రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవు - పొగాకు కంపెనీలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక
పొగాకు కొనుగోళ్ల ప్రక్రియను తక్షణమే వేగవంతం చేయాలని ఆదేశం - టొబాకో బోర్డు పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి - కిలోకు రూ.200 తగ్గకుండా కనీస మద్దతు ధర చెల్లించాలని స్పష్టీకరణ

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 8, 2026 at 10:52 PM IST
CM Chandrababu Warning to Tobacco Companies : రాష్ట్రంలో మందకొడిగా సాగుతున్న పొగాకు కొనుగోళ్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. వెలగపూడిలోని సచివాలయంలో పొగాకు కంపెనీల ప్రతినిధులు, ట్రేడర్లు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రైతుల్లో నమ్మకం, ధైర్యం కల్పించేలా వెంటనే పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరపాలని స్పష్టం చేశారు. ఇందుకోసం వేలం ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
కర్ణాటకలో లేని సమస్య ఏపీలోనే ఎందుకు? : పొగాకు ట్రేడర్లు కొనుగోళ్లు తగ్గించడం ఏమాత్రం సరికాదని సీఎం చంద్రబాబు తప్పుబట్టారు. కర్ణాటక రాష్ట్రంలో తలెత్తని సమస్య ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు ఉత్పన్నం అవుతోందని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా టొబాకో బోర్డు పనితీరుపైనా ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బందిపెట్టేలా నడుచుకుని కంపెనీలు తమ గుడ్ విల్‌ను పోగొట్టుకోవద్దని హితవు పలికారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతులు గనుక విసిగిపోయి ప్రత్యామ్నాయ పంటలకు మళ్లితే, భవిష్యత్తులో తలెత్తే పరిణామాల గురించి పొగాకు కంపెనీలు ఆలోచన చేయాలని సీఎం సూచించారు.
రూ. 200 మద్దతు ధర ఇవ్వాల్సిందే : మొత్తం 28 పొగాకు కంపెనీలు సమర్పించిన ఇండెంట్ వివరాలు, ప్రస్తుతం వారు జరిపిన కొనుగోళ్ల శాతాన్ని సమీక్షలో సీఎం పరిశీలించారు. ఇండెంట్ ఇచ్చి కొనుగోలు చేయకుండా, ప్రభుత్వానికి సహకరించకపోతే సహించే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కేజీకు రూ. 200కి తగ్గకుండా చూడాలన్నారు. మొత్తంగా రైతుల దగ్గర ఉన్న పొగాకు కొనుగోళ్లు జరిపితీరాలని అధికారులకు, ట్రేడర్లకు తేల్చి చెప్పారు.
కంపెనీల నిర్లక్ష్యమే : అతిపెద్ద మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు అయిన ఐటీసీ లిమిటెడ్, గాడ్ ఫ్రే ఫిలిప్స్ (ఐ) లిమిటెడ్, వీఎస్టీ ఇండస్ట్రీస్ పనితీరుపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఈ కంపెనీలు 95.50 మిలియన్ మెట్రిక్ టన్నుల పంట కొనుగోళ్లకు ఇండెంట్ ఇచ్చాయని గుర్తు చేశారు. కానీ, ఇప్పటివరకు కేవలం 17.6 మిలియన్ మెట్రిక్ టన్నుల పొగాకు మాత్రమే కొనుగోలు చేయడాన్ని తప్పుబట్టారు. ఈ సీజన్లో ఐదవ సారి ఇదే అంశంపై సమీక్ష నిర్వహించాల్సి వచ్చిందంటే, కంపెనీల నిర్లక్ష్యం ఎంత స్పష్టంగా కనిపిస్తోందో అర్థమవుతోందని ముఖ్యమంత్రి మండిపడ్డారు.
'అధిక దిగుబడే సమస్యకు కారణం' : రైతులు డిమాండ్‌కు మించి పొగాకు సాగు చేయడం వల్లే ప్రస్తుత సమస్య ఉత్పన్నమైందని ట్రేడర్లు ముఖ్యమంత్రికి వివరించారు. తాము ఇప్పటికే అవసరానికి మించి కొనుగోళ్లు చేశామని వెల్లడించారు. దానికి తోడు అంతర్జాతీయంగా ఎగుమతులు కూడా తగ్గాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ రైతుల మేలు కోసం కొనుగోళ్లు కొనసాగిస్తామని కంపెనీల ప్రతినిధులు హామీ ఇచ్చారు.
బహిరంగ మార్కెట్ లేకపోవడమే శాపం : పొగాకుకు సంబంధించి బహిరంగ మార్కెట్ లేకపోవడం వల్లే సమస్య తీవ్రమైందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కంపెనీలు 142 మిలియన్ కేజీలకు మాత్రమే ఇండెంట్ ఇచ్చాయన్నారు. కానీ రైతులు 232 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి చేశారని తెలిపారు. డిమాండ్‌కు మించి సప్లయ్ ఉండటంతో ధర పతనం కావడం, కొనుగోళ్లు నిలిచిపోవడం జరిగిందని అధికారులు వివరించారు.
ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. వీరితో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు - హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంపు
మరో 11 ప్రాజెక్టులకు SIPB ఆమోదం - రూ.9076 కోట్ల పెట్టుబడులు, 10 వేల ఉద్యోగాలు

