ETV Bharat / state

గిరిజన ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు - మారుమూల ప్రాంతాల్లో సెల్‌ టవర్లు: సీఎం చంద్రబాబు

నెలలోగా అవేర్ 2.0 ద్వారా ఏమేరకు ఫలితాలు వచ్చాయో విశ్లేషించాలి - మూడు నెలల్లో యూఎల్‌బీల్లో చెత్త తొలగిస్తాం - రియల్‌టైమ్ గవర్నెన్స్‌ నుంచి వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

CM Chandrababu Review Various Issues from RTGS
CM Chandrababu Review Various Issues from RTGS (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 6, 2026 at 6:52 PM IST

3 Min Read
Choose ETV Bharat

CM Chandrababu Review Various Issues from RTGS : ప్రజా సమస్యలు, ఇబ్బందులపై RTGS కేంద్రం నుంచి రియల్ టైమ్‌లోనే స్పందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రం నుంచి రియల్ టైమ్‌లోనే ప్రజల సమస్యలు, ఇబ్బందులపై రెస్పాన్స్ అందాలని దిశానిర్దేశం చేశారు. వేగంగా స్పందించగలిగితేనే పౌరులకు మెరుగైన సేవల్ని అందించగలుగుతామని స్పష్టం చేశారు. సీఎస్ ఆధ్వర్యంలో మల్టీ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ సమావేశం జరగాలన్నారు. విశాఖ సముద్రం తీరంలో బోటు మునిగి మత్స్యకారులు గల్లంతైన ఘటనలో తక్షణ స్పందనగా ఏఏ విభాగాలు ఎలా స్పందించాయన్నదే కీలకమని అన్నారు. ఆర్టీజీఎస్ కేంద్రం 24 గంటలూ ప్రజలకు సేవలందించేలా చర్యలు చేపట్టాలని సీఎం నిర్దేశించారు.

ఐదు రోజుల జిల్లాల పర్యటన అనంతరం అమరావతికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పురపాలక, పంచాయితీరాజ్, హోం, ఎక్సైజ్ తదితర శాఖల ద్వారా అందిస్తున్న ప్రభుత్వ సేవలపై సమావేశంలో చర్చించారు. ఏఐ మెథడాలజీ ద్వారా చిత్తూరు జిల్లాలో సంతృప్తి స్థాయి నమోదు చేస్తున్నామని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనల వల్ల ప్రజాభిప్రాయం నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. నియోజకవర్గస్థాయిలో లాస్ట్ మైల్ గవర్నెన్స్ ప్రజలకు అందాలన్నారు.

గిరిజన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు : రాష్ట్ర అభివృద్ధిలో ప్రజాపాలనలో పొలిటికల్ మేనేజ్మెంట్-బ్యూరోక్రటిక్ యాక్షన్ సమపాళ్లలో ఉండాలని సీఎం చంద్రబాబు తెలిపారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. వివిధ కేటగిరీలు, శాఖలకు చెందిన పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ఓ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా కలెక్టర్లు, ఉన్నతాధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

రాష్ట్రంలో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాలని, గంజాయి ముఠాలను పూర్తిగా నియంత్రించాలన్నారు. గంజాయి నిర్మూలనపై తీసుకుంటున్న చర్యలపై సమాచారాన్ని ప్రజల్లోకి వెళ్లేలా చూడాలని చంద్రబాబు నిర్దేశించారు. కేంద్రం కూడా డ్రగ్ ఫ్రీ కంట్రీగా భారత్‌ను తయారుచేసేలా కార్యాచరణ చేపట్టిందని దానికి అనుగుణంగానే లక్ష్యాలను నిర్దేశించుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల ద్వారా ఎలాంటి ఫలితాలు సాధిస్తున్నామో అన్న అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు విశ్లేషించాలని సీఎం అధికారులకు సూచించారు.

ప్రతీ అంశంలోనూ పొదుపు మంత్రం : క్షేత్రస్థాయిలో తాగునీరు, వ్యర్ధాల సేకరణకు స్వచ్ఛ రథాలు, ఇంటింటికీ చెత్త సేకరణ లాంటి అంశాల్లో నిర్దిష్టమైన ఎస్ఓపీ జారీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పేరుకున్న 23 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మూడు నెలల్లోగా తొలగించాలని దీనిపై ప్రజాప్రతినిధులు కూడా శ్రద్ధ పెట్టాలని సూచించారు. జీరో వేస్ట్ మున్సిపల్ ప్రాంతాలు మన లక్ష్యం కావాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, పీజీఆర్ఎస్ ద్వారా వస్తున్న దరఖాస్తులను ఆర్ధిక, ఆర్ధికేతర కేటగిరీలుగా విభజించి పరిష్కారం చూపాలని సీఎం స్పష్టం చేశారు.

ఈ విషయంలో కలెక్టర్లు అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. వివిధ సమస్యల్ని ఎదుర్కొనేలా ఇతర ప్రాంతాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను అనుసరించటంతో పాటు ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రతీ అంశంలోనూ పొదుపు మంత్రం పాటించాలని సీఎం నిర్దేశించారు. నెలరోజుల్లోగా అన్ని ప్రభుత్వ శాఖలూ అవేర్ 2.0 ద్వారా ఏమేరకు ఫలితాలు వచ్చాయో విశ్లేషించాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనికేషన్ నెట్వర్క్ కనెక్టివిటీ కోసం మారుమూల ప్రాంతాల్లో టవర్లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ చేపట్టాలన్నారు. ఆపరేటర్లను సంప్రదించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షకు మంత్రి కొలుసు పార్ధసారధి, సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పురపాలక, ఎక్సైజ్, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

మదనపల్లెలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఏర్పాటు చేస్తాం : సీఎం చంద్రబాబు

ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేవారికి గొడ్డలి పార్టీ ఫండింగ్ చేస్తోంది: సీఎం చంద్రబాబు