ETV Bharat / state

గలగలా గోదావరి - బిరబిరా కృష్ణమ్మ పరుగులతో రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తాం: సీఎం చంద్రబాబు

అందరూ అసూయపడేలా అనకాపల్లి అభివృద్ధి చెంది మరో రంగారెడ్డి అవుతుందన్న చంద్రబాబు రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రకే వలస వచ్చే విధంగా మారుతుందని వ్యాఖ్య - గొడ్డలి పార్టీ విపక్షంలోనూ విషం కక్కుతోందని మండిపాటు

Chandrababu on Irrigation Projects
ఉత్తరాంధ్ర ఉత్తమాంధ్ర కావడం ఖాయం (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 2, 2026 at 7:17 PM IST

3 Min Read
Choose ETV Bharat

Chandrababu on Irrigation Projects : సాగునీటి ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా నమ్ముతానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. జలం ఉంటేనే జీవం, జీవితం - నీరు ఉంటేనే సాగు బాగు అని అన్నారు. గంగమ్మ ఉంటేనే పరిశ్రమలు, ఉపాధి- నీరుంటేనే భద్రత, భవిష్యత్ అని చెప్పారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీఎల్‌ పురం వద్ద చంద్రబాబు రెగ్యులేటర్‌ ఆన్‌ చేసి పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

'2019లో గొడ్డలి పార్టీ రావడం పోలవరానికి శాపమైంది. 2024లో కూటమిని గెలిపించి పోలవరానికి శాపవిముక్తి చేశారు. కాంట్రాక్టర్లు సరిగా పని చేయకపోతే జైలులో పెడతానని గట్టిగా చెప్పా. రెండు జీవనదులతో ప్రజలకు మంచి జరగాలనేది నా జీవిత ఆశయం. కాలువలో ప్రవహిస్తున్న ప్రతి నీటి చుక్క వెనుక ఇంజినీర్ల ప్రతిభ ఉంది. ప్రతి నీటి చుక్క వెనుక రైతుల నిరీక్షణ, నిర్వాసితుల త్యాగం, ప్రభుత్వ సమర్థత ఉంది. ఎడమ కాలువ విస్తరించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానిస్తాం. 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని' చంద్రబాబు స్పష్టం చేసారు.

రాష్ట్రాభివృద్ధి వైకుంఠపాళి కాకూడదు : సీఎం చంద్రబాబు (ETV Bharat)

"అనకాపల్లి బెల్లమంత తియ్యగా ఎప్పటికీ ఈరోజు గుర్తుంటుంది. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. నిండు మనసుతో దీవెన ఫలితంగానే అనకాపల్లికి గోదారమ్మ వచ్చింది. వెలిగొండతో కృష్ణమ్మను తరలించి మార్కాపురం జిల్లాకు నీళ్లు ఇచ్చాం. తూర్పు కనుమలు, అడవులు, నదులు, హైవేలను దాటుకుని గోదావరి వచ్చింది. వచ్చే ఏడాది నాటికి సింహాద్రి అప్పన్న చెంతకు గోదావరి జలాలు తీసుకెళ్తాం. అరసవెల్లి సూర్యనారాయణ చెంతకు కూడా గోదావరి జలాలు తీసుకెళ్తాం." - చంద్రబాబు, ముఖ్యమంత్రి

Godavari Water Reach Uttarandhra : గోదావరి జలాలను వంశధారతో అనుసంధానం చేస్తామని చంద్రబాబు వివరించారు. గోదావరి, కృష్ణా సహా రాష్ట్రంలోని అన్ని నదులను అనుసంధానం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నదులను అనుసంధానించి తెలుగు తల్లికి జలహారతి ఇస్తామన్నారు. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి జలహారతితో తెలుగుతల్లి రుణం తీర్చుకుంటామని చెప్పారు. గలగలా గోదావరి, బిరబిరా కృష్ణమ్మ పరుగులతో ఏపీని సుభిక్షం చేస్తామని తెలిపారు. శంకరంబాడి గీతాన్ని నిజం చేసి జయప్రదం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని పేర్కొన్నారు. ఈ జల విజయం ప్రజల విజయం అవుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

"అందరూ అసూయపడేలా అనకాపల్లి అభివృద్ధి చెంది మరో రంగారెడ్డి అవుతుంది. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రకే వలస వచ్చే విధంగా మారుతుంది. ఉత్తరాంధ్ర ఉత్తమాంధ్ర, ఉన్నతాంధ్ర కావడం ఖాయం రాసి పెట్టుకోవాలి. గొడ్డలి పార్టీ విపక్షంలోనూ విషం కక్కుతోంది. విశాఖ రాజధాని అని మాయమాటలు చెప్పారు. ఇప్పుడు మావిగన్‌ అని మాట మార్చారు. వైజాగ్​కు డేటా సెంటర్‌ వస్తే నీరు, విద్యుత్‌ కొరత వస్తుందని పేటీఎం బ్యాచ్‌తో దుష్ప్రచారం. విశాఖకు ఐదు డేటా సెంటర్లు వస్తే ఐదు టీఎంసీలు కావాలి. ఐదు టీఎంసీలే కాకుండా 500 టీఎంసీల నీళ్లు తీసుకువచ్చే శక్తి ఉంది. పోలవరం కాలువలో రోజుకు 2 టీఎంసీలు తీసుకువచ్చే సామర్థ్యం ఉంది. పోలవరం పూర్తయి గ్రావిటీతో నీళ్లు వస్తే విశాఖకు నీటి ఎద్దడి ఉండదు." - చంద్రబాబు, ముఖ్యమంత్రి

భోగాపురం, వెలిగొండ విషయంలో గొడ్డలి పార్టీ క్రెడిట్‌ చోరీ చేస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరాన్ని నాశనం చేసిన వ్యక్తులు తామే కట్టామని చెబుతారని ఆక్షేపించారు. విధ్వంసం చేసిన అమరావతి పూర్తయితే అదీ తమ గొప్పే అంటారని వ్యంగాస్త్రాలు సంధించారు. గొడ్డలి పార్టీది ఫేక్‌ రాజకీయం, నేర చరిత్ర, విధ్వంసమే పార్టీ విధానమని చంద్రబాబు దుయ్యబట్టారు.

సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో అడుగులు ముందుకు వేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. మోదీ సహకారంతో పోలవరం, అమరావతి, స్టీల్‌ ప్లాంట్, రైల్వే జోన్‌ సాధించామని గుర్తు చేశారు. దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖ అని తెలిపారు. హైవేలు, 4 వరుసల రైల్వే లైన్లు, మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తాయన్నారు. మౌలిక వసతులతో తూర్పు తీరాన్ని మధ్య భారత్‌తో అనుసంధానిస్తామని చెప్పారు. అభివృద్ధి శాశ్వతం కావాలని, ప్రభుత్వాలు స్థిరంగా ఉండాలని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి వైకుంఠపాళి కాకూడదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

మాట ఇచ్చి నిలబెట్టుకున్నా - వెలిగొండ బంగారు కొండ అవుతుంది: సీఎం చంద్రబాబు

ఉత్తరాంధ్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం - అనకాపల్లి గడ్డను ముద్దాడిన గోదావరి జలాలు