భవిష్యత్తులో పాప్‌కార్న్ అంటే గుర్తొచ్చేది ముసునూరే: సీఎం చంద్రబాబు
నూతన పాప్‌కార్న్ సీడ్‌ను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు - కాట్రేనిపాడులో గోర్మే పాప్ కార్నికా సంస్థ ఆధ్వర్యంలో మెుక్కజొన్న సీడ్ ఆవిష్కరణ

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 24, 2026 at 1:49 PM IST
Non-Gmo Popcorn Maize Hybrid Seeds : భవిష్యత్తులో పాప్‌కార్న్ అంటే ముసునూరు గుర్తొస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏలూరు జిల్లా కాట్రేనిపాడులో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో కలసి నూతన పాప్‌కార్న్ సీడ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసే రోజు దగ్గర్లోనే ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచ మార్కెట్‌లోకి తీసుకెళ్లే ఉత్పత్తికి ఎన్నో రెట్లు విలువ పెరుగుతుందని పేర్కొన్నారు. అందుకే ఫుడ్ ప్రాసెసింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, స్వదేశీ విధానాలతో స్వయం సమృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.
గత 11 ఏళ్లలో పాప్‌కార్న్ మొక్కజొన్న ఉత్పత్తి వాటా 65 శాతానికి పెరగడం విశేషమన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలకు ఇక్కడి పాప్‌కార్న్‌ను ఎగుమతి చేసే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. రవాణా సౌకర్యాలపై రైల్వే మంత్రితో మాట్లాడతానని ఉపరాష్ట్రపతి హామీ ఇచ్చారని తెలిపారు. ముసునూరు పాప్‌కార్న్‌తో పాటు అరకు కాఫీని దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో విక్రయించేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
11 ఏళ్లలో 8 రాష్ట్రాలకు వెళ్లడం చిన్న విషయం కాదు: ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా చేపట్టడం వల్లే తక్కువ కాలంలో ఈ విజయం సాధ్యమైందని సీఎం చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 17,500 మంది రైతులు 40 వేల ఎకరాల్లో పాప్‌కార్న్ మొక్కజొన్న సాగు చేస్తున్నారని వివరించారు. కేవలం 11 ఏళ్లలో 8 రాష్ట్రాలకు విస్తరించడం చిన్న విషయం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రోజుకు 29 టన్నుల సామర్థ్యంతో పనిచేసే ఈ ప్రాసెసింగ్ కేంద్రం ఆసియాలోనే అతిపెద్దదని, 69 శాతం మార్కెట్ వాటా సాధించడం గర్వకారణమన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు.
"మన ఉత్పత్తులు ప్రపంచానికి ఎగుమతి చేసే రోజు దగ్గర్లోనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లే వస్తువు విలువ చాలా రెట్లు పెరుగుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. స్వదేశీ విధానంతో స్వయం సమృద్ధి సాధించాలి. మన ఉత్పత్తులు ప్రపంచానికి ఎగుమతి చేసే రోజు దగ్గర్లోనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లే వస్తువు విలువ చాలా రెట్లు పెరుగుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి" -చంద్రబాబు, సీఎం
రైతు ప్రగతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం: ఉపరాష్ట్రపతి సీ.పీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ రైతులే దేశానికి వెన్నెముక అని అన్నారు. కాలానికి అనుగుణంగా పంటలు పండిస్తూ దేశానికి అన్నం పెట్టేది రైతేనని కొనియాడారు. విత్తనం నుంచి పంట కోత వరకు సాగే వ్యవసాయ చక్రం ఆధారంగానే మన పండుగలు ఏర్పడ్డాయని చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ కాలాల్లో పంటల పండుగలు జరుపుకోవడం భారత వ్యవసాయ సంస్కృతికి నిదర్శనమన్నారు.
దేశంలోని శ్రామిక శక్తిలో 46.1 శాతం మందికి వ్యవసాయ రంగమే ఉపాధి కల్పిస్తోందని, దాదాపు 55 శాతం జనాభాకు జీవనాధారంగా వ్యవసాయం కొనసాగుతోందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. రైతులు సాధించిన ప్రగతిని ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
'బ్రిక్స్' దేశాలతో క్రీడా భాగస్వామ్యానికి ఏపీ సిద్ధం: సీఎం చంద్రబాబు
స్ఫూర్తిదాయక ఘటన: అమరావతి నిర్మాణానికి రూ.50 వేలు విరాళమిచ్చిన వృద్ధుడు

