ETV Bharat / state

రాష్ట్రానికి డగ్‌ డగ్‌ మంటూ వచ్చేస్తున్న బుల్లెట్‌ బండి - తిరుపతిలో రూ.2,508 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 17వ SIPB సమావేశం- మొత్తం రూ. 2,00,964 కోట్ల విలువైన వివిధ పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం - 38,722 మందికి ఉపాధి కల్పన

Royal Enfield Company In Rayalaseema
Royal Enfield Company In Rayalaseema (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 7, 2026 at 7:22 AM IST

3 Min Read
Choose ETV Bharat

Royal Enfield Company In Rayalaseema : ప్రఖ్యాత 'బుల్లెట్' మోటార్‌సైకిల్ ఇకపై నేరుగా రాష్ట్రం నుంచే వినియోగదారుల ముందుకు రానుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ తిరుపతిలో తన 'బుల్లెట్' మోటార్‌సైకిళ్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. దీని కోసం రూ. 2,508 కోట్ల పెట్టుబడిని వెచ్చించనుంది. రానున్న రోజుల్లో తిరుపతిలో జోరుగా బులెట్​ రయ్​ రయ్​ మంటూ సాగుతుంది.

రాయలసీమలో భారీ పరిశ్రమలు : బుధవారం నాడు జరిగిన సమావేశంలో SIPB (State Investments Promotion Board) ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా రిలయన్స్ సంస్థ విశాఖపట్నంలో రూ. 1,08,010 కోట్ల భారీ పెట్టుబడితో ఒక డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఇంకా శ్రీ సత్యసాయి జిల్లాలో రూ. 51,000 కోట్ల పెట్టుబడితో ఒక సౌర విద్యుత్ ప్లాంట్‌ను, బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థను (Battery Energy Storage System) ఏర్పాటు చేయాలని ఆ సంస్థ యోచిస్తోంది. కడప జిల్లాలో అదానీ సంస్థ రూ. 12,000 కోట్ల పెట్టుబడితో ఒక హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది.

38,722 మందికి ఉపాధి అవకాశాలు : బుధవారం నాడు SIPB వివిధ సంస్థల నుంచి వచ్చిన మొత్తం రూ. 2,00,964.10 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 38,722 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంబంధిత సంస్థలు తమ ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. ప్రతి ప్రతిపాదన ఒప్పందంగా మారాలి రాష్ట్రానికి అందిన ప్రతి పెట్టుబడి ప్రతిపాదన ఒక అధికారిక ఒప్పందంగా రూపుదిద్దుకోవాలని, ఆపై ప్రతి ఒప్పందం క్షేత్రస్థాయిలో వాస్తవ పెట్టుబడిగా పరిణమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

"రాష్ట్రానికి ఏదైనా పెట్టుబడి లేదా పరిశ్రమ రాకకు సంబంధించి అనుమతుల జారీ నుంచి శంకుస్థాపన తుది ప్రారంభోత్సవం వరకు ప్రతి దశ నిర్దేశిత గడువులలోపే పూర్తి కావాలి. ప్రభుత్వ దగ్గర నుంచి అనుమతులు మంజూరు చేయడంలో ఒక్క రోజు కూడా జాప్యం జరగకూడదు. ఈ పోటీ ప్రపంచ వాతావరణంలో మనం పెట్టుబడులను ఆకర్షించాలనుకుంటే ఇతరుల కంటే మనకు ఉన్న ప్రత్యేక ప్రయోజనాన్ని నిరూపించుకోవాలి. మన రాష్ట్రంలో అనుమతులు పొందడం ఎంత సులభమో సమర్థవంతంగా చాటిచెప్పాలి. రాష్ట్రానికి ప్రాజెక్టులను తీసుకురావాలనే నిజమైన పట్టుదల కలిగిన అధికారులను అనుమతులు మంజూరు చేసే కీలక బాధ్యతాయుత స్థానాల్లో నియమించాలి." - సీఎం చంద్రబాబు

MSMEలకు ప్రాధాన్యత : ప్రస్తుతం భారీ పరిశ్రమలకు పెట్టుబడుల విషయంలో ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నామో MSMEలకు కూడా అదే స్థాయి ప్రాధాన్యత కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నొక్కి చెప్పారు. "'ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త' అనే మన లక్ష్యాన్ని సాకారం చేయడంలో MSMEలు కీలక పాత్ర పోషిస్తాయి. ఆహార శుద్ధి రంగంలో అందుబాటులో ఉన్న అవకాశాలను మనం సమర్థవంతంగా వినియోగించుకోవాలి.

ఈ పెట్టుబడులు విజయవంతంగా క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చేలా చూడాలి. మన రాష్ట్రంలో పండే వాణిజ్య పంటలకు విలువ జోడించే (Value addition) ప్రక్రియలు చేపట్టాలి. ఆయిల్ పామ్, మామిడి, కొబ్బరి, కోకో వంటి వివిధ పంటలకు ఇటువంటి విలువ జోడింపు ప్రక్రియలను అమలు చేయడం ద్వారా మన రైతులకు మంచి ప్రయోజనం చేకూరుతుంది." అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు టి.జి. భరత్, అచ్చెన్నాయుడు , సుభాష్ పాల్గొనగా, మంత్రి కేశవ్ వర్చువల్ విధానం ద్వారా హాజరయ్యారు.

సవాళ్లను స్వీకరించి ముందుకు సాగాలి - యువతకు నారా లోకేశ్​ పిలుపు

'ఆమె ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుంది - పారిశ్రామికవేత్తగా ఎదిగింది'