జాతీయ రహదారి నిర్మాణంలో ఏపీ చరిత్ర సృష్టించింది: సీఎం చంద్రబాబు
ఏపీలో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు దేశానికి గర్వకారణమని ప్రశంసించిన సీఎం చంద్రబాబు - బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌పై ఈ ఘనత సాధించాంమని వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 7, 2026 at 8:15 PM IST
CM on 2 Guinness World Records for Highway Construction: రాష్ట్రంలో జాతీయ రహదారి నిర్మాణంలో గిన్నిస్ వరల్డ్ రికార్డులు సృష్టించడం దేశానికి గర్వకారణమని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌పై ఎన్హెచ్ఏఐ (NHAI), రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 24 గంటల్లోనే 28.95 లైన్ కిలోమీటర్లు, 10,675 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్ నిరంతరంగా వేసి 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించారని ప్రశంసించారు. ఈ ఘనత దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై భారత ప్రభుత్వ దృక్పథానికి నిదర్శనమని సీఎం అన్నారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి నాయకత్వంలో జాతీయ రహదారుల అభివృద్ధికి లభిస్తున్న ప్రాధాన్యత, ఇంజినీర్లు, కార్మికులు, ఫీల్డ్ టీమ్స్ అంకితభావానికి ఇది స్పష్టమైన ఉదాహరణ అని చెప్పారు. అత్యున్నత ఎన్హెచ్ఏఐ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఈ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. జనవరి 11, 2026 నాటికి ఈ కారిడార్‌లోని ప్యాకేజీలు 2&3పై మరిన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. “ఇండియా నిర్మిస్తోంది ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తోంది” అని సీఎం చంద్రబాబు చెప్పారు.
Proud moment for India 🇮🇳 | Andhra Pradesh
— N Chandrababu Naidu (@ncbn) January 7, 2026
Today, NHAI, through M/s Rajpath Infracon Pvt. Ltd., achieved two Guinness World Records in Andhra Pradesh on the Bengaluru–Kadapa–Vijayawada Economic Corridor (NH-544G) by laying 28.95 lane-kilometres and 10,675 MT of Bituminous… pic.twitter.com/d7oyJnkfPH
రాత్రి, పగలు తేడా లేకుండా పని: కాగా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేలో 7 రోజుల పాటు నిర్విరామంగా రాత్రి, పగలు తేడా లేకుండా పని చేశారు. ఏకంగా 26 కిలోమీటర్ల మేర 6 వరుసలలో తారురోడ్డు పూర్తి చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలోని కోడూరు క్రాస్ నుంచి బాపట్ల జిల్లా ముప్పవరం వరకు హైవే నిర్మాణం చేపడుతున్నారు. బెంగళూరు, కడప, విజయవాడ మీదుగా 6 వరుసలతో యాకెస్స్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం జరిగింది. హైవేకు రికార్డు స్థాయిలో తారు రోడ్డు పనులు చేసేందుకు రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ అనే కాంట్రాక్టర్ సంస్థ సన్నద్ధమైంది.
శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో ఓబుళదేవర చెరువు మండలంలోని సాతర్లపల్లి సమీపం నుంచి ములకవేముల క్రాస్ సమీపం వరకు 26 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణాన్ని ఈనెల 5న ఉదయం ప్రారంభించారు. దీన్ని 11వ తేదీ నాటికి పూర్తి చేసి రికార్డు సృష్టించాలని కాంట్రాక్టర్ సంస్థ లక్ష్యం పెట్టుకుంది.
ముందస్తు ఏర్పాట్లతో సన్నద్ధం: ఇరువైపులా మూడేసి వరుసల చొప్పున మొత్తం 6 వరుసలతో ఈ హైవేని నిర్మించారు. 29.5వ కి.మీ. నుంచి 55.5వ కి.మీ. వరకు (26కి.మీ.) ఒకవైపు 3 వరుసలతో తారు రోడ్డు వేస్తారు. మళ్లీ రెండోవైపు కూడా అంతే దూరం 3 వరుసలతో నిర్మిస్తారు. మొత్తంగా మూడేసి వరుసలతో ఇరువైపులా కలిపి 52 కి.మీ. మేర రోడ్డు నిర్మిస్తారు. సెన్సర్ పేవర్ రోడ్డు వేస్తుంటే వెనుక రోలింగ్ చేసేందుకు 4 రోలర్లు సిద్ధం చేశారు. అవసరమైన బిటమిన్ సరఫరా కోసం 5 హాట్‌మిక్స్ ప్లాంట్లను అందుబాటులో ఉంచారు. ఈ ప్లాంట్ల నుంచి నిరంతరం బిటుమినస్‌ను తరలించేందుకు 100 టిప్పర్లను కూడా రెడీ చేశారు.
వారి సమక్షంలో పనులు మొదలు: కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధులు, నేషనల్ హైవే అధికారులు, గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల సమక్షంలో ఈ పనులు ఆరంభించారు. ఈ నెల 11వ తేదీ నాటికి నిర్మాణం పూర్తి అయ్యాక 12న హైవే వద్ద జరిగే కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పాల్గొంననున్నారు. ఆయన చేతుల మీదగా గిన్నిస్ రికార్డు అందుకోనున్నట్లు రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ప్రతినిధులు తెలిపారు.
పాక్షికంగా అందుబాటులోకి ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే - అధికారుల ఏర్పాట్లు
అనంతపురం-గుంటూరు NH 544-D విస్తరణకు మరో ముందడుగు - భూసేకరణకు నోటిఫికేషన్

