ప్రతి ఒక్కరికీ ఏఐ డాక్టర్ - ఏం తినాలి, ఏం చేయాలో చెబుతుంది: సీఎం చంద్రబాబు
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ - గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేసిన సీఎం చంద్రబాబు - నాడు మమ్మల్ని అడ్డుకున్నవాళ్లు ఈ రోజు నీతులు చెబుతున్నారని ఆగ్రహం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 13, 2026 at 6:13 PM IST
|Updated : February 14, 2026 at 7:48 AM IST
CM Chandrababu Speech in Legislative Assembly: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మామూలు విధ్వంసం జరగలేదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో నాకు జరిగిన అవమానానికి కన్నీళ్లు పెట్టుకున్నానని, నా మాదిరిగానే ఎంతో మంది కన్నీళ్లు పెట్టుకున్నారని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పాటు చేశామని వ్యాఖ్యానించారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా తనను అరెస్టు చేశారని, పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనకు వెళ్తే అడ్డుకున్నారని సీఎం అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 94 శాతం స్ట్రైక్ రేట్ తో ఓటర్ల గెలిపించారని చంద్రబాబు గుర్తు చేశారు.
నాడు మమ్మల్ని అడ్డుకున్నవాళ్లు ఈ రోజు నీతులు చెబుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఈ అసెంబ్లీ బూతులకు నమూనాగా ఉండేదని అన్నారు. అభివృద్ధికి ఎల్లప్పుడూ మద్దతు ఇచ్చిన జనసేన, బీజేపీకి సీఎం ధన్యవాదాలు తెలిపారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని కానీ వారికి ఒక్క పైసా ఇవ్వలేదని అభివృద్ధి చేసి ప్లాట్లు ఇస్తామని చెప్పామని వివరించారు. అలానే రాష్ట్రంలో రౌడీయిజం, నక్సలిజాన్ని నిర్మూలించగలిగాం కానీ రాజకీయ నేతల ముసుగులో నేతలే నేరాలు చేస్తే ఎలా అని సీఎం ప్రశ్నించారు. ఎక్కడికి పోయినా దౌర్జన్యం చేయడం, రోడ్డంతా బ్లాక్ చేస్తున్నారని అన్నారు. గుంటూరు నుంచి విజయవాడ పోవాలంటే ఆరుగంటలా అయితే ఈ ఆరు గంటలూ ప్రజలు నరకం అనుభవించాలా అని ప్రశ్నించారు. జాతీయ రహదారులపై సమావేశాలు పెట్టకూడదని స్పష్టమైన ఆదేశాలున్నా పట్టించుకోవట్లేదని సీఎం మండిపడ్డారు.
లడ్డూ కల్తీకి హెరిటేజ్‌కు ఏం సంబంధం: రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను ప్రక్షాళన చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. కొంతమంది కావాలనే భక్తుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారని దుయ్యబట్టారు. తిరుమల లడ్డూ కల్తీకి హెరిటేజ్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా హెరిటేజ్ అడగలేదన్న చంద్రబాబు పేపర్ ఉంది కదా అని పెద్ద హెడ్ లైన్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాండ్ డ్యామేజ్ చేస్తే హెరిటేజ్‌కు నష్టం వస్తుందని వాళ్ల భావన అని, నాడు వివేకాను చంపి కూడా నారాసుర రక్తచరిత్ర అని రాశారని సీఎం గుర్తు చేశారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. రికార్డు స్థాయిలో పింఛన్లు ఇవ్వటంతో పాటు మహిళకు ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ పథకాలను సమర్థవంతంగా ఇస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలున్నా కేంద్రం సాయంలో సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని చంద్రబాబు గుర్తు చేశారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రం కోలుకునేలా కేంద్రం మద్దతు ఇచ్చిందని సీఎం అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్రం కూడా భాగస్వామ్యం కావటంపై సంతోషం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ సహా అన్ని పథకాలకూ సాయం అందించిన కేంద్రప్రభుత్వంపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు.
అందుకే 11 నిమిషాలకే బయటకు వెళ్లారు: స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా 10 సూత్రాలు అమలు చేసి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా తీర్చి దిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తలసరి ఆదాయం రెట్టింప్పు అయ్యేలా పని చేస్తున్నామని క్షేత్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ రెండేళ్లలో సాధించిన విజయాలను గుర్తు చేసుకుని రాబోయే మూడేళ్ల లక్ష్యాలను నిర్దేశించుకుందామని అన్నారు. వైఎస్సార్సీపీకి 11 సంఖ్యతో అవినాభావ సంబంధం ఉందని అందుకే 11 నిమిషాలకే బయటకు వెళ్లారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం, భూ అక్రమాలను చంద్రబాబు ఎండగట్టారు.
''పీపీపీలో ఏదైనా నిర్మిస్తే నిర్ధిష్టకాలం ప్రైవేటు వ్యక్తులు నిర్వహించి తర్వాత ప్రభుత్వానికి అప్పగిస్తారు. సంపద రావాలి అభివృద్ధి జరగాలి. సంపద కొంతమంది దగ్గరే పరిమితమవ్వడం సరికాదు. అందరూ శ్రద్ధగా పనిచేస్తే పీ4 దేశంలోనే ఆదర్శంగా మారుతుంది. ప్రతి ఇల్లు సోలార్ విద్యుత్ తయారు చేసేలా ప్రజాప్రతినిధులు ప్రోత్సహించాలి. త్వరలోనే ప్రతి ఒక్కరికీ ఏఐ డాక్టర్‌ను కేటాయిస్తాం. ఏం తినాలి ఏం చేయాలో ఏఐ డాక్టర్ చెబుతుంది. విశాఖలో 15 బిలియన్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం.'' - చంద్రబాబు, సీఎం
పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజముద్ర: అప్పుడు చేసిన రెవెన్యూ పాపాలు కడగడానికే ప్రభుత్వానికి ఏడాది సమయం పట్టిందన్నారు. మద్యం విషయంలో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించబోమని సీఎం హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో డబ్బుల కోసం ప్రాణాలను తీసుకున్నారని, కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఇసుక విధానంపైనా కూటమి ప్రభుత్వం ప్రణాళికబద్దంగా ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజముద్ర వేయించి ఇచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దడానికి సుమారు ఏడాది పట్టిందని చెప్పారు. ఎవరూ ట్యాంపరింగ్ చేయని విధంగా చేసి లబ్ధిదారులకు అందించామని గుర్తు చేశారు. చట్టసభ అనేది ప్రజా దేవాలయమని విద్యార్థులను అసెంబ్లీకి అనుమతించటం ప్రత్యేకమని సీఎం చంద్రబాబు అన్నారు. ఇటీవల విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారని, సభలో సభ్యులకంటే వారే బాగా ప్రసంగించారని గుర్తు చేశారు. విద్యార్థి దశలోనే రాజకీయాల పట్ల అవగాహన కల్పించటంపై హర్షం వ్యక్తం చేశారు.
రాబోయే మూడేళ్లలో ఉత్తరాంధ్రలో అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాయలసీమలోని ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి కూర్చొని మాట్లాడుకోవాలన్న చంద్రబాబు, నల్లమల సాగర్‌కు తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడటం సరికాదన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉంటే అభివృద్ధి సులభంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
బొత్స Vs లోకేశ్ - ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలపై మండలిలో వాడీవేడి చర్చ
రైతులందరూ ధైర్యంగా ఉండండి - మీ కోసం ప్రభుత్వం పని చేస్తుంది: ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

