ETV Bharat / state

ప్రభుత్వ సేవలు ప్రజలకు అత్యంత సులభంగా చేరువ కావడమే నా లక్ష్యం: సీఎం చంద్రబాబు

రియల్ టైమ్ గవర్నెన్స్‌పై చంద్రబాబు సమీక్ష - పాలనలో నిబంధనలను సరళీకరించేలా కార్యాచరణ చేపట్టాలన్న సీఎం, టెక్నాలజీ అనుసంధానంతోనే సుపరిపాలన సాధ్యమని వెల్లడి

CM Chandrababu Review on RTGS
CM Chandrababu Review on RTGS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 17, 2026 at 9:02 AM IST

3 Min Read
Choose ETV Bharat

CM Chandrababu Review Meet on RTGS: రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు అధునాతన సాంకేతికతతో నూతన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వ పాలనలో ఉన్న వివిధ రకాల ప్రక్రియలను, నిబంధనలను మరింత సరళీకరించే విధంగా కార్యాచరణను చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా కొన్ని చట్టాలను కూడా సరళతరం చేసేలా నిర్ణయం తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా ప్రజలకు చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు.

ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు సమీక్షించారు. టెక్నాలజీ అనుసంధానంతోనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని సీఎం తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రతీ ప్రభుత్వ శాఖ సన్నద్ధం కావాలని, సులభతరమైన పౌర సేవల్ని అందించాలని సూచించారు. టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా చెల్లింపులు ఇతర ప్రభుత్వ సేవల కోసం ఇబ్బందులు ఎదుర్కోకూడదని, ఆటోమేషన్ దిశగా అడుగులు వేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రభుత్వ సేవలు ప్రజలకు అత్యంత సులభంగా చేరువ కావడమే నా లక్ష్యం: సీఎం చంద్రబాబు (ETV Bharat)

ప్రజల్లో డిజిటల్ లిటరసీ పెంచేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వంలోని 8.20 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు తమ విధి నిర్వహణా సామర్ధ్యాలను మరింత మెరుగు పరుచుకునేలా వివిధ కోర్సుల్లో శిక్షణ తీసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ కోర్సులను అందించాలని సీఎం ఆదేశించారు. వార్షిక నివేదికల్లోనూ సామర్ధ్యాన్ని ప్రతిఫలించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం: బిల్ గేట్స్ పర్యటన సందర్భంగా ఆర్టీజీఎస్ కేంద్రంలో ఇచ్చిన ప్రజెంటేషన్లు అద్భుతంగా ఉన్నాయని చంద్రబాబు అధికారులను అభినందించారు. డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, పీపుల్స్ పర్సెప్షన్, ఏజెంట్ స్పేస్ ఏపీఏఐ సెర్చ్ బార్, సంజీవని, అమరావతి ప్రాజెక్టులపై చూపిన ప్రజెంటేషన్లు బిల్ గేట్స్‌ను కూడా ఆకట్టుకున్నాయని వెల్లడించారు. రాబోయే రోజుల్లో గేట్స్ ఫౌండేషన్ సాయంతో చేపట్టబోయే ప్రాజెక్టులను రాష్ట్రం అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో అమలవుతున్న అత్యుత్తమ ప్రమాణాల్ని అన్నింటా అనుసరించేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తద్వారా ప్రజల నుంచి మంచి అభిప్రాయం వ్యక్తం అవుతుందని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్నా క్యాంటీన్లలో వడ్డించే ఆహారాన్ని మరింత రుచికరంగా ఉండేలా చూడాలని సూచనలు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లలో పరిస్థితులు మెరుగుపడాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఒక బెస్ట్ హాస్టల్‌ను మోడల్‌గా తీసుకుని మిగిలిన వాటిలోనూ అవే ప్రమాణాలను పాటించేలా చూడాలని సీఎం చంద్రబాబు తెలియజేశారు.

విజిబుల్ పోలీసింగ్ అత్యంత కీలకం: మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో విజిబుల్ పోలీసింగ్ అత్యంత కీలకమని చంద్రబాబు తేల్చి చెప్పారు. నేరాల శాతాన్ని తగ్గించే ప్రక్రియలో పోలీసు విభాగం తమ పూర్తి సామర్ధ్యాన్ని ప్రదర్శించాలని సీఎం వివరించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం చేపడుతున్న చర్యల్ని ఎప్పటికప్పుడు మీడియా సమావేశాల ద్వారా ప్రజలకు వివరించాలని హోంశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎప్పటికప్పుడు చెత్తను క్లియర్ చేయటంతో పాటు కలుషిత నీటి సరఫరా కాకుండా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
వచ్చే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇప్పటి నుంచే ముందస్తు కార్యాచరణ చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖలు డ్రోన్ వినియోగాన్ని పెంచి పౌరసేవలను మరింత సరళతరం చేయాలని సీఎం తెలిపారు. ఈ సమీక్షకు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, సీఎస్ కె.విజయానంద్ పురపాలక, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ప్రణాళిక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ముగిసిన బిల్​ గేట్స్​ రాష్ట్ర పర్యటన - అయిదున్నర గంటలపాటు వివిధ కార్యక్రమాలు

సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్​లైన్​లోనే​ - చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం