కుప్పం ఆస్పత్రి ఆవరణలో చెత్తాచెదారం - సీఎం చంద్రబాబు ఆగ్రహం
కుప్పం ఏరియా ఆసుపత్రిని సందర్శించిన సీఎం చంద్రబాబు - సీటీ స్కాన్ సెంటర్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి - చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వైద్య సేవలపై ఆరా- వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని ఆదేశం

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 4, 2026 at 3:15 PM IST
CM Chandrababu Visit to Kuppam : కుప్పం ఏరియా ఆసుపత్రిలో సీటీ స్కాన్ సెంటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఆ తర్వాత సంజీవని ఎగ్జిబిషన్ స్టాల్‌ను సందర్శించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వైద్య సేవలపై సీఎం ఆరా తీశారు. హాస్పిటల్ ఆవరణలో చెత్తాచెదారం, వ్యర్థాలు ఉండటంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఎందుకిలా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై అసహనం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా వ్యర్థాలు క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 2వ రోజు పర్యటన కొనసాగుతోంది. నియోజకవర్గ అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పర్యటన సాగుతోంది. స్థానికులు, పార్టీ అభిమానులు ముఖ్యమంత్రిని కలిసేందుకు భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో ప్రజల వద్దకు వెళ్లిన సీఎం, వారిని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. స్థానికులతో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు తమ నియోజకవర్గ, వ్యక్తిగత సమస్యలపై ముఖ్యమంత్రికి వినతి పత్రాలు అందజేశారు. అర్టీలను స్వీకరించిన సీఎం సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
నెట్ జీరో మోడల్ గృహాలు సందర్శన: అనంతరం చంద్రబాబు నలగంపల్లో గ్రామంలో పర్యటించారు. గ్రామంలో వినూత్నంగా నెట్ జీరో విధానాన్ని అవలంబిస్తోన్న ఇళ్లను సీఎం ప్రత్యేకంగా పరిశీలించారు. పర్యావరణహితంగా రూపుదిద్దుకున్న ఈ ఇళ్లలోని రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ, ఇండక్షన్ కుక్‌టాప్ వినియోగం, టెర్రస్ గార్డెనింగ్, వర్షపునీటి సంరక్షణ వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలించారు.
సోలార్ విద్యుత్ వినియోగంపై ఆరా: గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి పర్యావరణహిత పద్ధతులను పాటించడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. నలగంపల్లిలోని ఓ గ్రామస్థుడి ఇంటికి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లారు. ఆ కుటుంబ సభ్యులతో సీఎం ముచ్చటించారు. అదే విధంగా సోలార్ విద్యుత్ వినియోగంపై ఆరా తీశారు. ఇంటిపై ఎన్ని ప్యానెళ్లు పెట్టారు? సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ మీ ఇంటి అవసరాలకు సరిపోతుందా? బిల్లులు ఏమైనా తగ్గాయా? అంటూ వివరాలు అడిగి సీఎం తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి తమ ఇంటికి రావడం, స్వయంగా వివరాలు అడగడంతో ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.
త్వరలో కుప్పంలో బంగారం ఉత్పత్తి చేస్తాం: రాయలసీమలో రూ.లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందులో ప్రైవేటు రంగం వాటా రూ.60 వేల కోట్లు కాగా ప్రభుత్వం రూ.40 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటించిన చంద్రబాబు రూ.117 కోట్లతో అధునాతన బస్‌స్టేషన్, డిపో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కుప్పం చరిత్ర మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతాయన్నారు.
"ఇతర ప్రాంతం నుంచి ఇక్కడికి ఉద్యోగాల కోసం రావాలి. కుప్పం నుంచి మరోచోటకు వెళ్లే పరిస్థితులు రాకూడదు. రూ.9,320 కోట్లతో 30 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశాం. వందల మంది పౌల్ట్రీ రైతులకు చేయూతనిస్తాం. నియోజకవర్గం నుంచి పారిశ్రామికవేత్తలుగా మారేందుకు నాంది పలుకుదాం. అడిడాస్ పరిశ్రమ ద్వారా 20 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్, పౌల్ట్రీ పరిశ్రమలు వచ్చాయి. 10 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి స్థాయికి కుప్పం చేరుతుంది. డ్వాక్రా సంఘాల ద్వారా గడ్డి పెంచి కమ్యూనిటీ ఫోరమ్‌ల ద్వారా సరఫరా చేస్తాం. కుప్పం నియోజకవర్గం ఆర్టికల్చర్ హబ్‌గా తయారు కావాలి. వాణిజ్య, కూరగాయ పంటల ద్వారా మంచి ఆదాయం వస్తుంది." - సీఎం చంద్రబాబు
అన్నీ మంచి రోజులే - స్టీల్‌ప్లాంట్‌తో సీమ చరిత్రలో నవశకం: సీఎం చంద్రబాబు
మెరుగైన సవరణలతో వీబీ జీరామ్‌జీ - గ్రామాల ముఖచిత్రం మార్చే కార్యక్రమం: సీఎం చంద్రబాబు

