ETV Bharat / state

2025లో సూపర్‌ సిక్స్‌ పథకాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి: సీఎం చంద్రబాబు

స్త్రీశక్తి పథకం ద్వారా 3.25 కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం - 2025 సంవత్సరంలో అమలు చేసిన సూపర్‌ సిక్స్‌ పథకాలు సూపర్‌హిట్‌గా నిలిచాయన్న సీఎం చంద్రబాబు

CBN on Super Six Welfare Schemes
CBN on Super Six Welfare Schemes (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 30, 2025 at 12:15 PM IST

3 Min Read
Choose ETV Bharat

CM Chandrababu on Super Six Welfare Schemes: ఏపీలో ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభమైన స్త్రీశక్తి పథకం ద్వారా 3.25 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణించారని సీఎం చంద్రబాబు వెల్లడించారు. దీనికి గాను 1,144 కోట్లు ఖర్చయింది. దాదాపు 204 అన్న క్యాంటీన్ల ద్వారా 4 కోట్ల భోజనాలు అందాయని తెలిపారు. కూటమి సర్కారు 2025 సంవత్సరంలో అమలు చేసిన సూపర్‌ సిక్స్‌ పథకాలు సూపర్‌హిట్‌గా నిలిచాయనీ, ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల ద్వారా ఇప్పటికే 50,000 కోట్లకు పైగా ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు మంత్రివర్గంలో 2025 పాలనలో ముఖ్యాంశాలను స్వయంగా తెలియజేశారు.

కూటమి సాధించిన విజయాలే: 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వ విజయాలను అమరావతి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిశాక సహచర మంత్రులతో పంచుకున్నారు. విశాఖలో ఐటీ హబ్, గూగుల్, రిలయన్స్‌ డేటా సెంటర్లు టీసీఎస్‌ ప్రారంభం, కాగ్నిజెంట్‌కు శంకుస్థాపన, క్వాంటం వ్యాలీకి తొలిఅడుగు, అమరావతి పనులు వేగవంతం తదితరాలన్నీ కూటమి విజయాలే అని తెలిపారు. తల్లికి వందనం పథకం కింద 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ.10,090 కోట్లు చెల్లించామని సీఎం వివరించారు.

పెనుమార్పులకు నాంది పలికాం: మెగా డీఎస్సీ ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామన్నారు. 5,757 కానిస్టేబుళ్ల నియామకం పూర్తి చేశామని చెప్పారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు 75 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసినట్లు వెల్లడించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామని సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్‌ అందించామన్నారు. పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించడం సహా విద్యావ్యవస్థలో పెనుమార్పులకు నాంది పలికామని గుర్తుచేశారు. మెగా పేరెంట్స్, టీచర్స్‌ మీటింగ్‌ నిర్వహించామని వివరించారు. రాష్ట్రమంతా ఒకే రోజు 13,326 గ్రామసభలు నిర్వహించి 3,000 పనులకు శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు.

గ్రామాలకు 4జీ నెట్‌వర్క్‌: అడవితల్లి బాటలో తండాలకు రోడ్లు నిర్మిస్తున్నామని శివారు గ్రామాలకు 4జీ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కుంకీ ఏనుగులు రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. అమరజీవి జలధార పేరుతో 1.21 కోట్ల మందికి దాహార్తి తీర్చేలా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.3,050 కోట్లతో ప్రాజెక్టు రూపొందిస్తున్నట్లు సీఎం తెలియజేశారు.

రైతుల ఖాతాల్లో 6,310 కోట్లు జమ: అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,310 కోట్లను జమ చేసినట్లు చంద్రబాబు తెలిపారు. మార్కెట్‌ జోక్యం ద్వారా పొగాకు, మామిడి, కోకో, ఉల్లి సహా పలు పంటల కొనుగోలు చేశామని గుర్తు చేశారు. రికార్డు స్థాయిలో 8,120 కోట్లతో 34.23 లక్షల టన్నుల ధాన్యం సేకరించి 24 గంటల్లో నగదు జమ చేశామని పేర్కొన్నారు. దీపం పథకం కింద రూ.2,684 కోట్లతో 2 కోట్ల ఉచిత సిలిండర్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. మత్స్యకార భరోసా ద్వారా ఏడాదికి 20,000 చొప్పున 1.25 లక్షల మందికి రూ.250 కోట్లు, ఆటోడ్రైవర్ల సేవలో ఏడాదికి 15,000 చొప్పున 2.90 లక్షల మందికి రూ. 436 కోట్లును అందించినట్లు సీఎం వివరించారు.

మగ్గాలకు 200 యూనిట్లు సరఫరా: నేతన్నలకు ఉచిత విద్యుత్తు పథకం కింద మరమగ్గాలకు నెలకు 500 యూనిట్లు, మగ్గాలకు 200 యూనిట్లు సరఫరా చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు చేశామన్నారు. మొత్తం రూ.1000 కోట్ల వ్యయంతో రహదారులకు మరమ్మతులు చేశామని చెప్పారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నేరాల రేటు తగ్గిందని వెల్లడించారు. ఈగల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు ద్వారా గంజాయి, మాదకద్రవ్యాల సరఫరా అరికట్టామని స్పష్టం చేశారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి మూడు రీజియన్ల ద్వారా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నట్లు వివరించారు.

పూర్వోదయలో ఏపీకి చోటు: పూర్వోదయ పథకంలో రాష్ట్రానికి చోటు దక్కిందని చంద్రబాబు తెలిపారు. విశాఖ రైల్వేజోన్‌ ప్రధాన కార్యాలయ పనులు జరుగుతున్నాయని సీఎం వివరించారు. కేంద్రంతో సమన్వయం ద్వారా 90 పథకాల్ని పునరుద్ధరించామని గుర్తు చేశారు. సెమీకండక్టర్‌ పరిశ్రమల ఏర్పాటుతో పాటు కేంద్రం నుంచి స్టీల్‌ప్లాంట్‌కు రూ.11,440 కోట్లు ఊతం లభించిందని చెప్పారు.

దాదాపు లక్ష కోట్ల విలువైన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్‌ రూఫ్‌టాప్, బీసీలకు రూ. 20,000 చొప్పున అదనపు సాయాన్ని అందిస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వివరించారు.

జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష - 31న తుది నోటిఫికేషన్!

వృద్ధిరేటు పెంపునకు ప్రణాళికలు - అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష