ETV Bharat / state

'మీ భూమి-మీ హక్కు' - రైతులకు ప్రభుత్వం కల్పించే భరోసా: సీఎం చంద్రబాబు

ట్యాంపరింగ్‌కు తావులేకుండా రికార్డులు సురక్షితం కావాలన్న సీఎం - గ్రామసభల్లో నిర్థారించుకున్నాకే పాసు పుస్తకాల ముద్రణ చేయాలని దిశానిర్దేశం - భూ రికార్డుల్లో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దాలని ఆదేశం

CM Chandrababu Review On Land Records
CM Chandrababu Review On Land Records (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 7, 2026 at 7:19 PM IST

3 Min Read
Choose ETV Bharat

CM Chandrababu Review On Land Records : రైతుల్లో నమ్మకం, భరోసా కల్గించేలా కొత్త పాసు పుస్తకాలను అందచేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తప్పులు లేకుండా రెవెన్యూ రికార్డులను సరిచేసి కొత్త పాస్ పుస్తకాల పంపిణీ జరగాలని ఆదేశించారు. ట్యాంపరింగ్‌కు తావులేకుండా రికార్డులు సురక్షితం కావాలన్న సీఎం గ్రామసభల్లో నిర్థారించుకున్న తర్వాతే పాసు పుస్తకాల ముద్రణ చేయాలని దిశానిర్దేశం చేశారు.

గతంలో జరిగిన తప్పులను సరిదిద్దాలి : ఈ నెల 2వ తేదీ నుంచి మొదలైన కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్షించారు. భూ రికార్డుల్లో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దాలని ఆదేశించారు. పాసు పుస్తకాల ముద్రణలో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలను రైతులకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. మీ భూమి-మీ హక్కు అనేది రైతులకు ప్రభుత్వం కల్పించే భరోసా అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇస్తున్న కొత్త పట్టాదారు పాసు పుస్తకాల ద్వారా భూమి భద్రంగా ఉందా లేదా అనే విషయాన్ని రైతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునని తెలిపారు.

భూ రికార్డులపై సీఎం చంద్రబాబు సమీక్ష (ETV Bharat)

రికార్డుల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే కచ్చితంగా భూ యజమాని అనుమతితోనే జరగాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను రైతులకు వివరించాలని సీఎం సూచించారు. భవిష్యత్తులో రెవెన్యూ శాఖ ప్రమేయం లేకుండానే రైతులు వారికి అవసరమైన పాసు పుస్తకాలను ఆన్​లైన్​లోనే పొందే విధానాన్ని అమలు చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై సమీక్ష సందర్భంగా క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పంపిణీ విధానాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నెల 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు 6.07 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశామని సీఎంకు తెలిపారు.

భూహక్కుపత్రాల్లో తప్పులు : పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులుంటే సరిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన రీసర్వేలో తప్పులు దొర్లాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని సరిదిద్ది పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తోందన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు ముద్రించాక కొందరు పట్టాదారులు చనిపోయారని. వారి స్థానంలో కొత్తగా వచ్చిన హక్కుదారుల పేర్లు చేర్చి పుస్తకాలు ఇవ్వాల్సి ఉందని వివరించారు. గత ప్రభుత్వంలో 6 వేల 688 గ్రామాల్లో తప్పుల తడకగా రీసర్వే చేశారని, 4 వేల 783 గ్రామాల్లో పంపిణీ చేసిన భూహక్కుపత్రాల్లో తప్పులు దొర్లాయని మండిపడ్డారు.

విస్తీర్ణం, జాయింట్‌ ఎల్‌పీఎం, పేర్లు, సర్వేనంబర్లు, ఆధార్‌లో తప్పులన్నాయని వెల్లడించారు. భూహక్కు పత్రాలపై జగన్‌ బొమ్మ వేయడం రైతుల్లో ఆందోళనకు కారణమైందని మంత్రి తెలిపారు. ప్రజల ఆస్తులు హరించేందుకు ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ తెచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామసభల్లో 7.50 లక్షల ఫిర్యాదులు వచ్చాయని వాటిని కూటమి ప్రభుత్వం పరిష్కరించిందని స్పష్టంచేశారు. పాత దస్తావేజుల్లో ఉన్న విస్తీర్ణం కంటే తగ్గిందని ఫిర్యాదులు వస్తున్నాయన్న మంత్రి అనగాని నిబంధనల ప్రకారం 5 శాతం ఎక్కువ, తక్కువ ఉండొచ్చునని తెలిపారు. తేడాలుంటే తిరిగి కొలిపించుకోవచ్చునని సూచించారు.

"భూ రికార్డుల్లో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దాలి. పాసు పుస్తకాల ముద్రణలో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలను రైతులకు అర్థమయ్యేలా చెప్పాలి. రికార్డుల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే కచ్చితంగా భూ యజమాని అనుమతితోనే జరగాల్సి ఉంటుంది. భవిష్యత్తులో రెవెన్యూ శాఖ ప్రమేయం లేకుండానే రైతులు వారికి అవసరమైన పాసు పుస్తకాలను ఆన్​లైన్​లోనే పొందే విధానాన్ని అమలు చేయాలి." - సీఎం చంద్రబాబు

అమరావతిలో రెండో దశ భూసమీకరణ - రేపు నోటిఫికేషన్

భూరికార్డుల్లో తప్పులకు జగన్​ పాలనే కారణం: మంత్రి అనగాని సత్యప్రసాద్