ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రాఖీ పౌర్ణమి - సీఎం చంద్రబాబు, మంత్రులకు రాఖీ కట్టిన అక్కాచెల్లెమ్మలు

ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాఖీ కట్టిన మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు - మహిళల భద్రత, సాధికారత కోసం శ్రమిస్తామన్న మంత్రులు - పోలీసులకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించిన హోంమంత్రి అనిత

Raksha Bandhan celebrations in AP
సీఎం చంద్రబాబుకు రాఖీ కట్టిన అక్కాచెల్లెమ్మలు (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 28, 2026 at 8:36 PM IST

2 Min Read
Choose ETV Bharat

Raksha Bandhan Celebrations in AP : రాష్ట్రవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ప్రజాప్రతినిధులకు మహిళా నేతలు, సోదరీమణులు రాఖీలు కట్టి తమ అభిమానం చాటుకున్నారు. మహిళల భద్రత, సాధికారత, ఉజ్వల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తామని ఈ సందర్భంగా నేతలు అక్కాచెల్లెమ్మలకు హామీ ఇచ్చారు. పలుచోట్ల రాఖీ వేడుకలను వినూత్న రీతిలో నిర్వహించి ఆకట్టుకున్నారు.

సీఎం, లోకేశ్‌కు రాఖీలు : రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. సీఎం వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సవిత, టీడీపీ మహిళా నేతలు పీతల సుజాత, గద్దె అనురాధ, ఆచంట సునీత తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. మరోవైపు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు మంత్రి సవిత, ఎమ్మెల్యే గళ్లా మాధవి రాఖీ కట్టారు. తనకు తోడబుట్టిన సోదరీమణులు లేకున్నా, దేవుడు కోట్లాది మంది అక్కాచెల్లెమ్మలను తోడుగా ఇచ్చారని లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించేలా నైతిక విలువలతో కూడిన పాఠాలు బోధిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రాఖీ పౌర్ణమి - సీఎం చంద్రబాబు, మంత్రులకు రాఖీ కట్టిన అక్కాచెల్లెమ్మలు (ETV Bharat)

పోలీసులకు హోంమంత్రి రాఖీ : అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని తన నివాసంలో హోంమంత్రి అనిత, పోలీసులకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలు ఆనందంగా, సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు. మరోవైపు మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు ఆయన సోదరీమణులు రాఖీలు కట్టారు. అక్కాచెల్లెళ్ల ప్రేమ తనకు కొండంత బలం, సంతోషాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. కాకినాడ జిల్లా కొప్పవరం టీడీపీ కార్యాలయంలో ఎంపీ సానా సతీష్‌ బాబుకు జెన్‌-జీ విద్యార్థినులు రాఖీ కట్టారు. ఆయన వారితో కలిసి అల్పాహారం చేశారు.

నేతల ఇళ్లలో సందడి : పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన మహిళలు రాఖీలు కట్టారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ తన స్వగృహంలో వేడుకలు నిర్వహించారు. టీడీపీ, జనసేన పార్టీల మహిళలు ఆయనకు రాఖీలు కట్టి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన తనయుడు మండలి వెంకట్ రామ్ పాల్గొన్నారు. అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావుకు మహిళలు రాఖీ కట్టారు. మహిళల భద్రత, సంక్షేమం, ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు. విజయనగరంలో విజ్ఞాన భారతి పాఠశాల విద్యార్థినులు, జిల్లా కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

వినూత్నంగా రాఖీ వేడుకలు : కొన్నిచోట్ల రాఖీ వేడుకలను వినూత్న రీతిలో నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాంటిస్సోరి పాఠశాలలో 200 మందికి పైగా విద్యార్థులు రాఖీ ఆకారంలో నిలబడి అద్భుతంగా ఆకట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణపురంలోని శ్రీ సత్యసాయి విద్యావిహార్‌లోనూ విద్యార్థులు రాఖీ ఆకారంలో మానవహారంగా ఏర్పడి సందడి చేశారు. కోనసీమ జిల్లా పాశర్లపూడిలో ఓ దుకాణంలో కొబ్బరి చిప్పలతో చేసిన రాఖీలు అబ్బురపరుస్తున్నాయి. పర్యావరణ హితంగా శ్రీకృష్ణుడు, ఓంకారం, అన్నదమ్ముల అనుబంధాన్ని చాటే బొమ్మలతో ఉన్న ఈ రాఖీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అక్కా చెల్లెమ్మలకు లోకేశ్​ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

ఏపీలో ఘనంగా రాఖీ వేడుకలు - శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు