ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం - నిర్లక్ష్యం వహించొద్దు: సీఎం చంద్రబాబు
శ్రీకాకుళం డయేరియా, రాజమహేంద్రవరం పాల ఘటనలపై సీఎం సమీక్ష - బాధితుల ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఆరా - ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్లక్ష్యం వహించొద్దని ఆదేశం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 25, 2026 at 10:57 AM IST
CM Chandrababu Review on Rajamahendravaram and Srikakulam Incidents: ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం డయేరియా, రాజమహేంద్రవరం పాల ఘటనలపై సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల అధికారులతో మాట్లాడారు. శ్రీకాకుళం, రాజమహేంద్రవరం ఘటనల్లో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. శ్రీకాకుళం జెమ్స్ ఆస్పత్రిలో సీరియస్ కండిషన్లో ఉండి చికిత్స పొందుతున్న ఇద్దరి బాధితుల ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఒకరు వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారని, మరొకరికి డయాలసిస్ అందిస్తున్నామని అధికారులు చెప్పారు. వీరిద్దరి వైద్య చికిత్సపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
క్షేత్ర స్థాయిలో ఇంకా ఏమైనా కేసులు నమోదవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం ఘటనలో ప్రస్తుతానికి 76 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు సీఎంకు వివరించారు. ఇద్దరు మినహా అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. పైప్ లైన్ ద్వారా నీటి సరఫరాను ఆపేశామని, ప్రత్యామ్నాయాల ద్వారా సురక్షితమైన తాగు నీటిని సరఫరా చేస్తున్నామని వెల్లడించారు.
రాజమహేంద్రవరం పాల ఘటనలో బాధితులు నిరంతర వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని అధికారులు తెలిపారు. పాల శాంపిళ్లను ఇప్పటికే ల్యాబ్‌కు పంపామన్నారు. శాఖపరంగా దీనిపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని అధికారులు వెల్లడించారు. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్లక్ష్యం వహించొద్దని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా వివిధ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఇదిలావుంటే రాజమహేంద్రవరం ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారు. ఇప్పటికే ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ ఘటనలో పాలు సరఫరా చేసిన గణేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు విచారణాధికారి, కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు.
శ్రీకాకుళంలో మూడు రోజుల్లో 76 అతిసారం కేసులు నమోదయ్యాయి. అతిసారం ప్రబలటంపై సీఎం చంద్రబాబు మంగళవారం కూడా రెండుసార్లు జిల్లా అధికారులతో సమీక్షించారు. వ్యాది ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు నగరంలోని ప్రభుత్వ, ప్వైవేటు ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు. చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే గొండు శంకర్ పరామర్శించారు. డయేరియాతో మృతి చెందిన సురేష్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం తరుఫున 10 లక్షల ఆర్థిక సహాయాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. అతిసారం ప్రబలడానికి తాగునీరు, కలుషితం కావడమే కారణమని అధికారులు అవమానిస్తున్నారు. ఇటీవల నగరంలోని కొన్ని వీధుల్లో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. పైపులైన్లు పగటటంతో వాటిలోకి మురుగు నీరు చేరిందని భావిస్తున్నారు.
ట్యాంకర్ల ద్వారా నీరు: శ్రీకాకుళంలో డయేరియా పరిస్థితిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు మంత్రి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదనపు సిబ్బందితో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని మంత్రి నారాయణ ఆదేశించారు.
బాధితులు త్వరగా కోలుకునేందుకు ముంబై, చెన్నై నుంచి ప్రత్యేక మెడిసిన్: వీరపాండియన్
రాజమహేంద్రవరం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు సాయం - అసెంబ్లీలో ప్రకటించిన సీఎం చంద్రబాబు

