ETV Bharat / state

వ్యాపారితో పోలీసుల ఘర్షణపై సీఎం సీరియస్ - చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశం

విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించిన సీఎం చంద్రబాబు - ఇప్పటికే ఎస్ఐను వీఆర్‌కు పంపామని తెలిపిన అధికారులు

CM_Serious_on_Podili_Incident
CM_Serious_on_Podili_Incident (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 31, 2025 at 5:02 PM IST

3 Min Read
Choose ETV Bharat

CM Serious on Businessman and SI Issue in Podili: ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో స్థానిక వ్యాపారికి, పోలీసులకు జరిగిన ఘర్షణపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. స్థానిక ఎస్ఐ అకారణంగా దాడి చేశారనే వ్యాపారుల ఆరోపణపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. పొదిలి పట్టణంలో ఈ నెల 24వ తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో షాప్ వద్ద లారీ నుంచి ఎరువులను అన్​లోడ్​ చేసే క్రమంలో వెంటనే లారీని అక్కడ నుంచి తొలగించాలని పోలీసులు కోరిన సందర్భంలో అవినాష్ అనే వ్యాపారికి, పట్టణ ఎస్సై వేమనకు మధ్య వివాదం రేగింది.

తరువాత రోజు క్రిస్మస్ పండగ సందర్భంగా రోడ్లపై రద్దీ కారణంగా ట్రాఫిక్​ను క్లియర్ చేసే క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంలో తమపై లాఠీతో దాడి చేశారని అవినాష్​తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఎస్సైపై ఆరోపణలు చేశారు. దీనిపై వ్యాపార వర్గాలు తీవ్ర అభ్యంతరం వక్తం చేస్తూ ఆందోళన చేయడంతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాయి. ఘటనపై ప్రాథమిక విచారణ జరిపిన జిల్లా ఎస్పీ ఎస్ఐ వేమనను వీఆర్​కు పంపుతూ 2 రోజుల క్రితం ఆదేశాలు ఇచ్చారు. ఘర్షణకు కారణాలు, పోలీసుల చర్యలు, వ్యాపార వర్గాల ఆందోళనపై హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సీఎం మాట్లాడారు.

ఘటనపై ఇప్పటికే మంత్రులు, అధికారులు స్పందించారని వివరించారు. సదరు పోలీసు సబ్​ఇన్​స్పెక్టర్​కు ముందుగా ఛార్జ్ మోమో ఇచ్చి వివరణ తీసుకున్నామని, ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎస్సై వేమనను వీఆర్​కు పంపామని డీజీపీ వివరించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని సాధారణ ప్రజల పట్ల వ్యవహరించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు. పొదిలి ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ప్రజలు, వ్యాపారుల గౌరవానికి భంగం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

వ్యాపారులు, ఆర్యవైశ్యులు ఆందోళన: అనం యాదాల అవినాష్, కోటేశ్వరరావులను పొదిలి ఎస్సై వేమన కొట్టడాన్ని నిరసిస్తూ సోమవారం వ్యాపారులు, ఆర్యవైశ్యులు ఆందోళన చేపట్టిన విషయం విధితమే. మధ్యాహ్నం వరకు దుకాణాలు మూసివేశారు. ముందుగా అమ్మవారిశాల వద్ద ఉన్న గాంధీ, పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి చిన్నబస్టాండ్, పెద్దబస్టాండ్ వరకు ర్యాలీ తీశారు. తరం తహసీల్దార్ కార్యాలయంలో డీటీ షాహీదాబేగంకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. అనంతరం ఒంగోలు వెళ్లి జిల్లా ఉన్నతాధికారులకు ఎస్సైపై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు బి. సుబ్బారావు, జి.సి. సుబ్బారావు, జి. భాస్కర్, మధుసూ దనరావు, పలు మండలాల ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

బాధితులకు హోం మంత్రి అనిత పరామర్శ: యాదాల కోటేశ్వరరావు, అవినాష్​లను సోమవారం మంత్రి అనిత ఫోన్​లో పరామర్శించారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డి. రాకేష్ విజయవాడ నుంచి పొదిలి వచ్చి సంఘటన ఎలా జరిగిందని బాధిత కుటుంబాన్ని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చరవాణిలో మంత్రి అనిత కోటేశ్వర రావు, రాకేష్​తో మాట్లాడారు. కుటుంబాలకు అన్నివిధాల ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. వారి వెంట స్థానిక ఆర్య వైశ్య సంఘం నాయకులు జి. భాస్కర్, మధుసూదనరావు, సత్యం, వ్యాపారులు, స్థానికులు తదితరులు ఉన్నారు.

ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం - ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

శాంతిభద్రతల విషయంలో రాజీపడేదే లేదు - తప్పు చేసిన ఏ ఒక్కర్నీ వదిలిపెట్టం: సీఎం చంద్రబాబు