ETV Bharat / state

డేటా ఆధారిత నిర్ణయాలకే భవిష్యత్ : సీఎం చంద్రబాబు

తిరుపతిలో స్వర్ణాంధ్ర 2047 ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ సదస్సు - పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు - పేదల స్థితిగతులు మార్చేందుకు పథకాల అమలును ప్రస్తావించిన సీఎం

Chandrababu on Data Governance
Chandrababu on Data Governance (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 2, 2026 at 9:43 PM IST

3 Min Read
Choose ETV Bharat

Chandrababu on Data Governance : ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లాలో రెండో రోజు పర్యటించారు. రైల్వే కోడూరు నియోజకవర్గం ముక్కవారిపల్లిలో కేంద్రమంత్రి శివరాజ్​సింగ్ చౌహాన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్​తో కలిసి వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అజీవికా మిషన్ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం తిరుపతిలో ఓ ప్రైవేట్​ హోటల్​లో నిర్వహించిన స్వర్ణాంధ్ర 2047 ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్‌ రెండు రోజుల వర్క్‌షాప్​లో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

డేటా ఆధారిత నిర్ణయాలకే భవిష్యత్ : సీఎం చంద్రబాబు (ETV Bharat)

ప్రణాళికశాఖ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధనలో ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేసేలా ఈ వర్క్​షాప్​ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక, పరిపాలనా వ్యవహారాల్లో దేశ విదేశాలకు చెందిన ప్రముఖ నిపుణులు ఈ వర్క్‌షాప్​కు హాజరయ్యారు.ఈ సందర్భంగా జరిగిన ప్యానెల్ చర్చలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలు, అమలు తీరును ప్యానలిస్టులు ప్రస్తావించారు. విజన్ ప్లాన్, పీ4, డేటా సేకరణ, పాలనలో ఏఐ అమలులో సీఎం చంద్రబాబు చొరవను ప్యానలిస్టులు ప్రశంసించారు.

పరిపాలనలో ఆర్థిక మేధస్సు, ఆధునిక సాంకేతికతను జోడించి పేదరికంపై సమరం చేయడమే తమ సర్కార్ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. డేటా ఆధారిత నిర్ణయాలతోనే భవిష్యత్ ఉంటుందని, పేద-ధనికుల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. కేవలం అంకెలు, గణాంకాలతోనే కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తాను నేర్చుకున్న ఆర్థికశాస్త్రమే తన పాలనకు దిక్సూచి అని వెల్లడించారు. తాను స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన తులశమ్మ, పద్మమ్మల కుటుంబాల జీవన స్థితిగతులను ఈ సందర్భంగా వివరించారు. ప్రభుత్వ పథకాలు, డ్వాక్రా రుణాల ద్వారా ఆయా కుటుంబాలు ఎలా ఆర్థికంగా ఎదిగాయో నిపుణుల సమక్షంలో తెలియజేశారు.

"జీఎస్డీపీ, సీఏజీఆర్ గణాంకాలను బేరీజు వేసుకుంటూ పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. డేటానే సంపదగా మారిన రోజుల్లోకి మనం వచ్చాం. భవిష్యత్ అంతా డేటా ఆధారిత నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖల సమాచారాన్ని అనుసంధానం చేస్తున్నాం. ప్రజలకు సేవలు అందించడంతో పాటు, సంపద సృష్టి కోసం ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం కూడా అంతే ముఖ్యం. స్వర్ణాంధ్ర విజన్​లో ప్రైవేట్ పెట్టుబడులకు ప్రత్యేక స్థానం కల్పించాం. సమాజం నుంచి లబ్ధి పొంది ఎదిగిన వారు తిరిగి సమాజానికి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే పీ4 కార్యక్రమాన్ని తీసుకొచ్చాం." - చంద్రబాబు, ముఖ్యమంత్రి

Tirupati Swarna Andhra 2047 Program : గతంలో తాను ఉమ్మడి రాష్ట్రంలో విజన్ 2020ని తీసుకొస్తే ఎందరో విమర్శించారని చంద్రబాబు గుర్తుచేశారు. కానీ నాడు ఐటీ, సర్వీస్ సెక్టార్‌పై పెట్టిన నమ్మకమే నేడు ఈ స్థాయి అభివృద్ధికి కారణమైందన్నారు. అప్పట్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా దేశానికి విజన్ డాక్యుమెంట్ ఉండాలని ఆకాంక్షించారని గుర్తుచేశారు. తరగతి గదిలో కంటే సమాజం, ప్రజల నుంచి ఎక్కువగా నేర్చుకున్నానని చంద్రబాబు వెల్లడించారు.

రాబోయే రోజుల్లో హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేయడం ద్వారా సంజీవని ప్రాజెక్టును అమలు చేయబోతున్నామని చంద్రబాబు ప్రకటించారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలని, రాష్ట్రంలో ఉమ్మడి కుటుంబాల వ్యవస్థను ప్రోత్సహించాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచనని పునరుద్ఘాటించారు. వర్క్ షాప్‍ ముగిసిన అనంతరం చంద్రబాబు తిరుపతి కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన బస్సులో రాత్రి బస చేయనున్నారు.

దేశంలో 25 శాతం పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్‌ ఆకర్షించింది : సీఎం చంద్రబాబు

పెట్టుబడుల్లో దేశంలోనే ఏపీ నెంబర్ 1 - గూడూరులో మెగా ఫర్నిచర్ పార్క్: సీఎం చంద్రబాబు