొత్త పాసు పుస్తకాలు ఇస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే రాజముద్రతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టింది.

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు : రీ సర్వే పూర్తైన గ్రామాల పరిధిలో 22 లక్షల కొత్త పాసుపుస్తకాల పంపిణీ నేడు ప్రారంభించారు. 2 తేదీ నుంచి 9వ తేదీ వరకు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరగనుంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది గ్రామాల్లో సంబరంగా ఎమ్మెల్యేలు, మంత్రుల చేతుల మీదుగా పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేపట్టారు. జగన్ బొమ్మతో ఉన్న పాసు పుస్తకాల స్థానంలో రాజముద్ర ఉన్న పాసుపుస్తకాలు పంపిణీపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సమీక్షలో పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ సీఎంకు వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలతో ప్రతి గ్రామంలో రెవెన్యూ సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయని ధ్వజమెత్తారు. వివాదాలు లేని స్థలాలను కూడా రీ సర్వే పేరుతో అడ్డదిడ్డంగా చేసి వివాదాస్పదం చేశారని మండిపడ్డారు.

భూ సమస్యలు లేకుండా చేయడమే లక్ష్యం : భూమే ప్రాణంగా బతికే రైతులకు భూ సమస్యలు లేకుండా చేయడం మన లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అసంబద్దంగా తెచ్చిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజలకు అభద్రతను దూరం చేశామని గుర్తుచేశారు. నేడు పాసుపుస్తకాల పంపిణీ ప్రతి ఇంట్లో కొత్త సంతోషాన్ని తెస్తోందని అభిప్రాయపడ్డారు. పాసుపుస్తకాలపై తమ బొమ్మలకు నాటి పాలకులు రూ.22 కోట్లు తగలేశారని దుయ్యబట్టారు.

ప్రజలకు భూ వివాదాలు లేకుండా చేయడం అనేది ప్రథమ కర్తవ్యం కావాలని, నిర్థిష్ట సమయాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. మంత్రులు, జిల్లా కలెక్టర్లు ఈ విషయంలో ఎక్కువ చొరవ తీసుకోవాలని ఆదేశించారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఒకరోజు సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.

పంపిణీలో పాల్గొన్న మంత్రులు : గాడి తప్పిన రెవెన్యూ వ్యవస్థను సరిచేసి పారదర్శక పాలన అందించేందుకు ప్రభుత్వం కృషి చేసిందని శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా పెద్ద బొడ్డేపల్లిలోని వ్యవసాయ మార్కెట్లో పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా సూరాపురం గ్రామంలో పాస్ పుస్తకాల పంపిణీలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్‌ రైతులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకం ప్రభుత్వ అనుమతి పత్రమని అన్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా నాగినాయనచెరువు గ్రామంలో మంత్రి సవిత కొత్త పాస్‌ పుస్తకాలను అందించారు. జగన్‌ రెడ్డిలా కూటమి ప్రభుత్వానికి ఫోటోల పిచ్చి, రంగులు పిచ్చి లేదని దుయ్యబట్టారు. శ్రీకాకుళం జిల్లా అక్కయ్యవలస గ్రామంలో భూయజమానులకు నూతన పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన మంత్రి అచ్చెన్న తాతలు, తండ్రులు ఇచ్చిన పాస్ పుస్తకాలపై దెయ్యాల్లాంటి వాళ్ల బొమ్మలు ఎందుకని మండిపడ్డారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు గ్రామసభలకు హాజరై రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రచార ఆర్భాటాల కోసం జగన్ ప్రభుత్వం సృష్టించిన గందరగోళానికి కూటమి ప్రభుత్వం తెరదించిందని నేతలు వ్యాఖ్యానించారు.

రూ.100కే వారసత్వ రిజిస్ట్రేషన్ - లక్షలాది కుటుంబాలకు లాభం

EPFO పాస్​బుక్​ లైట్​ వచ్చేసింది​​- ఇకపై ఒక్క క్లిక్​తోనే PF ట్రాన్స్​ఫర్​, సెటిల్​మెంట్​ !