తెలుగు ప్రజల కోసం సహకరించుకుంటాం: సీఎం చంద్రబాబు
పట్టిసీమ ద్వారా తమకున్న చిత్తశుద్ధిని చాటుకున్నామన్న సీఎం - రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేసిన చంద్రబాబు - సింధూ నాగరకత ఎలా వచ్చిందో జగన్ తెలుసుకుంటే మంచిదని హితవు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 10, 2026 at 6:08 PM IST
|Updated : January 10, 2026 at 7:04 PM IST
Chandrababu Interacts With Media At NTR Bhavan: వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి నాగరికత తెలిస్తే నదుల గురించి దుష్ప్రచారం చేయడని సీఎం చంద్రబాబు హితవు పలికారు. సింధూ నాగరకత ఎలా వచ్చిందో అతను తెలుసుకుంటే మంచిదని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
దేశ రాజధాని దిల్లీ సహా ప్రధాన నగరాలు ఎక్కువ నదీ తీరాల వెంబడి ఉండటం వలనే అభివృద్ధి చెందాయని సీఎం చంద్రబాబు తెలిపారు. లండన్ సహా ప్రపంచంలోని ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ నగరాలు సైతం నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఉన్నాయని సీఎం వెల్లడించారు. నదీ గర్భానికి నదీ పరివాహక ప్రాంతానికి తేడా కూడా తెలియకుండా వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా సరే రాజధానిపై విషం చిమ్మటం మానట్లేదని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రపంచంలోనే నెంబర్ 1గా ఏపీ: రాష్ట్రంలో రానున్న 2 ఏళ్లలో నీటి కొరత లేకుండా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. నీటిని సద్వినియోగం చేసుకోవడం వలనే రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ది చెందిందని వివరించారు. దేశంలోనే ఉద్యానవన రంగంలో మొదటి స్థానంలో ఉన్న మనం రానున్న మరో పదేళ్లలో ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి వెళ్తామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో సీఎం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
నీటి విషయంలో గొడవలకు పోతే నష్టపోయేది తెలుగు ప్రజలే అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రెండు తెలుగురాష్ట్రాలు బాగుండేలా చూడటం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. మిగులు జలాల్ని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని వెల్లడించారు. రాయలసీమకు నీరందించామనటానికి పట్టిసీమ ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. పట్టిసీమ ద్వారా రాయలసీమ పట్ల తమకున్న చిత్తశుద్ధిని చాటుకున్నామని తెలిపారు. 2020లో నిలిపిన రాయలసీమ లిఫ్ట్‌తో స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: ఆ ప్రాజెక్టు ఫలితంగానే ఉద్యానరంగం అభివృద్ధి చెందిందన్నారు. పూర్తి చేయకుండా 2020లోనే నిలిపివేసిన రాయలసీమ లిఫ్ట్ తో స్వార్థరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం మట్టిపనులు చేసి రూ.900 కోట్లు బిల్లులు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యం, నీటి విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు.
వైఎస్ జగన్‌ది అవగాహనారాహిత్యం: ప్రపంచంలో అభివృద్ధి చెందిన అనేక నగరాలన్నీ నదుల ఒడ్డునే ఉన్నాయని మంత్రి నారాయణ అన్నారు. నదీగర్భంలో అమరావతి అంటున్న వైఎస్ జగన్‌ది అవగాహనారాహిత్యమేనని మంత్రి నారాయణ అసహనం వ్యక్తం చేశారు. రివర్ బెడ్‌కి, రివర్ బేసిన్‌కు తేడాను జగన్ తెలుసుకోవాలని వివరించారు నారాయణ ఈ సందర్భంగా వివరించారు.
అంతేకాకుండా హైదరాబాద్ సచివాలయంతో పోల్చి విమర్శించడం సరికాదని, అటువంటి వాదనలను మానుకోవాల్సిందిగా మంత్రి నారాయణ వైఎస్సార్సీపీ నేతలకు సూచించారు. హైదరాబాద్ సచివాలయం మంత్రులు, కార్యదర్శులకే పరిమితమని నారాయణ స్పష్టం చేశారు. అదే అమరావతిలో అయితే శాఖాధిపతులు, వారి సిబ్బంది ఒకేచోట ఉంటారని నారాయణ గుర్తు చేశారు. ఎంతో దూరదృష్టితో అమరావతిని నిర్మిస్తున్నారని సీఎం చంద్రబాబు మంత్రి నారాయణ ఈ సందర్భంగా కొనియాడారు.
నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాలు గొడవలు పెట్టుకుంటే ప్రయోజనం ఏమీ ఉండదని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. మన వద్ద నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా వాడుకోవచ్చని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. అయితే గత కొద్ది రోజులుగా చంద్రబాబు తెలుగురాష్ట్రాల జల వివాదాలపై తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలు వద్దు అని కోరుతూనే ఉన్నారు.
ప్రజల నుంచి వినతుల స్వీకరణ: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు వచ్చిన సీఎం చంద్రబాబు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. తమ సమస్యలను చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఒక్కొక్కరి ఇబ్బందులను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఆరోగ్య, సీఎంఆర్ఎఫ్ సంబంధిత బాధితులకు అక్కడికక్కడే సీఎం పరిష్కారం చూపారు. అనంతరం పార్టీ బ్యాక్ ఆఫీస్ సభ్యులతో చంద్రబాబు సమావేశమయ్యారు. కమిషన్లు, ఆర్థిక ప్రయోజనాల కోసమే గత ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టిందని సీఎం దుయ్యబట్టారు.
నీటిని లిఫ్ట్ చేస్తే ఎక్కడైనా భద్రపరుచుకుని, అవసరాల కోసం వినియోగించుకోవచ్చునని తెలిపారు. మిగులు జలాలతో చేపట్టే నల్లమల్ల సాగర్ చేపట్టడం ద్వారా శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో నీటి లభ్యత పెరుగుతుందని వివరించారు. ఆ నీటిని తెలంగాణ సైతం వాడుకోవచ్చునని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుందాం - చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని వినియోగించండి: సీఎం చంద్రబాబు

