వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట - రాయలసీమలో రూ.లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్: సీఎం చంద్రబాబు
వ్యవసాయంలో జాతీయ జీడీపీలో 10 శాతం వాటా మన రాష్ట్రానిదే - 2029లోగా అందరికీ ఇంటిస్థలాలు, ఇళ్లు ఇస్తామని హామీ ఇస్తున్నా - గృహ నిర్మాణం, వ్యవసాయరంగపై శాసనసభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 27, 2026 at 6:15 PM IST
CM Chandrababu Spoke on Housing and Agriculture in Legislative Assembly : రాష్ట్రంలోని ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఉగాదికి ముందే 3 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయబోతున్నామని చెప్పారు. గృహ నిర్మాణంపై శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. 2026 చివరికల్లా 10 లక్షల 60 వేల ఇళ్లలో గృహ ప్రవేశాలు జరగాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. గృహ నిర్మాణంలో వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం కూడా నిధులు ఇస్తోందని చంద్రబాబు తెలిపారు. ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు వివరాలు సేకరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఇళ్ల నిర్మాణానికి అదనపు ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు భద్రత, భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. 2019కి ముందు కట్టిన ఇళ్లను గత ప్రభుత్వం కక్షగట్టి ఆపేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఆపేసిన ఇళ్లనూ త్వరలోనే పూర్తిచేసి ఇస్తామన్నారు. 2029లోగా అందరికీ ఇంటిస్థలాలు, ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఉద్యాన పంటల్లో రాయలసీమను నెంబర్‌వన్ : అనంతరం వ్యవసాయరంగ బడ్జెట్‌పై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఉద్యాన పంటల్లో ప్రపంచంలోనే రాయలసీమను నెంబర్‌వన్‌గా చేస్తామని తెలిపారు. రాయలసీమలో ఉద్యాన పంటల దిగుబడుల్ని 400 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి వెయ్యి మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుతామన్నారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో వ్యవసాయరంగం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచసూత్రాల ద్వారా వ్యవసాయ అభివృద్ధికి చర్యలు చేపట్టామని చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేస్తున్నామని, కృత్తిమ మేథ వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని తెలిపారు. రైతు ఆత్మహత్యలు జరక్కుండా చర్యలు చేపట్టామని చంద్రబాబు ప్రకటించారు.
వ్యవసాయంలో సాంకేతికత ఉపయోగించి రైతులను లాభాలబాట పట్టించడం, రాయలసీమలో లక్ష కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేయడం లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి నీటి భద్రత కల్పించడంతో పాటు డిమాండ్ ఆధారంగా పంటలు వేయడం, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్, ప్రభుత్వ మద్ధతు అనే పంచసూత్రాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో రైతు భరోసా రూ.7500 మాత్రమే ఇచ్చారని, కూటమి ప్రభుత్వం దాన్ని రూ.14 వేలకు పెంచిందని చెప్పారు. రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రాష్ట్రానికి 14 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం విస్తరించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
జాతీయ జీడీపీలో 10 శాతం వాటా మన రాష్ట్రానిదే : "వైఎస్సార్సీపీ హయాంలో సాగురంగంలో తీవ్రంగా నష్టపోయాం. వ్యవసాయంలో జాతీయ జీడీపీలో 10 శాతం వాటా మన రాష్ట్రానిదే. పంచ సూత్రాలు, అగ్రిటెక్ ద్వారా వ్యవసాయాభివృద్ధికి చర్యలు. డిమాండ్ ఉన్న పంటలు పండించేలా రైతులకు అవగాహన కల్పిస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహిస్తే పంటలకు మంచి ధర వస్తుంది. ఉచిత విద్యుత్‌కు ఏటా రూ.13,722 కోట్లు ఖర్చు చేస్తున్నాం. భూసారం పెంచేందుకు సూక్ష్మ పోషకాలను రైతులకు పంపిణీ చేస్తున్నాం. రైతు భరోసా పేరుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మిగతా ప్రోత్సాహకాలు ఆపేసింది. ధాన్యం రైతులకు రూ.10 వేల కోట్లకు పైగా ఇచ్చాం. మేం వచ్చాక రూ.1,670 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించాం.
ఎక్కడా రైతుల ఆత్మహత్యలు జరగకుండా చర్యలు చేపట్టాం. రైతుల ఆత్మహత్యకు కారణాలు తెలుసుకుని సమస్య పరిష్కరిస్తున్నాం. వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేస్తున్నాం. సాగురంగంలో ఏఐ, ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తున్నాం. 8 వేలకు పైగా గ్రామాల్లో 15 లక్షల మంది ప్రకృతి సేద్యం చేస్తున్నారు. ప్రకృతి సేద్యం వైపు 40 లక్షల మందిని మళ్లించాలనేది మా లక్ష్యం. భూగర్భ జలాలు పెంచి నీటి నిర్వహణ సమర్థంగా చేపట్టాలి. రైతులు కూడా ప్రభుత్వ విధానాలు అర్థం చేసుకోవాలి. కౌలురైతులు ఎక్కువ విస్తీర్ణంలో పంట వేసి నష్టపోతున్నారు" అని సీఎం చంద్రబాబు తెలిపారు.
"వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నాం. రైతులకు ఆధునిక పరికరాలను పరిచయం ప్రోత్సహిస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్‌పై అధిక దృష్టి పెట్టాం. ప్రకృతి సేద్యాన్ని 50 లక్షల ఎకరాలకు విస్తరిస్తాం. రాయలసీమలో 20 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ సాగు అవుతోంది. దేశంలోనే అత్యధిక పండ్లు పండే ప్రాంతంగా రాయలసీమ ఉంది. రాయలసీమలో హార్టికల్చర్‌ను 40 లక్షల ఎకరాలకు పెంచుతాం. రాయలసీమ హార్టికల్చర్‌కు రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఏలూరు దగ్గర అతిపెద్ద కోకో సిటీ వస్తుంది. ఏజెన్సీలో కాఫీ పంట విస్తీర్ణం పెరుగుతోంది. ఆక్వా ఉత్పత్తిలో దేశంలోనే తొలి స్థానంలో ఉన్నాం. అతిపెద్ద ఆక్వా కల్చర్ హబ్‌గా మన రాష్ట్రం తయారవుతుంది." - సీఎం చంద్రబాబు
నదుల అనుసంధానంతో నీటి సమస్యలు తగ్గుతాయి: సీఎం చంద్రబాబు
వైద్యారోగ్యానికి అధిక ప్రాధాన్యం - క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలతో కలిసి మాట్లాడాలి : సీఎం చంద్రబాబు

