మాట ఇచ్చి నిలబెట్టుకున్నా - వెలిగొండ బంగారు కొండ అవుతుంది: సీఎం చంద్రబాబు
వెలిగొండ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు - నిమ్మల రామానాయుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్న సీఎం - నిర్వాసితులు కూడా సంతోషంగా ఉండాలనేది తన ఆకాంక్ష అన్న చంద్రబాబు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 31, 2026 at 2:49 PM IST
|Updated : August 31, 2026 at 2:57 PM IST
CM Chandrababu on Veligonda Project : వెలిగొండ బంగారు కొండ అవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మాట ఇచ్చి నిలబెట్టుకున్నామని, ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పారు. కృష్ణమ్మ తెచ్చామని, కరవును తరిమికొడుతున్నామని తెలిపారు. '30 ఏళ్లకు మునుపు చంద్రబాబు అనే నేను 1996 మార్చిన భూమిపూజ చేశా, 30 సంవత్సరాల తర్వాత మొదటి దశ ప్రారంభించి జాతికి అంకితం చేశానని స్పష్టం చేశారు. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు.
2019లో గొడ్డలి పార్టీ రాకతో వెలిగొండ ప్రాజెక్టుకు గ్రహణం పట్టిందని చంద్రబాబు విమర్శించారు. 2024లో వెలిగొండకు పట్టిన గ్రహణం వీడిందన్నారు. గత ప్రభుత్వంలో కేవలం 2.77 శాతమే పనులు చేశారన్నారు. నిర్వాసితుల కోసం జీవో ఇచ్చి అరకొర చెల్లింపులతో మోసం చేశారని మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసినట్లు డ్రామాలాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ ప్రచారాలతో కరవు రైతుల జీవితాలతో ఆడుకున్నవారిని ఏమనాలని చంద్రబాబు ప్రశ్నించారు.
CBN Launch Veligonda Project : 2024 ఎన్నికల్లో మోదీ, పవన్, తాను కలిసి రాష్ట్ర పునర్నిర్మాణంపై మాట ఇచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. తమపై విశ్వాసం ఉంచి ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యమిచ్చారని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఏపీకి అన్నీ ప్రయోజనాలేనని తెలిపారు. మోదీ సహాయం మిత్రుడు పవన్ సహకారంతో ముందుకెళ్తున్నామన్నారు. కరవుతో పోరాడిన రైతన్నకు కృష్ణా జలాలతో స్వాగతం పలికామని చంద్రబాబు వెల్లడించారు.
'వాన కోసం ఆకాశం వైపు చూసిన రైతుల బాధలు చూశాం. బోరు వేస్తే నీళ్లు పడక అప్పుల్లో కూరుకుపోయిన కుటుంబాలను చూశాం. పనులు దొరక్క ఊరు విడిచి వెళ్లిన కూలీలనూ చూశాం. ఇక ఆ పరిస్థితులు ఉండవు ఫ్లోరైడ్ అనే పదం మరచిపోతాం. వెలిగొండ ప్రాజెక్టుకు భూములు త్యాగం చేసిన ప్రజలకు పాదాభివందనం చేస్తున్నా. కరవుపై గెలవాలన్న సంకల్పంతో ముందడుగు వేశాం. వెలిగొండ అంటే ఫ్లోరైడ్ కష్టానికి ముగింపు. కరవు నేలపై కృష్ణమ్మ రాసిన కొత్త చరిత్రని' చంద్రబాబు వ్యాఖ్యానించారు.
"నాడు చేసిన సంకల్పం నేడు నల్లమల సాగర్‌లో జలసిరిగా మారింది. నాడు వేసిన పునాదిరాయి నేడు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఇది భగీరథ ప్రయత్నం కొండలు వస్తే తొలచి ముందుకెళ్లాం. ఎదురైన ప్రతి సవాల్‌ను అధిగమించి ముందుకెళ్లాం. వెలిగొండ కోసం పనిచేసిన ప్రతిఒక్కరికీ అభినందనలు. నిమ్మల రామానాయుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నిర్వాసితులు కూడా సంతోషంగా ఉండాలనేది నా ఆకాంక్ష. ఆర్థికంగా కష్టాలున్నా ఎక్కడా వెనుకడుగు వేయలేదు.చేతగాకపోతే తప్పు లేదు చేశామని మోసం చేస్తేనే పెద్ద తప్పు. ఫేక్ మాటలు చెప్పేవారిని నిలదీయకపోతే అవే వాస్తవాలు అనుకుంటారు. ఆవేదనతో చెబుతున్నా ఫేక్ మాటలను సమర్థంగా తిప్పికొట్టాలి." - చంద్రబాబు, ముఖ్యమంత్రి
'శ్రీశైలం ప్రాజెక్టులోని కొల్లం వాగు నుంచి నీటిని గ్రావిటీ ద్వారా తెస్తున్నాం. 53 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం కలుగుతుంది. రూ.10,200 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో రూ.7,983 కోట్లతో మొదటి దశ పూర్తిచేశాం. 18.8 కిలోమీటర్ల మేర జంట సొరంగాలు, 21.8 కిలోమీటర్ల ఫీడర్ కాల్వల పనులు పూర్తిచేశాం. 48 రోజుల్లోనే 6,206 నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్లు పరిహారం అందించాం. ఆర్థికంగా కష్టాలున్నా మీ బాధలు గుర్తించి అదనంగా మరో రూ.169 కోట్లు చెల్లిస్తున్నాం. కటాఫ్ డేట్ పెంచి 18 ఏళ్లు నిండిన యువత ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఇస్తున్నామని' చంద్రబాబు తెలిపారు.
నల్లమల సాగర్ నుంచి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. సెప్టెంబర్‌లో లక్ష కోట్ల గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టులో మార్కాపురాన్ని భాగం చేశామన్నారు. వెనుకబడిన ఈ ప్రాంతం పొరుగు జిల్లాలకు పోటీగా నిలుస్తుందని చెప్పారు. వెలిగొండ తొలి దశతో ఆగము ఫేజ్ 2 కూడా 2028కి పూర్తి చేస్తాం. 2047 స్వర్ణాంధ్రకు అందరూ సిద్ధమని సంకల్పించాలని చంద్రబాబు పేర్కొన్నారు.
'నీటి సమస్యకు ఏకైక పరిష్కార మార్గం నదుల అనుసంధానం. నదుల అనుసంధానం జరగాలంటే ప్రధాని మోదీకే సాధ్యం. పోలవరం రాష్ట్రానికే జీవనాడి. పోలవరాన్ని 2027 మార్చికి పూర్తిచేసి జాతికి అంకితం చేస్తాం. రాబోయే కృష్ణా పురస్కారాలను మార్కాపురంలో కూడా జరుపుకోబోతున్నాం. గోదావరి నీళ్లు సముద్రంలోకి వృథాగా పోతున్నాయి. వృథాగా వెళ్లే నీటిని దారిమళ్లిస్తే ప్రజలకు సంపద సృష్టించొచ్చు. గోదావరి నీళ్లు కూడా నల్లమల సాగర్‌కు రావాలి. బుధవారం నాడు పోలవరం ఎడమ కాల్వ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లికి తీసుకెళ్తున్నాం. ఉత్తర భారత్‌లో నదుల అనుసంధానానికి అనేక సమస్యలు పరిష్కరించారు. దక్షిణ భారత్‌లో కూడా గోదావరి, కావేరి అనుసంధానం చేయాలి. నదుల అనుసంధానంతో దేశం సుభిక్షంగా ఉంటుందని' చంద్రబాబు స్పష్టం చేశారు.
"నాకు రాజకీయం అంటే ఎన్నికలు కాదు. ప్రజల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావడం. ఓట్ల ఆశించి కాదు మార్పు ఆశించి పనిచేస్తా. నెక్స్ట్ ఎన్నికల కోసం కాదు నెక్స్ట్ జనరేషన్ కోసం పనిచేస్తా. నా ఊపిరి ఉన్నంతవరకు తెలుగు జాతి కోసం కష్టపడతా. అందరం కలిసి తెలుగుజాతిని ప్రపంచంలోనే నెంబర్ వన్ చేద్దాం." - చంద్రబాబు, ముఖ్యమంత్రి
వెలిగొండ నిర్వాసితుల త్యాగాలను ప్రభుత్వం ఎప్పటికీ మరచిపోదు: సీఎం చంద్రబాబు
'మా మొర ఆలకించండి సారూ' - వెలిగొండ నిర్వాసితుల్లో పునరావాస వెలితి!

