'సొంత జిల్లా, నియోజకవర్గానికి జగన్ ఏం చేశారు' - కడప జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు
కడప జిల్లాలోని సమస్యల గురించి ఏకరువు పెట్టిన ఎమ్మెల్యేలు - రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, డ్రెయిన్ల సమస్యలు పరిష్కరించాలన్న నేతలు - పెండింగ్ బిల్లులు, అసంపూర్తి పనులు విని ఆశ్చర్యం వ్యక్తం చేసిన సీఎం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 15, 2026 at 12:29 PM IST
CM Chandrababu Meeting With Kadapa MLAs: పులివెందుల సహా కడప జిల్లాలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఆ జిల్లా నేతలు సీఎం చంద్రబాబు వద్ద ఏకరువు పెట్టారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, డ్రైన్లు, నిర్మాణాలు, తాగు, సాగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాటి నుంచి ఉన్న సమస్యలు, పెండింగ్ బిల్లులు, అసంపూర్తిగా ఉన్న పనులు గురించి విని సీఎం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరి 5 ఏళ్ల పాలనలో సొంత జిల్లాకు, సొంత నియోజకవర్గానికి జగన్ ఏం చేశారని మండిపడ్డారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నిధులు ఇచ్చి కడపలో ఒక్కో సమస్యా పరిష్కరిద్దామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
కడప జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. 2024 ఎన్నికల ద్వారా కడప జిల్లాకు మళ్లీ పూర్వవైభవం మొదలైందని సీఎం అన్నారు. ఈ విజయంతో మరింత ముందుకెళ్తూ 2029 ఎన్నికల్లో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించేలా పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. పొలిటికల్ గవర్నెన్స్‌కు ఈసారి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా అధికారుల పనితీరుపైనా నివేదికలు తెప్పించుకుంటున్నట్లు వెల్లడించారు.
ఎమ్మెల్యేలు ఎంత ఎక్కువగా ప్రజల్లో ఉంటే, అంత ఎక్కువ నిధులిస్తానని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే నేతలకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. కడప జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, డ్రెయిన్లు, ఇతరపనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యేలు కోరారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నిధులు కేటాయించి ఒక్కో సమస్య పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
సమస్యల పరిష్కారానికి హామీ: కడప ఉక్కు కర్మాగారం పనులు మే నెలలో ప్రారంభిస్తామని తెలిపారు. 2024 ఎన్నికల్లో జిల్లాకు పూర్వవైభవం మొదలైందని, 2029 ఎన్నికల్లో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించేలా పనిచేయాలని కూటమి నేతలకు చంద్రబాబు సూచించారు. రాజంపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ హయాంలో పెద్ద ఎత్తున భూకబ్జాలు జరిగాయని, వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కమలాపురం నియోజకవర్గంలో పాయసంపల్లి లిఫ్ట్ స్కీం, అడవిచర్లపల్లి లిప్ట్ స్కీం, అలిదిన్నె లిప్ట్ స్కీంలకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేలు కోరగా చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. జిల్లా పరిషత్ స్కూల్లో 90 శాతం పూర్తయిన ఇండోర్ స్టేడియాన్ని పూర్తి చేయాలని దీనికి రూ.50 లక్షలు నిధుల అవసరమని సీఎం చెప్పారు. పులివెందుల తాగునీటి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. నిధుల విడుదల చేసి ప్రాజెక్టు పూర్తి చేసి పులివెందుల తాగునీటి సమస్య తీర్చాలని నిర్ణయించారు. పులివెందుల నియోజకవర్గం మల్లెల గ్రామంలో స్కూలులో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
కడప మున్సిపల్ కార్పొరేషన్లో నెలకొన్న డ్రైన్లు, రోడ్లు, డ్రింకింగ్ వాటర్ సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబు ఆదేశించారు. రాజంపేటలో అన్నమయ్య ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలన్నారు. కడపలో ఐటీ పార్క్ కోసం 10 ఎకరాలు గుర్తించారని ఐటీ పార్క్ నిర్మిస్తే యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం: సీఎం చంద్రబాబు
16న బిల్ గేట్స్ అమరావతి వస్తున్నారు - 3సార్లు ఏపీకి తీసుకొచ్చిన ఘనత నాదే: సీఎం చంద్రబాబు

