నదుల అనుసంధానంతో నీటి సమస్యలు తగ్గుతాయి: సీఎం చంద్రబాబు
సాగునీటి రంగంపై శాసనసభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు - పోలవరం-నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని గోదావరి నుంచి వృథాగా సముద్రంలోకి వెళ్లే వరద జలాలను తరలిస్తామని వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 26, 2026 at 4:44 PM IST
|Updated : February 26, 2026 at 5:47 PM IST
CM Chandrababu Speech in Assembly on Irrigation: గంగా-కావేరి అనుసంధానం కావాలనేది నా ప్రగాఢ ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు చెప్పారు. గోదావరికి అఖండ హారతి, కృష్ణాకు పవిత్ర హారతి ఇచ్చామని గుర్తు చేస్తూ నదులను పూజించడం సంప్రదాయంగా పెట్టుకున్నామని తెలిపారు. సాగునీటి రంగంపై సీఎం చంద్రబాబు శాసనసభలో మాట్లాడుతూ ఏ పనైనా చిన్న ఆలోచనతోనే మొదలవుతుందని గంగా-కావేరి అనుసంధానం సాధ్యాసాధ్యాలపై ఆనాడే చర్చలు జరిగాయని తెలిపారు. నదుల అనుసంధానం చేసి తెలుగుతల్లికి జలహారతి ఇచ్చే బాధ్యత మాది అని అన్నారు.
నదుల అనుసంధానం వల్ల నీటి సమస్యలు తగ్గుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులన్నీ ఎన్డీయే లేదా టీడీపీ హయాంలోనే జరిగాయని ఇంకా పట్టిసీమ నుంచి 100 టీఎంసీలు కృష్ణాకు తీసుకొచ్చామని వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేశా, తానే పూర్తి చేస్తున్నానని స్పష్టం చేశారు. ధవళేశ్వరం వద్ద బ్యారేజీ నిర్మాణం వల్ల కాటన్ దొరను ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటున్నారని గోదావరి జిల్లాల్లో కాటన్ దొర విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు.
''పోలవరం అతిపెద్ద ప్రాజెక్టు ఎమ్మెల్యేలందరూ ఒకసారి చూసి రావాలి. పోలవరం వంటి పెద్ద ప్రాజెక్టు దేశంలో మరొకటి నిర్మించే అవకాశం లేదు. పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తిచేసి జాతికి అంకితం చేస్తాం. అన్ని రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయంటే ప్రభుత్వ దూరదృష్టి. ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలని మా ప్రభుత్వ లక్ష్యం. ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీరు అందించేలా చర్యలు.''- చంద్రబాబు, సీఎం
కాళేశ్వరంకు మేం అభ్యంతరం చెప్పలేదు: పోలవరం-నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని గోదావరి నుంచి వృథాగా సముద్రంలోకి వెళ్లే వరద జలాలను తరలిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. గోదావరిపై ఎగువ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని అందుకు మేం అభ్యంతరం చెప్పలేదని తెలిపారు. ఆ ప్రాజెక్టు వల్ల తెలుగు రాష్ట్రాలకు లాభమని చెప్పారు. పోలవరం డయాఫ్రంవాల్ కొట్టుకుపోతే గుర్తించలేని పరిస్థితి గత పాలకులదని విమర్శించారు. చేయని నేరానికి నన్ను గత పాలకులు 53 రోజలు పాటు జైల్లో పెట్టారని రాష్ట్రంలో ప్రతి ఎకరాకూ నీరు ఇవ్వాలన్న లక్ష్యంతోనే పని చేస్తున్నానని సీఎం తెలిపారు.
కావేరిపై 2 రాష్ట్రాలు ఎలా కొట్లాడుకుంటున్నాయో చూశామని నీరు పుష్కలంగా ఉంటే ఎలాంటి సమస్యలు రావని సీఎం చంద్రబాబు అన్నారు. నీటి భద్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కొందరు రాజకీయం కోసమే నీటి సమస్యలను తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి ఉండే వాటర్ సెక్యూరిటీ దక్షిణ భారత్‌లో మరే రాష్ట్రానికీ లేదని భూమినే జలాశయంగా మార్చి నీటి సంరక్షణ చేయాలని అందరికీ పిలుపునిస్తున్నానని వివరించారు. సాగునీరు, పరిశ్రమలకు నీరు, ప్రతి ఇంటికీ తాగునీరు ఇస్తే లక్ష్యం సాధించినట్లేనని అన్నారు. తెలుగుతల్లికి జలహారతి ఇచ్చేలా ప్రతి ఎకరాకు నీరివ్వాలని సంకల్పతో ఉన్నామని అలానే రాష్ట్రంలో ప్రాజెక్టుల పూర్తికి బ్లూప్రింట్ సిద్ధం చేస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు.
చట్ట సవరణ బిల్లులకు ఆమోదం: హరిత ఇంధన కంపెనీలకు అసైన్డ్ భూములు లీజుకు ఇచ్చేందుకు వెసులుబాటు కల్పించే చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టగా ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పార్థసారథి బలపరిచారు. కర్బన ఉద్గారాలు సున్నాకు తీసుకొచ్చే లక్ష్యంతో హరిత ఇంధన సంస్థలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని అనగాని తెలిపారు. రాష్ట్రంలో 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నట్లు వెల్లడించారు. తద్వారా 7 లక్షల 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాలను స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డులుగా మారుస్తూ చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఈ బిల్లు ప్రవేశపెట్టగా ఎమ్మెల్యేలు గణబాబు, కాల్వ శ్రీనివాసులు బలపరిచారు. బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల విధులపై స్పష్టత లేదన్నారు. కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047తో పని చేస్తోందని అందుకు తగ్గట్లుగా సచివాలయాల విధుల్లో మార్పులు చేశామన్నారు. ఈ క్రమంలోనే స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డులుగా పేర్లు మారుస్తూ చట్టసవరణ చేస్తున్నట్లు వివరించారు. స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డుల సిబ్బందికి పదోన్నతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. స్వర్ణగ్రామాలు, స్వర్ణ వార్డుల పర్యవేక్షణకు ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని గవర్నింగ్ బాడిగా నియమించినట్లు చెప్పారు.
జీరో అవర్లో సమస్యలపై మాట్లాడిన నేతలు: అసెంబ్లీ జీరో అవర్లో మాట్లాడిన మాట్లాడిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల పరిధిలో ఉన్న సమస్యలు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలను ప్రస్తావించారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో ట్రాఫిక్ పెరిగినందున ప్రస్తుత ఫ్లైఓవర్ సరిపోవటం లేదని రెండో ఫ్లైఓవర్ నిర్మించాలని కోరారు. చీరాల ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ మొంథా తుపాన్ కారణంగా చీరాల ప్రాంతంలో రోడ్లకు గుంతలు పడ్డాయన్నారు. రూ.8.40 కోట్ల పనులకు ప్రతిపాదనలు పంపించామని త్వరగా నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ మాట్లాడుతూ ఒంగోలు-కత్తిపూడు హైవే 1సిమెంట్ రోడ్డు కావటంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. నో హెల్మెట్-నో ఫ్యూయల్ విధానం తెచ్చి హెల్మెట్ లేని వారికి పెట్రోల్ కొట్టకుండా చట్టం చేయాలన్నారు.
తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతిలో టీటీడీ భవనాలకు పన్ను చెల్లించటం లేదన్నారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునిత మాట్లాడుతూ హంద్రీనీవా ప్రధాన కాలువకు పిల్ల కాలువలు నిర్మించటం ద్వారా రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల పరిధిలో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖలో రహదారులు చిన్నగా ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ప్రతిష్టాత్మక సంస్థలు విశాఖలో కంపెనీలు ఏర్పాటు చేస్తున్నందున మెట్రో నిర్మాణం, ఫ్లైఓవర్లు రహదారుల విస్తరణ చేపట్టాలని కోరారు.
ఫిష్సింగ్ హార్బర్ల నిర్మాణానికి చర్యలు: మత్స్యకారులకు ఉపాధి పెంచే ఫిష్సింగ్ హార్బర్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి బీసీ జనార్థనరెడ్డి తెలిపారు. పిష్సింగ్ హార్బర్ల నిర్మాణంపై ఎమ్మెల్యేలు నడికుడితి ఈశ్వరరావు, లోకం మాధవి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఎచ్చర్ల నియోజకవర్గంలోని బుడగట్లపాలెం ఫిష్షింగ్ హార్బర్ పనులకు రూ.441 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. దీనికి సాస్కి నిధులు వినియోగిస్తామని చెప్పారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో చింతపల్లి జెట్టీ నిర్మించేందుకు ప్రతిపాదనలున్నాయని ప్రస్తుతానికి అక్కడ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ మంజూరు చేసి టెండర్లు పిలిచామన్నారు.
రాయితీలు, ప్రోత్సాహకాలు అందించటం ద్వారా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు తోడ్పాటు అందిస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చాక 751 ఎకరాలు ఎస్సీ, ఎస్టీలు ఏర్పాటు చేసే పరిశ్రమలకు కేటాయించామని డీపీఆర్ ప్రకారం రూ.1274 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారని వివరించారు. ఎస్సీ ఎస్టీలకు రూ.37 కోట్లు రిబేటు ఇచ్చామని ఎలాంటి పెనాల్టీ లేకుండా కాలపరిమితి పెంచామని తెలిపారు. రూ.100 కోట్లు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి 5000 ఎంఎస్ఎంఈలకు సహకరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
15 రకాల రక్షణ ఫీచర్లతో పాస్ పుస్తకాలు: భూముల రీసర్వే ద్వారా రాజముద్రతో పాటు 15 రకాల రక్షణ ఫీచర్లతో పాస్ పుస్తకాలు అందిస్తున్నట్లు రెవిన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూముల రీసర్వేపై ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. జగన్ ప్రచారయావ, భూమిని కాజేసే ఆలోచనలతో గతంలో భూసర్వేలో సమస్యలు వచ్చాయన్నారు. రాళ్లు పాతడానికి రూ.700 కోట్లు ఖర్చు చేసిన జగన్ రీసర్వేపై సరైన దృష్టి పెట్టలేదని ఆరోపించారు. కూటమి వచ్చాక రీసర్వేపై గ్రామ సభలు, రెవెన్యూ సదస్సులు పెట్టామని, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని వివరించారు. రీసర్వే 2.0లో బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా రికార్డులను ట్యాంపరింగ్ కాకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ 7,926 గ్రామాల్లో రీసర్వే పూర్తయ్యిందని 4,236 గ్రామాల్లో రీసర్వే జరుగుతోందని చెప్పారు.
వైఎస్సార్సీపీ హయాంలో అనర్హులకు ఎక్కడైనా ఇంటి స్థలాలిస్తే వాటిని రద్దు చేస్తామని గృహ నిర్మాణశాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. అప్పట్లో కొన్నిచోట్ల పట్టాలు ఇచ్చి స్థలాలు ఇవ్వలేదని తెలిపారు. వారిలో అర్హులను గుర్తించే ప్రక్రియ జరుగుతోందని పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమి ఇస్తామని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో కేంద్రం నిబంధనలు మార్చిందని దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల కోసం ఇచ్చే నిధుల్లో తేడా జరిగిందన్నారు.
ఉద్యానవనంగా మార్కాపురం జిల్లా - జులై 1కి వెలిగొండ నుంచి నీరు విడుదల: సీఎం చంద్రబాబు
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం - నిర్లక్ష్యం వహించొద్దు: సీఎం చంద్రబాబు

