ETV Bharat / state

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ - వివిధ సంస్థలతో ఏపీ 7 ఒప్పందాలు

కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అంశంపై సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు - కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అంశంపై డబ్ల్యూఈఎఫ్‌ సమావేశం - హాజరైన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, డబ్ల్యూఈఎఫ్‌ సీఈవో బోర్గే బ్రెండే

CM Chandrababu participates in India AI Impact Summit 2026
CM Chandrababu participates in India AI Impact Summit 2026 (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 20, 2026 at 5:01 PM IST

|

Updated : February 20, 2026 at 6:10 PM IST

5 Min Read
Choose ETV Bharat

CM Chandrababu participates in India AI Impact Summit 2026 : అమరావతి క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచం అంతా మాట్లాడే రోజు సమీప భవిష్యత్‌లో వస్తుందని AI ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే ప్రపంచానికి క్వాంటం కంప్యూటింగ్‌కు సంబంధించిన పరికరాలనూ తయారు చేసేలా క్వాంటం ఎకో సిస్టానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీలో క్వాంటం-ఏఐ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధి కల్పించే దిశగా వివిధ సంస్థలతో ఏడు ఒప్పందాలు చేసుకున్నారు. ఏపీని క్వాంటం-ఏఐ హబ్‌గా తీర్చిదిద్దడం, అమరావతిలోని క్వాంటం వ్యాలీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేలా MOUలు చేసుకున్నారు.

దిల్లీలోని భారత్‌ మండపం వేదికగా జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించిన కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం సీఈఓ బోర్కే బ్రెండేతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సమీప భవిష్యత్‌లో అమరావతి క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచం అంతా మాట్లాడే రోజు వస్తుందన్న చంద్రబాబు గూగుల్ లాంటి సంస్థల రాకతో విశాఖ ఏఐ డేటా హబ్‌గా మారుతుందన్నారు.

డీప్ టెక్నాలజీ రంగంపై ఏపీ దృష్టి : ప్రపంచానికి క్వాంటం కంప్యూటింగ్‌కు సంబంధించిన పరికరాలను కూడా తయారుచేసేలా క్వాంటం ఎకో సిస్టం రూపకల్పన చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలన్న ఆకాంక్షతో ప్రధాని మోదీ పనిచేస్తున్నారన్న ముఖ్యమంత్రి దేశం దానిని సాధించి తీరుతుందన్నారు. ఏఐ అద్భుతాలు సాధిస్తుందన్న విశ్వాసం ఉందన్న సీఎం పౌరులందరికీ ప్రయోజనం కలిగేలా సావరిన్ ఏఐని వినియోగించేందుకు ప్రభుత్వంగా తాము ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. డీప్ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకు వెళ్లేలా ఏపీ దృష్టి సారిస్తోందన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్‌టెక్ పార్క్ లాంటి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఉన్నాయన్నారు. ఈ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించటంతో పాటు క్వాంటం ఎకో సిస్టంను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.

"సమీప భవిష్యత్‌లో అమరావతి క్వాంటం వ్యాలీపై ప్రపంచమంతా మాట్లాడే రోజు వస్తుంది. గూగుల్ లాంటి సంస్థల రాకతో ఏపీలోని విశాఖ, ఏఐ డేటా హబ్‌గా మారుతుంది. ప్రపంచానికి క్వాంటం కంప్యూటింగ్‌ పరికరాల తయారీకి క్వాంటం ఎకో సిస్టం రూపకల్పన అయ్యింది. దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలన్న ఆకాంక్షతో ప్రధాని మోదీ పని చేస్తున్నారు. ప్రధాని మోదీ ఆకాంక్షను దేశం సాధించి తీరుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలను సాధిస్తుందన్న విశ్వాసం ఉంది. పౌరులందరికీ ప్రయోజనం కలిగేలా సావరిన్ ఏఐ వినియోగానికి ప్రయత్నిస్తున్నాం. డీప్‌ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకెళ్లేలా ఏపీ దృష్టి సారిస్తోంది. ఏపీలో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్‌టెక్ పార్క్ లాంటి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఉన్నాయి. పెద్దఎత్తున పెట్టుబడుల ఆకర్షణతో పాటు క్వాంటం ఎకోసిస్టం తీర్చిదిద్దుతున్నాం." - సీఎం చంద్రబాబు

వివిధ సంస్థలతో ఒప్పందాలు : అంతకుముందు సమ్మిట్‌లో ప్రపంచ క్వాంటం, ఏఐ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థల ప్రతినిధులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. IBM సహా వివిధ ప్రముఖ సంస్థలతో సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం MOUలు కుదుర్చుకుంది. క్వాంటం, ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు యూనైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో ఏడాది చివరి నాటికి ఏఐ క్వాంటం ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటు చేసేలా కార్యాచరణ చేపట్టడం ఏఐ-క్వాంటం డిజిటిల్ ఎంబసీగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించనున్నారు.

అలాగే క్వాంటం, ఏఐ, సైబర్ సెక్యూరిటీలో రాష్ట్రంలోని లక్ష మంది యువతకు శిక్షణ ఇచ్చేలా IBMతో ఎంఓయూ చేసుకుంది. IBM గ్లోబల్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ ఫాం ద్వారా ఐటీ పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం భారత్‌లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్‌ వర్క్‌ఫోర్సును సిద్ధం చేసుకునే లక్ష్యాల్లో భాగంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఏపీలో క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుపై NIELITతో మరో ఒప్పందం చేసుకున్నారు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఏఐ, క్వాంటం డీమ్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించనున్నారు. మౌలిక సదుపాయాలకు కేంద్రం నుంచి నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూమి, క్వాంటం హార్డ్‌వేర్ సమకూర్చేలా ఒప్పందం చేసుకున్నారు.

విద్యా సంస్థల్లో ఏఐ, క్వాంటం టెక్నాలజీ : అమరావతిని క్వాంటం కంప్యూటింగ్‌లో నేషనల్ హబ్‌గా తీర్చిదిద్దేలా కార్యాచరణ చేపట్టడం దీని ఉద్దేశం. అలాగే రాష్ట్రస్థాయి ఏఐ టెక్ హబ్-5 లేయర్డ్ స్వదేశీ ఏఐ స్టాక్ నిర్మించేలా భారత్ జెన్-నెక్స్ జెన్-IBMతో రాష్ట్ర ప్రభుత్వం మరో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ప్రభుత్వంలోని వివిధ సంస్థలకు సేవలందించడంతోపాటు 22 భారతీయ భాషలను అనుసంధానించేలా ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేయనున్నారు. ఏపీలోని 50 ఉన్నత విద్యా సంస్థల్లో ఏఐ, క్వాంటం టెక్నాలజీని బలోపేతం చేసేలా ఏఐ అకాడెమీ, ఏఐ శాండ్ బాక్స్ ఏర్పాటు చేసేందుకు కాలిబో ఏఐ సంస్థ ఏపీతో ఒప్పందం చేసుకుంది. గ్రాడ్యుయేట్లు, పీజీ విద్యార్థులకు అవగాహన, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కోసం ఏఐ శాండ్ బాక్స్-ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నారు.

2027 నాటికి 6 లక్షల మంది సిద్ధం : అలాగే ఏఐ ఇంటిగ్రేటెడ్ కరిక్యులమ్, నైపుణ్య శిక్షణ వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. అమరావతి క్వాంటం వ్యాలీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో వైజర్ సంస్థ ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ఈ ఏడాది చివరికి 3.5 లక్షల మంది ఏఐ-క్వాంటం లెర్నర్లు, 2027 నాటికి 6 లక్షల మందిని సిద్ధం చేస్తారు. ఏపీలో ఏఐ ట్యూటర్ ఏర్పాటు అంశంపై ఐఐటీ మద్రాస్‌తో రాష్ట్ర ప్రభుత్వం మరో ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏపీలో ఏఐ-క్వాంటం ఎకో సిస్టం పెంపొందించడానికి ఏడు ఎంఓయూలు బాటలు వేయనున్నాయని ప్రభుత్వం తెలిపింది.

అనంతరం టెక్ కంపెనీల సీఈఓలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్, ఆటోడెస్క్ ఏఐ హెడ్ మైక్ హాలే, ఆరామ్కో ఇండియా డైరెక్టర్ అబ్దుల్ రెహ్మాన్ ఐతుకైర్‌తో సీఎం సమావేశం అయ్యారు. అలాగే లెగో ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ టామ్ హాల్, ఆధార్ ఫౌండర్ సీటీఓ శ్రీకాంత్ నాదముని, కాలిఫోర్నియాకు చెందిన ఖోస్లా వెంచర్స్ ఎండీ వినోద్ ఖోస్లాతో ముఖ్యమంత్రి వరుస భేటీలు నిర్వహించారు.

ప్రతి ఒక్కరికీ ఏఐ డాక్టర్‌ - ఏం తినాలి, ఏం చేయాలో చెబుతుంది: సీఎం చంద్రబాబు

పార్లమెంటులో ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధతపై బిల్లు పెట్టాలి: సీఎం చంద్రబాబు

Last Updated : February 20, 2026 at 6:10 PM IST