ETV Bharat / state

'ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి' - ఇరుసుమండ బ్లోఅవుట్​పై సీఎం చంద్రబాబు సమీక్ష

గ్యాస్‌ లీకేజీని అరికట్టేందుకు, ప్రజల రక్షణకు వివిధ విభాగాలు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు - మంటల కారణంగా కొబ్బరి చెట్లు కాలిపోయిన వారికి పరిహారం అందించాలన్న సీఎం

CM Chandrababu Review Over Blowout Incident at Konaseema District
CM Chandrababu Review Over Blowout Incident at Konaseema District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 6, 2026 at 3:46 PM IST

2 Min Read
Choose ETV Bharat

CM Chandrababu Review Over Blowout Incident at Konaseema District : బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో జరిగిన బ్లో అవుట్‌ ప్రమాదంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితులను సంబంధిత అధికారులు సీఎంకు వివరించారు. గ్యాస్‌ లీకేజీని అరికట్టేందుకు, ప్రజల రక్షణకు వివిధ విభాగాలు తీసుకుంటున్న చర్యలను హోంమంత్రి అనిత, సీఎస్‌ విజయానంద్‌, ఇతర అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ఆయా గ్రామాల ప్రజలకు అందుతున్న సహాయ చర్యలపైనా ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు.

బాధితులకు పరిహారం అందించాలి : ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతారని, వారికి ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితి వివరించి అండగా నిలవాలని సీఎం చంద్రబాబు సూచించారు. సమస్య పూర్తిగా తీరే వరకు ఇళ్లు, ఊళ్లు వదిలిన వారు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందన్నారు. మంటల కారణంగా కొబ్బరి చెట్లు కాలిపోయిన వారికి పరిహారం అందించాలని ఆదేశించారు.

ఓఎన్జీసీ సహా ఇతర భాగస్వామ్య సంస్థలతో సమావేశం : మంటలను అరికట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవసరమైన ఏజెన్సీల సాయాన్ని తీసుకోవాలని సూచించారు. అక్కడ సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరంగా పూర్తి సహకారం అందించాలని చెప్పారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా ఓఎన్జీసీ సహా ఇతర భాగస్వామ్య సంస్థలతో త్వరలో సమావేశం నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు.

పచ్చని కోనసీమ నిప్పుల కొలిమిగా - తరచూ భయపెడుతున్న బ్లోఅవుట్‌లు

అసలేెం జరిగిందంటే : పచ్చని కోనసీమలో బ్లోఅవుట్‌ ప్రజలను మరోసారి భయభ్రాంతులకు గురి చేసింది. భీకర ధ్వనితో పేలుళ్లు, ఎగసిన మంటలతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో స్థానికులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలోని మోరి-5 డ్రిల్లింగ్‌ సైటులో సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో గ్యాస్‌ లీకేజీ ఆరంభమైంది. 12.35 గంటలకల్లా నిప్పు తోడవడంతో 30 మీటర్ల ఎత్తున అగ్నిజ్వాలలు ఎగసిపడ్డాయి. ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ హఠాత్పరిణామంతో సమీపంలోని ఇరుసుమండ, లక్కవరం గ్రామస్థులు తల్లడిల్లిపోయారు.

గ్యాస్‌ పీడన స్థాయి అంచనా తప్పి : ఇరుసుమండ సమీపంలోని మోరి-5 సైటులో 1993లో గ్యాస్, చమురు నిక్షేపాల వెలికితీత ప్రారంభమైంది. తర్వాత కాలంలో ఈ బావిలో నిక్షేపాల పీడన స్థాయి తగ్గిపోయి నీరు ఎక్కువగా వచ్చింది. ఇందులో నిక్షేపాల వెలికితీతకు 2024లో డీప్‌ ఇండస్ట్రీ లిమిటెడ్‌ కంపెనీకి లీజుకు అప్పగించారు. తాజాగా 2,700 మీటర్ల లోపల కొత్త జోన్‌లోకి వెళ్లేటప్పుడు లాగింగ్‌ టూల్‌ టెస్టింగ్‌ ద్వారా బాంబింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. సోమవారం అనూహ్యంగా 2,500 పీడన స్థాయి (పీఎస్‌ఐ)లో గ్యాస్‌ బయటకు రాగా నియంత్రించేందుకు కెమికల్‌ మడ్‌ పంపింగ్‌ ప్రక్రియ చేపట్టారు.

పీడన స్థాయి విపరీతంగా ఉండటం, మడ్‌ పంపింగ్‌ అదుపు చేయకపోవడంతో గ్యాస్‌ భారీగా ఎగజిమ్మింది. బ్లో అవుట్‌ ప్రివెంటర్‌ (బీవోపీ) ను నియంత్రించే స్థాయిని మించి అది బయటకు రావడంతో సిబ్బంది వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. బీవోపీ వద్ద రాపిడికి అగ్నికీలలు, రెండు సార్లు పేలుళ్లు తోడవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం భగ్గుమంది. గ్యాస్‌తో పాటు మంటలు ఒకేసారి వ్యాపించి ఉంటే అక్కడ పని చేస్తున్న వారికి ప్రాణనష్టం జరిగేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్ ప్రదేశంలో పేలుడు - ఎగసిపడుతున్న మంటలు