ETV Bharat / state

సిలిండర్ల డెలివరీలో డబ్బు వసూలు చేయొద్దు - బస్టాండ్లలో సౌకర్యాలు మెరుగ్గా ఉండాలి: సీఎం చంద్రబాబు

ఆర్టీజీఎస్, పబ్లిక్ పాజిటివ్ పర్షెప్సన్‌పై క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష - వివిధ శాఖల సమర్ధత పెరిగేలా, మెరుగైన సేవలు అందించేలా అధికారులకు పలు సూచనలు

CM_Review_on_RTGS
CM_Review_on_RTGS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 2, 2026 at 4:42 PM IST

|

Updated : March 2, 2026 at 6:36 PM IST

3 Min Read
Choose ETV Bharat

CM Review on RTGS and Public Positive Perception: పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్ర ప్రజలను సురక్షితంగా తీసుకురావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, కువైట్ తదితర దేశాల్లోని రాష్ట్ర ప్రజలను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. యుద్ధం, విమాన సర్వీసుల రద్దు కారణంగా అక్కడ చిక్కుకుపోయిన వారిని సంప్రదించి, తక్షణ సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. రాష్ట్రంలోని బాణసంచా తయారీ కేంద్రాల్లో పేలుడు ఘటనలు పునరావృతం కాకుండా రక్షణ చర్యలపై తమిళనాడులోని శివకాశీకి వెళ్లి అధ్యయనం చేయాలని సీఎం స్పష్టం చేశారు.

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అక్కడ చిక్కుకున్న తెలుగువారి పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఉండవల్లిల క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ అధికారులు, ఏపీఎన్ఆర్టీ ప్రతినిధులతో సమీక్షించారు. సహాయక చర్యల విషయంలో ఏపీ ఎన్ఆర్టీ, ఆర్టీజీఎస్ కలిసి పనిచేయాలని, నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులకు సీఎం చెప్పారు. కేంద్రం ద్వారా ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని సూచించారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన రాష్ట్ర ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

ఏపీ ఎన్ఆర్టీతో కలిసి చర్యలు: గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఎన్ఆర్టీతో కలిసి చర్యలు చేపట్టింది. వారికి సహాయం కోసం 0863-2340678 హెల్ప్ లైన్ నెంబర్, 85000 27678 వాట్సప్ నెంబర్‌ను 24 గంటలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏపీ ఎన్ఆర్టీ కో ఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి కల్పిస్తున్నారు. ప్రవాసాంధ్రులు సంప్రదించిన వెంటనే ఏపీ ఎన్​ఆర్టీ వారికి తక్షణం సహాయ, సహకారాలు అందించేలా ఏర్పాట్లు చేశారు. హెల్ప్‌ లైన్ నెంబర్లతో పాటు helpline@apnrts.com, support@apnrts.com, info@apnrts.com ఈ మెయిళ్లు, https://apnrts.ap.gov.in వెబ్సైట్‌ను కూడా సంప్రదించవచ్చు.

అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ వినియోగించుకోవడం ద్వారా పాలనలో సమర్ధత మరింత పెంచుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. డ్రోన్, సీసీ టీవీ కెమేరాలు, శాటిలైట్ సమాచారాన్ని సమీకృతం చేసి వినియోగించుకునేలా ఒక మెకానిజం తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు, పనితీరు మెరుగు పరుచుకునేందుకు అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు, సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

నిజాయితీ కలిగిన అధికారులకే అవకాశం: రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ బస్ స్టేషన్లలో తాగునీటికి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బస్ స్టేషన్‌కు వచ్చిన దగ్గర నుంచి గమ్యస్థానం చేరే వరకు ప్రయాణం సౌకర్యవంతంగా జరిగేలా పరిస్థితులు ఉండాలన్నారు. ఆర్టీసీ బస్సు సర్వీసులు బావున్నా, బస్ స్టేషన్‌లో సౌకర్యాలు, ఔట్ సోర్సింగ్ సర్వీసులు మెరుగ్గా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పుంగనూరు, వెంకటగిరి, పెనుకొండ, ప్రొద్దుటూరు, ఎమ్మిగనూరు, శ్రీకాళహస్తి బస్ స్టేషన్‌లో తాగునీరు, టాయిలెట్స్, ఫ్యాన్స్, సీటింగ్ ఏరియాపై ప్రయాణికుల నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దీపం పథకం కింద ఇస్తున్న గ్యాస్ సిలిండర్ల డెలివరీకి డబ్బులు వసూలు చేయకుండా కఠినంగా వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు.

పెన్షన్ల పంపిణీలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అట్టడుగు స్థానంలో ఉన్న స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం దగ్గరున్న సమాచారం కాకుండా, అదనపు సమాచారం కోసం మాత్రమే ఇకపై సర్వేలు జరపాలి తప్ప, పదేపదే ఒకేరకమైన సమాచారం కోసం ప్రజలను, ప్రభుత్వ సిబ్బందిని ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.

రాష్ట్రంలో వాట్సప్ మనమిత్ర సేవలను మరింత విస్తృతం చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వాట్సప్ సేవల సంఖ్యను 953కి పెంచినట్టు తెలిపారు. వీటన్నింటినీ సులభంగా వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బుకింగ్, డిజిటల్ సేవలు, సిబ్బంది ప్రవర్తనపై సంతృప్తి వ్యక్తమైందని అధికారులు సీఎంకి వివరించారు. అవినీతికి తావులేకుండా రాష్ట్రంలోని మొత్తం 295 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిజాయితీ కలిగిన అధికారులకే అవకాశం ఇవ్వాలని చెప్పారు. వాట్సప్ మనమిత్ర సేవలు వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని నూటికి నూరు శాతం వాట్సప్ సేవల వినియోగం జరగాలని తేల్చిచెప్పారు.

వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట - రాయలసీమలో రూ.లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్: సీఎం చంద్రబాబు

వైద్యారోగ్యానికి అధిక ప్రాధాన్యం - క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలతో కలిసి మాట్లాడాలి : సీఎం చంద్రబాబు

Last Updated : March 2, 2026 at 6:36 PM IST