'సమస్యలపై వేగంగా స్పందించండి' - జిల్లా నేతలు, అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
అసెంబ్లీ సమావేశాల తర్వాత జిల్లా నేతలతో సీఎం చంద్రబాబు భేటీ - ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్ మంత్రి, ఎంపీ, కలెక్టర్, ఎస్పీతో సమావేశం - 3-4 నెలల్లో చేపట్టే కార్యక్రమాలు, పరిష్కరించే అంశాలపై చర్చ

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 13, 2026 at 10:28 PM IST
CM Chandrababu meet Leaders after Assembly Sessions: ప్రజా ప్రతినిధులు-ప్రభుత్వ అధికారుల పరస్పర సమన్వయంతో పాలనలో వేగం పెంచేందుకు సీఎం చంద్రబాబు కార్యాచరణ రూపొందించారు. ఎమ్మెల్యేలు- ప్రభుత్వ అధికారులు కలిసి ముందుకు సాగడం ద్వారా మంచి ఫలితాలు సాధించేలా దృష్టి సారించారు. ప్రభుత్వం చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై కూటమి ప్రభుత్వ ముద్ర కనపడేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశం అనంతరం ప్రతి రోజూ ఒక జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇన్‌ఛార్జ్ మంత్రి, కలెక్టర్, ఎస్పీలతో చంద్రబాబు సమావేశమవుతున్నారు. స్థానిక సమస్యల సత్వర పరిష్కారం, పాలనలో వేగం పెంచేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులతో భేటీ నిర్వహిస్తున్నారు.
వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమల్లో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో చర్చిస్తున్నారు. సీఎంతో సమావేశం అనంతరం జిల్లా నేతలతో మంత్రి నారా లోకేశ్ డిన్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. నేడు చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇంఛార్జ్ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి, కలెక్టర్, ఎస్పీతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. దాదాపు 2 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించిన సీఎం చిత్తూరు జిల్లాలో 2024ను మించిన విజయం 2029లో వచ్చేలా అంతా కలిసి అలా పనిచేయాలని సూచించారు. చిత్తూరు జిల్లాలో తాను, అమర్నాథ్ రెడ్డి తప్ప మిగిలిన అంతా తొలి సారి ఎమ్మెల్యేలుగా గెలిచినవాళ్లేనన్న చంద్రబాబు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ వారితో కలిసి పోయి వారి సమస్యలు పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు.
కార్యకర్తలకు అందుబాటులో ఉండే విషయంలో ఏ మాత్రం రాజీ పడవద్దని సీఎం స్పష్టం చేశారు. వివిధ మార్గాల ద్వారా తాను తెప్పించుకుంటున్న సర్వేలు, నివేదికల ఆధారంగా వచ్చిన ఫీడ్ బ్యాక్‌ను చంద్రబాబు ఎమ్మెల్యేలతో పంచుకున్నారు. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండడం, స్థానిక సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టడం, అధికారులతో సమన్వయం చేసుకోవడం, పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించడం, పొలిటికల్ యాక్టివిటీ చేయడం వంటి అంశాలపై ఎమ్మెల్యేల పనితీరుపై చర్చించారు. ప్రతి ఎమ్మెల్యే పనితీరుపై సీల్డ్ కవర్లో ఫెర్ఫామెన్స్ రిపోర్ట్‌ను అందజేశారు. బాగా పనిచేస్తున్న వారిని అభినందించిన సీఎం వెనుకబడిన వారికి సూచనలు చేశారు.
సమస్యలపై, అర్జీలపై వేగంగా స్పందించాలి: నేతలు అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్న సీఎం జిల్లా అధికారులు కూడా ఆయా సమస్యలపై, అర్జీలపై మరింత వేగంగా స్పందించాలని దిశానిర్దేశం చేశారు. పరిశ్రమలు, హెల్త్ సెంటర్లు, రోడ్డు ప్రమాదాలు, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సేవలు, ఆర్టీసీ సర్వీసులు, తాగునీరు సహా అనేక అంశాలపై వచ్చిన నివేదికలపై అధికారులు, ఎమ్మెల్యేలతో సీఎం చర్చించారు. నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు, సిబ్బందిని సమర్థవతంగా వినియోగించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంగా కారణంగా నిలిచిపోయిన అభివృద్ది కార్యక్రమాలు, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న వివిధ పనులు, నియోజకవర్గం స్థాయిలో చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టులపై సీఎం దిశానిర్దేశం చేశారు.
చిత్తూరు పట్టణంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి అడవిపల్లి రిజర్వాయర్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చిత్తూరులో కొత్త రైల్వే బ్రిడ్జ్ నిర్మించాలని ఎమ్మెల్యే కోరగా దీన్ని ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు. చిత్తూరు జిల్లాలో ఎకనమిక్ యాక్టివిటీ పెంచేందుకు అమలు చేయాల్సిన ప్రణాళికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించారు. స్థానికంగా ఉన్న ఉత్పత్తులు వాటికి అనుగుణంగా తీసుకురాదగిన పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు.
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వసతుల కల్పన, ఆసుపత్రిలో కొత్త నిర్మాణాల పూర్తికి అధికారులకు సీఎం ఆదేశించారు. జిల్లాలో ఎలక్ట్రానిక్ క్లష్టర్ ఏర్పాటుకు అనువైన భూములు, కనెక్టవిటీ ఉందని ఎమ్మెల్యేలు తెలిపారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్ కలిసి వివిధ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన బ్లూ ప్రింట్‌తో తన వద్దకు ప్రతిపాదనలతో రావాలని సూచించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో మరింత కఠినంగా ఉండాలని ఎస్పీకి స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధుల పనితీరుతో పాటు అధికారుల పనితీరుపైనా నివేదికలు తెప్పించుకుంటున్నానని తెలియజేశారు. సమన్వయం విషయంలో ఎక్కడ లోపం ఉన్నా ప్రభుత్వాని నష్టం జరుగుతుందని ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ప్రజల వద్దకు వెళ్తే పాజిటివ్ ఫలితాలు వస్తాయని సూచించారు.
ప్రతి ఒక్కరికీ ఏఐ డాక్టర్ - ఏం తినాలి, ఏం చేయాలో చెబుతుంది: సీఎం చంద్రబాబు
రైతులందరూ ధైర్యంగా ఉండండి - మీ కోసం ప్రభుత్వం పని చేస్తుంది: ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

