హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ లక్ష్యాల సాధనకు 2026లో మరిన్ని అడుగులు పడాలి: సీఎం చంద్రబాబు
రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం చంద్రబాబు, మంత్రులు - 2025లో కూటమి ప్రభుత్వ పాలన మరిచిపోలేని విజయాలను అందించిందని వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 31, 2025 at 10:34 PM IST
New Year Wishes By CM Chandrababu: రాష్ట్ర ప్రజలందరికీ సీఎం చంద్రబాబు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వ పాలన మరిచిపోలేని విజయాలను అందించిందని అలానే ఎన్నో మైలురాళ్లను చేరుకుందని తెలిపారు. అనేక సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు 2025 ఏడాది నాంది పలికిందని వెల్లడించారు. ఏ రంగంలో చూసినా 2025 కేవలం ఒక గడిచిన సంవత్సరం కాదని నాటి విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించిన గొప్ప మలుపని అభివర్ణించారు.
ఎన్నో సంక్షోభాలను, సమస్యలను, సవాళ్లను అధిగమించి గొప్ప పురోగతి సాధించిన సంవత్సరంగా 2025 గుర్తుండిపోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇదే స్ఫూర్తితో ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం ప్రారంభమయ్యే 2026 నూతన సంవత్సరం అందరి జీవితాలలో కొత్త కాంతులు నింపాలని మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ప్రజలకు రెట్టింపు సంతోషం, సంక్షేమం, అభివృద్ధి అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ ఏడాది మరెన్నో అడుగులు పడాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయిర్ శుభాకాంక్షలు చెప్పారు.
నారా లోకేశ్ శుభాకాంక్షలు: 2026 నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆశయాల సాధనకు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిద్దామని కలలు సాకారం చేసుకునేందుకు క్రమశిక్షణతో శ్రమిద్దామని పిలుపునిచ్చారు. శాంతి, క్రాంతిని పెంచేందుకు ఈ కొత్త ఏడాదిలో సమష్టి కృషి చేద్దామన్నారు. ప్రగతి-సంక్షేమాలతో నవవసంతం ప్రజలకు ఆయురారోగ్య, ఆనందాలు పంచాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రానికి స్వర్ణయుగంగా 2026: నూతన సంవత్సరం సందర్భంగా మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, గొట్టిపాటి రవి, పయ్యావుల కేశవ్, నారాయణ, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్థన్ రెడ్డి, గుమ్మడి సంధ్యారాణి, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, సవిత, టీజీ భరత్, వాసంశెట్టి సుభాష్‌లు శుభాకాంక్షలు తెలిపారు. 2026లో కూటమి ప్రభుత్వం ప్రజలకు మరింత మెరుగైన సేవలందించడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని స్పష్టం చేశారు. పాలనలో పారదర్శకత, ప్రజల అవసరాలకు ప్రాధాన్యం, సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమన్వయం చేస్తూ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.
రైతులకు ఆర్ధిక భరోసా, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు భద్రత, పేదలకు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందన అన్నారు. ప్రజల సహకారంతో 2026 సంవత్సరం రాష్ట్రానికి స్వర్ణయుగంగా మారుతుందని, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ దేశానికి ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నూతన సంవత్సరం ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, శాంతి, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో నూతనోత్సహాంతో కొత్త అవకాశాలను అన్వేషించి లక్ష్యాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. గత సంవత్సరపు మధుర జ్ఞాపకాలను మదిలో గుర్తుతెచ్చుకుంటూ సరికొత్త ప్రయాణానికి సిద్ధమవ్వాలని మంత్రులు సూచించారు.
యువత హద్దులో ఉండాలని సూచన: విజయవాడ కనకదుర్గ వారధి, నేతాజీ బ్రిడ్జి వద్ద పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు ఉత్తర్వుల మేరకు న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని యువత హద్దుల్లో ఉండాలని మందు తాగి వాహనం నడిపితే చట్టపర మైన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఎటువంటి ర్యాలీలకు అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు సైలెన్సర్లు లేకుండా శబ్ద కాలుష్యం చేస్తే కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడ బందర్ రోడ్డు మరియు బెంజ్ సర్కిల్ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

