భూకబ్జా చేయాలంటే భయపడేలా చర్యలు తీసుకుంటాం: సీఎం చంద్రబాబు
తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పర్యటించిన సీఎం చంద్రబాబు - రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ - ప్రజావేదికలో సభలో మాట్లాడుతూ పత్రాలపై జగన్ ఫొటో ఎందుకు వేశారో అర్థం కాలేదని వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 9, 2026 at 5:42 PM IST
|Updated : January 9, 2026 at 6:17 PM IST
CM Chandrababu Distributes Passbooks to Farmers: కరోనా సమయంలోనూ రైతులు పనిచేసి అందరికీ అన్నం పెట్టారని సీఎం చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పర్యటించిన సీఎం చంద్రబాబు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదికలో సభలో పాల్గొని మాట్లాడారు. రైతుల భూమి పత్రాలపై జగన్ ఫొటో ఎందుకు వేశారో అర్థం కాలేదని అన్నారు. గత ప్రభుత్వ నేతలవి ప్రమాదకరమైన ఆలోచనలని ‘మీ భూమి - మీ హక్కు’ అని ఎన్నికల ప్రచారంలోనే తాము చెప్పినట్లు గుర్తు చేశారు. రాజముద్ర వేసి పాస్‌బుక్‌లు ఇస్తామని హామీ ఇచ్చామని, దాన్ని ఇప్పుడు నెరవేర్చామని సీఎం తెలిపారు.
గ్రామసభలు ఏర్పాటు చేసి రైతులకు ఈనెల 11 వరకు పాస్‌బుక్‌లు ఇస్తున్నామని సీఎం వెల్లడించారు. ఒక్క రూపాయి అవినీతి లేకుండా చూడాలని అధికారులకు చెప్పానని ఆ విధంగా ఎమ్మార్వోలు, ఆర్డీవోలు, మిగతా సిబ్బంది మనసుపెట్టి పని చేయాలని ఆదేశించారు. వచ్చే నెలలో మళ్లీ సర్వే చేసి పాస్‌బుక్‌లు ఇస్తామని తెలిపారు. ఒక్కసారి ప్రింట్ అయ్యాయంటే ఇక జీరో మిస్టేక్స్ ఉండాలని సూచించారు. భూమికి సంబంధించి 29 అంశాలపై ఫిర్యాదులు వచ్చాయని అన్నింటినీ పరిష్కరిస్తున్నామని సీఎం తెలిపారు
అలానే 22-ఏ భూములపై వచ్చిన సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాామని వెల్లడించారు. రైతుల భూరికార్డులన్నీ బ్లాక్‌చైన్‌లో భద్రంగా ఉంటాయని, ఎవరైనా భూకబ్జా చేయాలంటే భయపడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చిన్న చిన్న భూతగాదాలు పెట్టుకోవద్దని ప్రజలందరినీ కోరుతున్నానని, ముందుగా కుటుంబసభ్యులు, బంధువులతో వివాదాలు వద్దని కోరారు. గొడవలు పడి కోర్టులకు వెళ్తే జీవితకాలం వృథా అవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
''గత పాలకులు గంజాయిని వాణిజ్య పంటగా మార్చారు. ఆడబిడ్డల జోలికి వస్తే వారికదే చివరిరోజు అదే చేసి చూపిస్తున్నాం. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ చనిపోయేందుకు కారణమయ్యారు. డాక్టర్ సుధాకర్ కుమారుడికి ఉద్యోగం ఇచ్చాం ఇంక రూ.కోటి సాయం చేశాం. గాడి తప్పిన పరిపాలనను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారితే దానివల్ల నష్టం ఎక్కువ వస్తుంది. గతపాలకులు చేసిన విధ్వంసాన్ని సరిచేసేందుకే సమయం సరిపోతుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధ్వంసాన్ని సరిచేసేందుకు మూడేళ్లు పడుతుంది. ఇంకా వారి ప్రభుత్వం వల్ల పోలవరం, అమరావతి ఆలస్యమయ్యాయి."- చంద్రబాబు, సీఎం
నదుల పక్కనే పెద్దపెద్ద నగరాలు: నరకాసురిడి పాలన మళ్లీ రాకూడదని మనం కోరుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. గోదావరి పుష్కరాలు వచ్చే 3 సార్లూ నేనే సీఎంగా ఉండటం నా అదృష్టమని చెప్పారు. సముద్రంలోకి వెళ్లే నీటిలో 300 టీఎంసీలు వాడుకుంటే కరవే ఉండదని అలానే పోలవరం పూర్తయితే నీటి సమస్యే ఉండదని తెలిపారు. పోలవరం నుంచి విశాఖకు అక్కడి నుంచి వంశధారకు తీసుకెళ్తామని రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని వెల్లడించారు. గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏమీ ఉండవని సూచించారు. పెద్దపెద్ద నగరాలన్నీ నదుల పక్కనే ఉన్నాయి. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ఆఖరికి వైద్యకళాశాలలపైనా రాజకీయాలు చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతదేశంలో ఫుడ్ అంటే గుర్తుకు వచ్చేది మన రాష్ట్రమే: సీఎం చంద్రబాబు
జలాలు సముద్రం పాలైతే ఎవరికి ఉపయోగం - వాడుకుంటే మేలే కదా: సీఎం చంద్రబాబు

