రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం: సీఎం చంద్రబాబు
అసెంబ్లీ లాబీలో మీడియాతో సీఎం మాటా మంతీ - ఆదాయం తక్కువ-ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వంగా వస్తుందన్న సీఎం - వచ్చే 2-3ఏళ్లలో మరింత మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతామని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 14, 2026 at 4:30 PM IST
CM Chandrababu Naidu Comments on State Budget : రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వచ్చే 2-3 ఏళ్లలో మరింత మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. వైఎస్సార్సీపీ విధ్వంసం నుంచి కోలుకోవాలంటే ఇంకా సమయం పడుతుందని చెప్పారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో సీఎం మాటా మంతీ నిర్వహించారు. ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతున్నామని, రాష్ట్రంలో సమస్యలు ఇంకా చాలా ఉన్నాయని తెలిపారు.
ఆదాయం తక్కువ-ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వంగా వచ్చిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నామన్నారు. వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాలని, సేవా రంగంలోనూ ఆదాయం పెరగాలని చెప్పారు. మన రాష్ట్రంలో ఒంగోలు పాలకు, అనంతపురం పండుకు ఎంతో డిమాండ్ ఉందని చంద్రబాబు అన్నారు. ఈ రెండింటి రుచీ మరెక్కడా రాదని వెల్లడించారు. రెండు మూడేళ్ళలో అమరావతికి ఒక రూపు వస్తుందని తెలిపారు. అమరావతి దారుల్ని జాతీయ రహదారికి అనుసంధానిస్తున్నామని, అమరావతికి రాకపోకలు పెరిగి ఆదాయమూ వస్తుందని వివరించారు. అమరావతికి పశ్చిమ బైపాస్ వల్ల యాక్సిస్ పెరిగిందన్న సీఎం, ఇన్నర్ రింగ్, ఔటర్ రింగ్ రోడ్డుతో మరింత పెరుగుతుందని అన్నారు.
రాయలసీమ ముఖచిత్రం మార్చింది మేమే: సీఎం
రాయలసీమ ముఖచిత్రం మార్చింది తామేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాయలసీమ హార్టీకల్చర్ హబ్‌కు రూ.30 వేల కోట్లు కేటాయించడం పట్ల ఎమ్మెల్యేలు అంతా సంతోషంగా ఉన్నారన్నారు. ఒక్కప్పుడు పశువులకు నీరు కూడా రాయలసీమలో దొరికేది కాదని గుర్తుచేశారు. రాయలసీమకు రైలులో పశుగ్రాసం, నీళ్లు తరలించిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. 2014-19 మధ్య రైన్ గన్స్‌తో పంటలను కాపాడాల్సిన పరిస్థితి ఉందన్నారు. అప్పుడే హంద్రీనీవాను సీరియస్‌గా తీసుకున్నామన్న చంద్రబాబు, ఆ ఫలితాలు ఇప్పుడు చూస్తున్నామని తెలిపారు. దేశంలోనే ఉత్తమమైన పండ్లు రాయలసీమ నుంచి వస్తున్నాయని, అక్కడ పండే దానిమ్మకు మంచి డిమాండ్ ఉందని వెల్లడించారు.
గతంలో ఉన్నట్లే నిక్కచ్చిగానే ఉంటా: ఎమ్మెల్యేలకు సీల్డ్ కవర్లో ఇచ్చే నివేదిక ద్వారా వారిని వారికి అద్దంలో చూపిస్తున్నానని సీఎం తెలిపారు. 95-96 మాదిరిగానే నిక్కచ్చిగా ఉంటానన్న చంద్రబాబు, మారకపోతే వాళ్లకే నష్టమన్నారు. మొత్తం 9 పేరా మీటర్లలో సర్వే చేయించి వారికి నివేదిక ఇస్తున్నాననన్నారు. వారికి తెలియని ఇంకొన్ని పేరామీటర్లు కూడా తనవద్ద ఉన్నాయన్నారు. లోకేశ్ తన పని తాను చేస్తున్నానని అన్నారు. నేతలతో మానవీయ సంబంధం, మోటివేషన్ రెండూ భయం-భక్తీలా ఉండాలని స్పష్టం చేశారు. మంగళగిరి చీరలకు లోకేశ్ బాగా బ్రాండింగ్ కల్పిస్తున్నారని ప్రశంసించారు. బడ్జెట్ వేళ మహిళా ఎమ్మెల్యేలంతా ఒకే రకమైన చీరలతో రావటం ఐక్యతకు నిదర్శనంగా బాగుందని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
సామజిక న్యాయం దిశగా పయనం నుంచి: ఇది 2026-27 సంవత్సరానికి ఒక ఆకాంక్షాత్మక బడ్జెట్ అని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. కేటాయింపులు చేయబడిన బడ్జెట్ సమస్యలను ఈ బడ్జెట్ తీరుస్తుందని తాము ఆశిస్తున్నామని అన్నారు. ఇది ఆర్థిక వివేకాన్ని సాధించడానికి ఒక సూచనగా పేర్కొన్నారు. ఈ బడ్జెట్ మరింత పెరుగుతున్న రుణాన్ని నియంత్రించే అవకాశం ఉందని తెలిపారు. రుణ మార్పిడి, ప్రతిపాదిత పరిష్కార చర్యలు రాష్ట్రాన్ని అధిక పేరుకుపోయిన అప్పు నుంచి బయటపడేస్తాయన్నారు. పరిశ్రమలు పెట్టుబడుల అభివృద్దికి ప్రయారిటీ మంచి పరిణామమని అన్నారు. సామాజిక న్యాయం దిశగా పయనం మంచి పరిణామమని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు.
దేశ అభివృద్ధికి బడ్జెట్ ఒక ముఖ్యమైన పునాది: ఇది ప్రజా బడ్జెట్, పేదల సంక్షేమ బడ్జెట్, రైతన్నకు మేలు చేసే బడ్జెట్, విద్య, వైద్యానికి ప్రాధాన్యత నిచ్చే బడ్జెట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా సంక్షేమ బడ్జెట్ ఇది. రూ.3,32,205 కోట్ల బడ్జెట్ అని మంత్రి గుమ్మడి సంధ్యరాణి కొనియాడారు. దేశ అభివృద్ధికి బడ్జెట్ ఒక ముఖ్యమైన పునాది అని, ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా బాగుందన్నారు. ప్రజలు ఏ నమ్మకంతో చంద్రబాబుని నమ్మి ఓట్లు వేసి అధికారంలోకి తెచ్చారో, ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఈ బడ్జెట్ ఉందని గర్వంగా చెప్పగలననన్నారు.
వ్యవసాయ రంగానికి మద్దతుగా: తన రెండు శాఖలకు కేటాయించిన నిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్టీ సంక్షేమానికి 9,190 కోట్లు, మహిళా సంక్షేమానికి రూ.4,582 కోట్లు కేటాయించారన్నారు. ఇది సాధారణ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిన సమతుల్యమైన ఆర్థిక ప్రణాళికగా నిలిచిందని తెలిపారు. ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. వ్యవసాయ రంగానికి మద్దతుగా సబ్సిడీలు, సాగు నీటి ప్రాజెక్టులు, ఆధునిక సాంకేతికతలను అందించేందుకు చేసిన ప్రకటనలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయన్నారు.
ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా అభివృద్ధి: యువతకు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం గొప్ప నిర్ణయంగా పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పన్ను సడలింపులు కల్పించడం వలన కొత్త వ్యాపారాలు ప్రారంభమవుతాయన్నారు. దీని వల్ల ఉద్యోగ అవకాశాలు పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. విద్య, ఆరోగ్య రంగాలకు అధిక కేటాయింపులు చేయడం కూడా ఈ బడ్జెట్ ప్రత్యేకత అని వివరించారు. పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు కేటాయించడం వలన ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు.
ఆరోగ్యకరమైన, విద్యావంతమైన సమాజమే దేశ ప్రగతికి బలమైన ఆధారమని తెలిపారు. మహిళల సాధికారతకు, స్వయం సహాయక సంఘాలకు మద్దతు ఇవ్వడం ద్వారా సమాజంలో సమానత్వాన్ని పెంపొందించే ప్రయత్నం చేయడం ఈ బడ్జెట్ మరో విశేషమన్నారు. ఇది మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని తెలిపారు. మొత్తం మీద ఈ బడ్జెట్ సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ప్రగతిశీలమైన ప్రణాళికగా కనిపిస్తుందన్నారు. ప్రతి వర్గానికీ ప్రయోజనం కలిగేలా రూపొందించిన ఈ బడ్జెట్ నిజంగా చాలా బాగుంది అని గర్వంగా చెప్పవచ్చని అన్నారు. ఇది రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్తుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆకాంక్షించారు.
రూ.3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్ - ఏఏ శాఖకు ఏంతెంత కేటాయించారంటే?
వ్యవసాయ, అనుబంధ శాఖల బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్న - ఎంత కేటాయించారంటే!

