ETV Bharat / state

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - ఘటనాస్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు

కాకినాడ జిల్లాలో భారీ పేలుడు, 21 మంది మృతి - పేలుడు ధాటికి పక్కనున్న పొలాల్లోకి ఎగిరిపడిన మృతదేహాలు, శరీర భాగాలు - పేలుడు జరిగిన స్థలాన్ని పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu Review on Kakinada Blast Incident
CM Chandrababu Review on Kakinada Blast Incident (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 28, 2026 at 5:19 PM IST

|

Updated : February 28, 2026 at 6:36 PM IST

4 Min Read
Choose ETV Bharat

CM Chandrababu Review on Kakinada Blast Incident : కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం బాధితులకు అవసరమైన తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నానని బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. విజయనగరం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ప్రమాద ఘటనను అధికారులు తెలిపారు. విజయనగరం నుంచే ఉన్నతాధికారులతో సీఎం మాట్లాడారు. ప్రమాదానికి కారణాలు ప్రస్తుతం అక్కడ అందుతున్న సహాయక చర్యలపై సీఎం ఆరా తీశారు. ఈ ప్రమాదం సూర్య ఫైర్ వర్క్స్​లో జరిగిందని అధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో బాణసంచా తయారీదారులు ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు. మంత్రులను, ఉన్నతాధికారులను ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం సూచించారు.

తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఉపముఖ్యమంత్రి : కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలోని బాణాసంచా పరిశ్రమలో చోటు చేసుకున్న భారీ విస్ఫోటనంలో పలువురు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి కందుల దుర్గేష్, మంత్రి లోకేశ్​ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కలెక్టర్, ఎస్పీ ఘటన స్థలంలో ఉండి పరిస్థితిని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించే ఏర్పాట్లు చేశారన్నారు.

బాణాసంచా తయారీ పరిశ్రమ నుంచి ఇంకా పేలుళ్లు వస్తున్నాయని అధికారులు తెలిపారు. బాణాసంచా పరిశ్రమలపై అధికారులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచి భద్రత చర్యలను తనిఖీ చేయాలని జిల్లా అధికారులకు పవన్ ఆదేశించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ లను ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షణ చేపట్టి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పాలని దిశానిర్దేశం చేయలని పవన్ సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గం పెరవలి నుండి హుటాహుటిన కాకినాడ వేట్లపాలెం బయల్దేరి వెళ్లారు.

మృతుల కుటుంబాలకు లోకేశ్ భరోసా : కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సమాచారం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పలువురు మృత్యువాత పడటం మాటలకు అందని విషాదం అన్నారు. మృతులకు నివాళులు అర్పించారు. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు.

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో పేలుడు ఘటనలో కార్మికులు మృతి పట్ల హోం మంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి హుటాహుటిన వేట్లపాలెంలో పేలుడు ఘటన స్థలానికి హోం మంత్రి బయలుదేరారు. కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడి వివరాలను హోంమంత్రి ఆరా తీస్తున్నారు.

ఘటనపై మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి : కాకినాడ జిల్లా వెట్లపాలెంలో బాణా సంచా పేలుడు ఘటనపై మంత్రులు అచ్చెన్నాయుడు, సుభాష్, సత్యకుమార్, నారాయణలు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. తక్షణ వైద్య సహాయక చర్యలు చేపట్టాలని వైద్య శాఖ సెక్రటరీ, డిఏంఈ, డిఏంహెచ్ఓ లకు సత్య కుమార్ ఆదేశించారు. సూపర్ స్పెషాలిటీ వైద్యులు, ఇతర సిబ్బందిని సంఘటన స్థలానికి వెంటనే పంపాలని తెలిపారు. అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు వేగవంతం చేయాలని, అగ్నిమాపక సిబ్బంది , రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా పనిచేయాలని సుభాష్ సూచించారు. మంటల్లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అవసరమైన సహాయాన్ని వెంటనే అందిస్తామని కార్మిక శాఖ మంత్రి హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు మంత్రులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి : కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణా సంచా కేంద్రంలో పేలుడు ఘటనపై మంత్రులు మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి, సవిత, కేశవ్, రామానాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికుల మృతి వార్త పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసానిచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచనలు చేశారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. ప్రమాదకర యూనిట్లలో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన ప్రత్యేక భద్రతలు, తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో భారీ పేలుడులో పలువురు మృతి చెందడంపై మంత్రులు గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డిలు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాదాంలో పలువురు కార్మికులు మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామిఇచ్చారు. బాణాసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని నేతలు అభిప్రాయపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టంచేశారు.

కాకినాడ జిల్లాలో భారీ పేలుడు - 21కి చేరిన మృతుల సంఖ్య

వైద్యారోగ్యానికి అధిక ప్రాధాన్యం - క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలతో కలిసి మాట్లాడాలి : సీఎం చంద్రబాబు

Last Updated : February 28, 2026 at 6:36 PM IST